తెలంగాణ బరి నుండి మోడీ, సోనియా, రాహుల్, ప్రియాంక ... ఎవరూ లేరు!
కానీ ఇప్పటి వరకు కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించకపోవడం ఆ పార్టీలో ఉన్న గందరగోళానికి నిదర్శనం.
By: Tupaki Desk | 16 April 2024 4:41 AM GMTఖమ్మం నుండి ఈ సారి సోనియాగాంధీ పోటీ చేస్తారు. మెదక్ నుండి రాహుల్, హైదరాబాద్ నుండి మోడీ, తెలంగాణ నుండి ప్రియాంక బరిలోకి అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు గత ఏడాది నుండి పలు మీడియా సమావేశాలలో ఊదరగొట్టారు. తెలంగాణ మీద ఫోకస్, అధిక సీట్లు సాధించి పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపేందుకు ఈ సారి బరిలోకి అధి నాయకులు అంటూ ప్రకటనలు ఇచ్చేవారు.
ఇక తమకు సీటు రాదు అనుకున్న కొందరు నేతలు ఆయా స్థానాల నుండి అధిష్టానం పెద్దలు పోటీకి దిగాలని ప్రతిపాదనలు చేస్తుంటారు. ప్రతి సారి లోక్ సభ ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రతిపాదనలు చేయడం ప్రహసనంగా మారింది.
తెలంగాణలో ఒకటీ, అరా స్థానాలకు పరిమితం అయిన బీజేపీ గత ఎన్నికల్లో నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాలలో విజయం సాధించింది. అయితే అటు లోక్ సభ, ఇటు శాసనసభ ఎన్నికల్లో గెలుపు ఆయా స్థానిక పరిస్థితులు, నిలబడ్డ అభ్యర్థుల వ్యక్తిగత బలాలు తప్పితే బీజేపీకి సంస్థాగతంగా తెలంగాణలో అంత బలం లేదు అన్నది వాస్తవం.
గత ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన ధర్మపురి అరవింద్, బండి సంజయ్ లు శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో సానుభూతి సాధించేందుకు శాసనసభకు పోటీ చేశారు అన్న వాదన కూడా వినిపిస్తున్నది. అయితే సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు బీజేపీ టికెట్ నిరాకరించడమే ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని తెలియజేస్తుంది. కేవలం మోడీ ఆకర్షణ, జాతీయవాదం, హిందుత్వవాదం నినాదాలే ప్రాతిపదికగా ఆభ్యర్థుల ఊసులేకుండా ఆ పార్టీ ఎన్నికలలో గెలుపును ఆశిస్తున్నది. అందుకే మోడీ ఇక్కడి నుండి పోటీ చేస్తారు అని ప్రకటనలతో ఊదరగొట్టారు. కానీ మోడీ మాత్రం తన సిట్టింగ్ స్థానం వారణాసి నుండి తిరిగి బరిలోకి దిగారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అనూహ్యంగా అధికారం దక్కింది. అయితే అది లోక్ సభ ఎన్నికలలో ఎంత వరకు పనిచేస్తుంది అన్నది అనుమానంగానే ఉన్నది. అధికారం ఉంది కాబట్టి గాలివాటంగా గెలుస్తామని ఆ పార్టీ నేతలు తమ కుటుంబ సభ్యులను పోటీకి దించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ప్రస్తుతం ఉన్నది 25 రోజులే. కానీ ఇప్పటి వరకు కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించకపోవడం ఆ పార్టీలో ఉన్న గందరగోళానికి నిదర్శనం.
అందుకే ఆ పార్టీ నేతలు సోనియా పోటీ చేస్తారు, ప్రియాంక పోటీ చేస్తారు. రాహుల్ వస్తారు అని ఊదరగొట్టారు. అయితే యూపీలో పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ తిరిగి మరోసారి కేరళలోని వాయనాడ్ నుండి బరిలోకి దిగారు. ఇక సోనియాగాంధీ నేరుగా రాజ్యసభ సీటు తీసుకుని సరిపెట్టుకున్నారు. ప్రియాంకాగాంధీ ఇంకా రాయ్ బరేలీ, అమేధి, తాజాగా డెహ్రడూన్ నుండి పోటీ చేస్తారని ఊహాగానాలకే పరిమితం అయ్యారు.
గతంలో మెదక్ నుండి ఇందిరాగాంధీ పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి తప్పితే ఇప్పటి వరకు ఉత్తరాదికి చెందిన ఏ అగ్రనేత కూడా తెలంగాణ నుండి బరిలోకి దిగిన దాఖలాలు లేవు. కానీ తరచూ ఎన్నికల ముందు అగ్రనేతలు పోటీకి దిగుతారని స్థానిక నేతలు ప్రకటనలు చేయడం పరిపాటిగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏ అంశం ప్రభావితం చేస్తుందో ఎవరికీ అర్ధం కాదు. అందుకే ఏ పార్టీ నేతలయినా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సేఫ్ జోన్ నే ఎంచుకుంటారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని ప్రకటనలు చేసినా ఆయా పార్టీల పెద్దలు తెలంగాణ నుండి పోటీకి మొహం చాటేసి పారిపోయారనే చెప్పాలి.