సీఎం పదవి.. పీసీసీ అధ్యక్షుడికా.. సీఎల్పీ నాయకుడికా..?
పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది.. తెలంగాణ ఇచ్చి కూడా ఎన్నో డక్కామొక్కీలు తిన్న ఆ పార్టీకి పూర్వ వైభవం దక్కింది
By: Tupaki Desk | 3 Dec 2023 7:28 AM GMTపదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది.. తెలంగాణ ఇచ్చి కూడా ఎన్నో డక్కామొక్కీలు తిన్న ఆ పార్టీకి పూర్వ వైభవం దక్కింది. కర్ణాటక ప్రభావమో.. అగ్ర నేతల ప్రచారమో.. రాష్ట్ర నాయకుల పట్టుదలో.. మరేదైనా కానివ్వండి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడిక చర్చ జరగాల్సింది ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరు కానున్నారు అనేదే.. గతంలో ఎందరో కాంగ్రెస్ నాయకులు సీఎంలుగా పనిచేశారు. వారంతా కాంగ్రెస్ శాసన సభా పక్షం నేతగానో, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగానో ఉంటూ ముఖ్యమంత్రులు అయ్యారు. మరి ఇప్పుడు ఎవరు..?
అటు రేవంత్.. ఇటు భట్టి..
కాంగ్రెస్ లో రాష్ట్ర పార్టీని పద్రేశ్ కాంగ్రెస్ (పీసీసీ) అంటారు. దీని అధ్యక్షుడు దాదాపు పార్టీ కేడర్ కు సీఎంతో సమానం. మరో అత్యంత కీలక పోస్టు కాంగ్రెస్ శాసన సభా పక్షం (సీఎల్పీ). సీఎంగా ఎవరు ఎన్నికయితే వారే సీఎల్పీ నాయకుడు అవుతారు. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం.. సీఎల్పీ నాయకుడి (సంఖ్యా బలం ప్రకారం ప్రతిపక్ష నేత కూడా) గా వ్యవహరిస్తారు. అంటే ఎమ్మెల్యేలందరికీ నాయకుడు. కాగా, కాంగ్రెస్ పార్టీలో ఓవరల్ గా చూస్తే ఈ రెండూ సమాన స్థాయి పదవులే. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నారు. సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క వ్యహరిస్తున్నారు. కాంగరెస్ అధికారంలోకి రానున్న నేపథ్యంలో వీరిలో సీఎం పదవి ఎవరిని వరిస్తుంది? అనేది ప్రశ్న.
అప్పట్లో వైఎస్..
పాత కాలం సంగతి వదిలేస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో వైఎస్ సీఎల్పీ నాయకుడిగా ఉంటూ.. పార్టీని గెలిపించి సీఎం అయ్యారు. నాడు ఏపీసీసీ చీఫ్ గా ఉమ్మడి కరీంనగర్ కు చెందిన సీనియర్ నాయకుడు ఎం.సత్యనారాయణ రావు వ్యవహరించారు. ఈయన 2000-04 మధ్యన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు 1999 ఎన్నికల సమయానికి వైఎస్ ఏపీసీసీ చీఫ్ గా ఉన్నారు. సీఎల్పీ నాయకుడిగా పి.జనార్దన్ రెడ్డి వ్యవహరించారు. కానీ, నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. పీజేఆర్ కూడా పరాజయం పాలయ్యారు. దీంతో సీఎల్పీ నాయకత్వాన్ని వైఎస్ చేపట్టారు. 2004లో కాంగ్రెస్ గెలిచినా.. నాటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కు సీఎం పదవి దక్కలేదు. 2009లోనూ (సీఎం) సీఎల్పీ నేతగా ఉంటూ.. వైఎస్ మరోసారి సీఎం అయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఈ సారి కూడా డీఎస్ ఉండడం గమనార్హం.
మరిప్పుడు..?
ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ కు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అవకాశాలనూ కొట్టిపారేయలేం. దళిత నాయకుడిగా ఉన్న భట్టి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. రేవంత్ కు తగ్గకుండా కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఇతర నాయకుల పేర్లూ సీఎం పదవికి వినిపిస్తున్నా.. రేవంత్ –భట్టి మధ్యనే పోటీ ఎక్కువగా సాగుతోంది. రేవంత్ సీఎం అయితే.. పీసీసీ అధ్యక్షుడికి పదవి దక్కినట్లు అవుతుంది. లేదా భట్టి ముఖ్యమంత్రి అయితే.. 2004, 2009 నాటి సంప్రదాయాన్ని పాటిస్తూ శాసన సభా పక్ష నేతకు పదవి ఇచ్చినట్లు అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం..?