Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ మొత్తం ఆ ఇద్దరి కనుసన్నల్లోనే

ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ.. తెలంగాణలో రాజ్యాధికారాన్ని సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్

By:  Tupaki Desk   |   12 Aug 2023 4:55 AM GMT
ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ మొత్తం ఆ ఇద్దరి కనుసన్నల్లోనే
X

ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ.. తెలంగాణలో రాజ్యాధికారాన్ని సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటకపోతే.. పార్టీ ఉనికికి ఇబ్బందికరంగా మారుతుందన్న ఆలోచనలో ఉంది. కీలకమైన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి సత్తా చాటేందుకు తెలంగాణలో గెలుపు ముఖ్యమన్న విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దీంతో.. టీ కాంగ్రెస్ ను కంట్రోల్ చేయటానికి రెండు పదునైన అస్త్రాల్ని సంధించేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతోంది.

తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన పార్టీగా కాంగ్రెస్ కున్న సానుకూలతను ఇప్పటివరకు సొంతం చేసుకోలేనివేళ.. ఈసారి మాత్రం అలా కాకుండా ఉండాలని భావిస్తోంది. ఇందుకోసం కొంతకాలంగా భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా బలమైన క్యాడర్.. నేతలు ఉన్నప్పటికీ.. ఐకమత్యం లోపించటం ఆ పార్టీకి పెద్ద శాపంగా మారింది. దీంతో.. ఈ విషయాన్ని సెట్ చేసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం తన అమ్ములపొదిలోని రెండు కీలక అస్త్రాల్ని తెలంగాణ మీద ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.

ఇంతకీ ఆ రెండు అస్త్రాలు మరేవో కాదు.. ఒకటి కాంగ్రెస్ అధినాయకత్వంలో కీలకమైన ప్రియాంక వాద్రా.. మరో అస్త్రం కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు విపరీతంగా శ్రమించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమారర్ లు. వీరిద్దరికి తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత కాపాడటం.. గెలుపే లక్ష్యంగా పని చేయటం.. సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లటమే ప్రధానంగా పని చేయనున్నారు. పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చే సర్వే రిపోర్టులు కీలకంగా మారనున్నప్పటికీ.. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యతను ప్రియాంక, శివకుమార్ చేతికి అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ అధికారపక్షం బీఆర్ఎస్ కు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. దాన్ని తమకుఅనుకూలంగా మార్చుకునే విషయంలో కాంగ్రెస్ ఇప్పటికి వెనుకబడి ఉంది. తెలంగాణలో 35కు పైగా స్థానాల్లో బలమైన నేతలు లేకపోవటం కాంగ్రెస్ ను వేధిస్తోంది. ఇదే అతిపెద్ద సమస్యగా చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు వస్తారని ఆశించినా.. అనుకున్నంతగా జరిగింది లేదు.

ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి మినహా మిగిలిన జిల్లాలకు సంబంధించి గుర్తింపు పొందిన నాయకులు ఎవరూ రాకపోవటం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో ఒక మాజీ మంత్రి కుటుంబం కాంగ్రెస్ లోకి వస్తుందని ప్రచారం జరిగినా.. ఆచరణలో ఇప్పటివరకు అడుగు ముందుకు పడింది లేదు. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి.. మెదక్.. అదిలాబాద్ జిల్లాల్లో పార్టీకి అవసరమైన బలమైన అభ్యర్థుల కొరత వేధిస్తోంది. అదే సమయంలో నాయకుల మధ్య అంతరగత విభేదాలు తీవ్ర రూపం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవటానికి వీలుగా ప్రియాంక.. శివకుమార్ లకు పగ్గాలు అప్పజెప్పినట్లుగా సమాచారం. వీరిద్దరి నేత్రత్వంలో పార్టీ ముందుకు వెళుతుందని భావిస్తున్నారు. టికెట్ల కేటాయింపు మొదలు మరే నిర్ణయం అయినా సరే.. వీరిద్దరి మాటే ఫైనల్ అని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.