కాంగ్రెస్ పెట్టుకున్న కంగాళీ !
తెలంగాణా కాంగ్రెస్ లో ప్రతిరోజు ఏదో ఒక తలనొప్పి ఉండాల్సిందే. ఏరోజన్నా తలనొప్పి లేకపోయినా, పార్టీకి ఏదో దిష్టి తగులుతుందన్నట్లుగా తయారైంది
By: Tupaki Desk | 18 Aug 2023 2:30 PM GMTతెలంగాణా కాంగ్రెస్ లో ప్రతిరోజు ఏదో ఒక తలనొప్పి ఉండాల్సిందే. ఏరోజన్నా తలనొప్పి లేకపోయినా, ఎలాంటి గొడవ జరగకపోయినా పార్టీకి ఏదో దిష్టి తగులుతుందన్నట్లుగా తయారైంది పరిస్ధితి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాల ప్రకటన తొందరలో ఉంటుందని అనుకుంటుందన్న సమయంలో సడెన్ గా రాజస్థాన్ డిక్లరేషన్ టెన్షన్ మొదలైంది. అభ్యర్ధుల ఎంపికలో ఈ డిక్లరేషన్ టెన్షన్ పెంచేసేట్లే ఉంది చూస్తుంటే. ఇంతకీ డిక్లరేషన్ ఏమిటంటే ‘వన్ ఫ్యామిలీ-వన్ టికెట్..వన్ పర్సన్-వన్ పోస్ట్’ అన్నది పెద్ద తలనొప్పిగా తయారయ్యేట్లుందట.
నిజానికి ఈ డిక్లరేషన్ రాజస్థాన్ ప్లీనరీ నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత చాలావరకు స్ట్రిక్టుగానే అమలు చేస్తున్నారు. అయితే ఎక్కడో మధ్య మధ్యలో దారి తప్పుతోంది. ఇపుడు సమస్య ఏమిటంటే తెలంగాణాలోని సీనియర్లలో కనీసం 15 మంది రెండు టికెట్లు అడుగుతున్నారట. తమతో పాటు తమ కొడుకులకు కూడా టికెట్లు ఇవ్వాల్సిందే అన్నట్లుగా పట్టుబడుతున్నారట. ఒక సీనియర్ విషయంలో అధిష్టానం సానుకూలంగా ఉంటే మిగిలిన సీనియర్లు కూడా వెంటనే తయారైపోతారు.
అందుకనే ఎవరికీ రెండో టికెట్ అన్నది ఇవ్వకూడదన్నది పీసీసీ నిర్ణయించిందట. కానీ సీనియర్లు అందకు అంగీకరించటం లేదు. ఎలాగంటే టికెట్లు ఫైనల్ చేయటంలో పీసీసీ సిఫారసు ఒకరకంగా ఉంటే ఢిల్లీకి జాబితా చేరేటప్పటికి సీన్ మారిపోతుంది. పీసీసీ రికమెండ్ చేయకపోయినా ఢిల్లీలోని పట్టు కారణంగా కొందరు సీనియర్లు డైరెక్టుగా మాట్లాడి టికెట్లు తెచ్చుకోవటం అందరికీ తెలిసిందే. కాబట్టి రేపటి ఎన్నికల్లో ఇదేపద్దతిలో ఎంతమంది టికెట్లు తెచ్చుకుంటారో చూడాల్సిందే.
నిజానికి కాంగ్రెస్ లో టికెట్లు ఫైనల్ చేయటమే గెలిచినంత పనవుతుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోను టికెట్ కోసం అంత తీవ్రస్ధాయిలో పోటీ ఉంటుంది. ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ ఇన్ని విభాగాల్లో పనిచేసే నేతలంతా పోటీకి రెడీ అవుతారు. విచిత్రం ఏమిటంటే వీళ్ళల్లో చాలామందికి ఢిల్లీలో ఎవరో ఒక కీలక నేత గాడ్ ఫాదర్ గా వ్యవహరిస్తుంటారు. అందుకనే రాజస్ధాన్లో రూపుదిద్దుకున్న డిక్లరేషన్ తెలంగాణా ఎన్నికల్లో ఎంతవరకు అమలవుతుందనే విషయంలో టెన్షన్ పెరిగిపోతోంది.