Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్: 119లో 35 మాత్రమే సింగిల్ అభ్యర్థి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది వారాల్లో జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. వచ్చే నెలలో ఎన్నికల కమిషన్ నుంచి ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:02 AM GMT
టీ కాంగ్రెస్: 119లో 35 మాత్రమే సింగిల్ అభ్యర్థి
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది వారాల్లో జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. వచ్చే నెలలో ఎన్నికల కమిషన్ నుంచి ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అనూహ్యంగా జమిలి ఎన్నికల వ్యవహారం తెర మీదకు వచ్చిన వేళ.. ఏమైనా ఆలస్యమైతే రెండు నెలలు ఎన్నికల ప్రక్రియ లేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అధికార పార్టీ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ఫైనల్ చేసి.. ప్రకటించేయటం తెలిసిందే. అయితే.. విపక్షాలు మాత్రం అధికార బీఆర్ఎస్ ప్రదర్శించిన ధైర్యాన్ని మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి.

విపక్ష కాంగ్రెస్ విషయానికి వస్తే..ఆ పార్టీకి తెలంగాణలో పట్టు ఉన్న నియోజకవర్గ్గాలు భారీగా లేకున్నా.. అభ్యర్థుల్ని ఫైనల్ చేసే విషయంలో మాత్రం కిందా మీదా పడిపోతున్నారు. మొత్తం 119 స్థానాల్లో 35 స్థానాల్లో మినహాయిస్తే. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. అభ్యర్థుల లెక్కను ఒక కొలిక్కి తెచ్చేందుకు బుధవారం హైదరాబాద్ లోని తాజ్ హోటల్ లోనూ.. అనంతరం గోల్కొండ రిసార్టులోనూ భారీ కసరత్తు జరిగినా.. అభ్యర్థుల వడబోత విషయంలో మరింత కన్ఫ్యూజన్ పెరిగిందే తప్పించి.. క్లారిటీ రాలేదన్న మాట వినిపిస్తోంది.

టికెట్లను ఖరారుచేసే పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. అంతేకాదు.. ఈ నెలాఖరుకు మరోసారి భేటీ కావాలని నిర్ణయించటం చూస్తే.. టికెట్ల పంచాయితీ విషయంలో ఇంతలా మల్లగుల్లాలు పడాల్సిన అవసరం ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నెల నాలుగైదుతేదీల్లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులు.. జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు.. మాజీ మంత్రులు.. సీనియర్ నేతలతో కలిసి కమిటీ ఛైర్మన్ మురళీధరన్ మాట్లాడారు. వారిచ్చిన ప్రతిపాదనల్ని ప్రాతిపదికగా చేసుకొని 119 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని ఫైనల్ చేసేందుకు మిగిలిన సభ్యులతో చర్చించారు. అయినప్పటికీ.. లెక్కలు తేలకపోవటం గమనార్హం.

మొత్తం 119 నియోజకవర్గాల్లో దాదాపు 35 నియోజకవర్గాలకు సంబంధించి ఒక పేరునే ఎక్కువమంది ప్రతిపాదించిన నేపథ్యంలో వాటి ఖరారులో ఎలాంటి ఇబ్బందుల్లేవన్నారు. మిగిలిన సీట్ల విషయానికి వస్తే.. రెండు నుంచి నాలుగు పేర్ల వరకు ఫైనల్ జాబితాలోఉండటంతో.. వాటిపై మరింత లోతైన చర్చ అవసరమన్న భావన వ్యక్తమవుతోంది. అభ్యర్థులుగా ఎక్కువమంది బీసీలకు ఇవ్వాలన్న మాట బలంగా వినిపించినట్లుగాచెబుతున్నారు. అంతేకాదు.. తుది జాబితాాలో ఉన్న అభ్యర్థుల బలాలు.. వారికి నియోజకవర్గంలో ఉన్న బలంపై అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నారు. వీటి రిపోర్టుల ఆధారంగా తుదిజాబితాను ఖరారు చేసే వీలుందంటున్నారు.

ఈ సందర్భంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తే.. పార్టీ వారికి నష్టం వాటిల్లుతుందన్న చర్చ నడుస్తోంది. ఈ నెలాఖరులో మరోసారి సమావేశమైన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. మొత్తంగా సెప్టెంబరు నెలాఖరుకు మొదటి జాబితా విడుదల అవుతుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.