ఫస్ట్ లిస్ట్ డేట్ ఫిక్సయ్యిందా ?
తెలంగాణా కాంగ్రెస్ లో మొదటిజాబితా ప్రకటించేందుకు ముహూర్తం రెడీ అయినట్లు సమాచారం.
By: Tupaki Desk | 14 Sep 2023 5:54 AM GMTతెలంగాణా కాంగ్రెస్ లో మొదటిజాబితా ప్రకటించేందుకు ముహూర్తం రెడీ అయినట్లు సమాచారం. ఈనెల 22వ తేదీన ఫస్ట్ లిస్టు ప్రకటించేందుకు ఏఐసీసీ అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మొదటిలిస్టులో సుమారు 40 మంది పేర్లు ఉండే అవకాశాలున్నాయి. ఇందులో కూడా సీనియర్లు, సిట్టింగ్ ఎంఎల్ఏల నియోజకవర్గాలే ఎక్కువగా ఉండబోతున్నాయని సమాచారం. సీనియర్లంటే సుమారు 30 నియోజకవర్గాలకు కేవలం ఒకే ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. అంటే ఆ నియోజకర్గాల్లో సదరు సీనియర్ నేతలకు టికెట్లు ఖాయమైపోయినట్లే.
మొదట్లో ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటి సమావేశాన్ని ఈనెల 20వ తేదీన నిర్వహించాలని అనుకున్నారు. అయితే 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమావేశాల్లో పాల్గొనాల్సిన ఎంపీలు కూడా స్క్రీనింగ్ కమిటిలో సభ్యులుగా ఉన్నారు. ఇంతేకాకుండా సీడబ్ల్యూసీ సమావేశం, తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా సోనియా హైదరాబాద్ పర్యటన తదితరాలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా మీటింగ్ పెట్టుకునే బదులు 22వ తేదీన మీటింగు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు.
అంటే 22 ఉదయం మీటింగ్ పెట్టుకుని కాంపిటీషన్ లేని నియోజకవర్గాలు, సిట్టింగ్ ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయించారు. ఫస్ట్ లిస్ట్ ఫీడ్ బ్యాక్ చూసుకుని తర్వాత రెండో జాబితా విడుదల చేయాలని అగ్రనేతలు ఇప్పటికే నిర్ణయించారు. దాని తర్వాత మూడోజాబితా ఉండబోతోంది. ఇక్కడితో అభ్యర్ధుల ప్రకటన దాదాపు అయిపోవచ్చని అనుకుంటున్నారు.
మహాయితే అత్యంత వివాదాస్పదం, అత్యధికంగా కాంపిటీషన్ ఉన్న నియోజకవర్గాలు ఏవైనా ఉంటే నాలుగోజాబితాగా రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు. మొత్తానికి నాలుగు అంచెలుగా హస్తంపార్టీ 119 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ప్రకటనకు రెడీ అవుతున్నది. ఇందులోనే వివిధ సామాజికవర్గాలను సంతృప్తిపరిచేట్లుగా కసరత్తు జరగుతోంది. సామాజికవర్గాల్లో కూడా అత్యధిక షేర్ బీసీలకే దక్కబోతోందని పార్టీ వర్గాల సమాచారం. తర్వాత రెడ్లు, మైనారిటిలుంటారు. మిగిలిన సామాజివకర్గాలకు ఎన్నిసీట్లు సర్దుబాటు చేయబోతోందో తొందరలోనే తేలిపోతుంది. మొత్తానికి అభ్యర్ధుల వడబోత, ఎంపిక, ప్రకటన అనే ముడంచెల కసరత్తు చివరి అంకానికి వచ్చేసినట్లే అనుకోవాలి.