Begin typing your search above and press return to search.

సీఎం రేసులో ముగ్గురు ఎంపీలు...?

తెలంగాణా ఎన్నికలలో ముగ్గురు ఎంపీలు బరిలోకి దిగిపోతున్నారు.

By:  Tupaki Desk   |   15 Oct 2023 1:54 PM GMT
సీఎం రేసులో ముగ్గురు ఎంపీలు...?
X

తెలంగాణా ఎన్నికలలో ముగ్గురు ఎంపీలు బరిలోకి దిగిపోతున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీలూ ఇపుడు అసెంబ్లీ రూట్ లోకి వస్తున్నారు. నిజానికి ఇందులో మల్కాజ్ గిరీ ఎంపీ రేవంత్ రెడ్డి 2018లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. ఆ తరువాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో గెలిచారు. అలాగే చూస్తే హుజూర్ నగర్ నుంచి ఉత్తం కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత నల్గొండ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

ఇక నల్గొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలు అయిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆ తరువాత భువనగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. చిత్రమేంటి అంటే ఈ ముగ్గురూ ముఖ్యమంత్రి సీటు మీద కన్నేశారు. వీరు ఎంపీలుగా ఉండగానే ఎమ్మెల్యే టికెట్లను అధినాయకత్వం కేటాయించింది.

మొదటి జాబితాలోనే వీరి పేర్లు ఉన్నాయి. అలా చూస్తే కనుక కోమటి రెడ్డి నల్లగొండ నుంచి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, ఉత్తం కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేయబోతున్నారు. నిజానికి చూస్తే నిబంధలన ప్రకారం వారు ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. కానీ ముందు ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎపుడైనా రాజీనామా చేయవచ్చు. దాంతో ఎంపీలుగా ఉంటూనే వారు ఎమ్మెల్యేగా మరోసారి పోటీ పడుతున్నారు.

ఇక డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎంపీ పదవులకు రాజీనామా చేసినా ఆరు నెలల వ్యవధి కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఉప ఎన్నికలు రావు అనే అంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. దాంతో సీఎం రేసులో చాలా మంది ఉన్నారని అంటున్నారు.

ముఖ్యంగా ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అందరి కంటే ముందు ఉంటారనడంలో సందేహం లేదు అని అంటున్నారు. ఆయన తరువాత మాజీ పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి ఉంటారు. ఇక తాను సీనియర్ మోస్ట్ లీడర్ ని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటూంటారు. ఆయనకు సీఎం పదవి మీద మోజు ఉంది. ఇలా ముగ్గురూ సీఎం పోస్టు మీద కన్నేసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దూకుతున్నారు.

పార్టీ హై కమాండ్ కూడా వారిని ఆశీర్వదిస్తూ పోటీలోకి దించుతోంది. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఒక వైపు కనిపిస్తూంటే సీరియస్ గా సీఎం రేసులోని అభ్యర్ధులు కూడా రంగంలోకి దిగిపోయారు. సో ఈసారి ఎన్నికలు తెలంగాణా రాజకీయాలతో పాటు కాంగ్రెస్ రాజకీయాలలోనూ హీటెక్కించేలా ఉన్నాయని అంటున్నారు. ఇక ఎంపీలు ముగ్గురూ సీఎం పదవిని టార్గెట్ చేస్తే ఎమ్మెల్యేలుగా పోటీలో ఉన్న వారిలో చాలా మంది సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ గెలిస్తే తమ లక్ ని టెస్ట్ చేసుకోవచ్చు. సో హై కమాండ్ సీనియర్ల ఆశలను ఏ మాత్రం నిరుత్సాహ పరచడం లేదు అన్నది ఇక్కడ చూదాల్సి ఉంది.