టీ-ఎలక్షన్స్: కాంగ్రెస్‌కు క్లారిటీ.. రంగంలోకి రెబల్స్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌కు భారీ ఇబ్బందులు తప్పడం లేదు.
By: Tupaki Desk | 30 Oct 2023 2:30 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌కు భారీ ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణ ఇచ్చిం ది తామేనని.. రుణం తీర్చుకోవాలని.. చెబుతూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి రావాల ని భావిస్తున్న కాంగ్రెస్‌కు సొంత నేతల నుంచే ఇబ్బందులు వస్తున్నాయి. వాస్తవానికి అందరూ ఊహించిం దే జరుగుతోంది. రెబల్స్ బెడద భారీగా పెరిగిపోయింది. వాస్తవానికి తొలి జాబితాలో చోటు దక్కని వారు.. ఒకింత మెత్తబడ్డారు. కొందరు పార్టీ మారిపోయారు.
అయితే, రెండో జాబితా విషయానికి వస్తే.. పార్టీ మారేందుకు అవకాశం లేదు. ఉన్నా.. అక్కడ కూడా టికెట్ల పందేరం పూర్తయి పోయింది. దీంతో కాంగ్రెస్‌లో టికెట్లు దక్కని నేతలు ఇప్పుడు రెబల్స్‌గా రంగంలొకి దిగేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని కీలకమైన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును వీరు ప్రభావితం చేయడంతోపాటు.. పరోక్షంగా అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు మేలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
జూబ్లీహిల్స్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ దక్కకపోవడంపై దివంగత నేత పీజేఆర్(జనార్దన్‌రెడ్డి) కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేసమయంలో మాజీ క్రికెటర్ అజరుద్దీన్ పేరును ఖరారు చేయడాన్ని తప్పుబట్టారు. తనకు టికెట్ లేకున్నా.. జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేసి తీరతానని ప్రకటించారు.
కూకట్‌పల్లి
అత్యంత కీలకమైన కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు పార్టీకి రాజీనామా చేశారు. 40 ఏళ్లుగా పార్టీలో కష్టపడి పనిచేస్తున్న తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈయనకు దన్నుగా మూసాపేట డివిజన్ అధ్యక్షుడు చున్నూ పాషా, షేక్ అబ్దుల్ సోహైల్ కూడా కాంగ్రె్‌స్‌కు రాజీనామా చేశారు.
ఖైరతాబాద్
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గం టికెట్‌ను పీజేఆర్ తన విజయారెడ్డికి ఇవ్వడం కూడా కాంగ్రెస్‌లో రాజకీయ కుంపట్లను రాజేసింది. ఈ టికెట్ తనకే ఇస్తానని చెప్పి మాట తప్పారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి అన్నారు. ఈయన కూడా పార్టీకి దూరంగా ఉండి.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా చూస్తే.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు పార్టీ గెలుపుపై ప్రభావం చూపించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.