కాంగ్రెస్ ప్లాన్ వికటిస్తుందా ?!
అయితే ఈ చేరికల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో విభేధాలకు తెరలేపుతున్నది. నియోజకవర్గాల వారీగా నేతల మధ్య ఆధిపత్యానికి ఆజ్యం పోస్తున్నది.
By: Tupaki Desk | 12 July 2024 9:30 AM GMTతెలంగాణలో విపక్ష బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలలో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేస్తున్నది. 26 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలలో భాగంగా సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగిస్తున్నది. అయితే ఈ చేరికల వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో విభేధాలకు తెరలేపుతున్నది. నియోజకవర్గాల వారీగా నేతల మధ్య ఆధిపత్యానికి ఆజ్యం పోస్తున్నది.
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు ఎవరూ కలవడం లేదు. చాలా మంది నేతలు కొత్తగా చేరిన వారితో తీవ్రంగా విభేధిస్తున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఈ ప్లాన్ బెడిసికొట్టి పార్టీకి చేటు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏకంగా ఢిల్లీ వరకు తీసుకెళ్లాడు. చివరకు రేవంత్ మీడియా సమావేశం పెట్టి నచ్చచెప్పుకోవాల్సి వచ్చింది. ఖైరతాబాద్ నుండి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడం, కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. అయితే అక్కడ కాంగ్రెస్ నుండి పోటీ చేసిన విజయారెడ్డి దానం నాగేందర్ వైపు కన్నెత్పి చూసిన పాపాన పోలేదు. ఆమె వర్గం అంతా నాలుగు నెలలు అయినా ఆగ్రహంగానే ఉన్నారు.
స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి మీద ఓడిపోయిన ఇందిర బహిరంగంగానే ఆయన చేరికను వ్యతిరేకించింది. ఇప్పటి వరకు ఆయనను కలవలేదు. ఆయన ఈమెను కలిసే ప్రయత్నం చేయలేదు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేరికను వ్యతిరేకిస్తూ ఓడిపోయిన కాంగ్రెస్ నేత భీమ్ భరత్ వర్గం ఏకంగా దీక్షలు చేపట్టింది. ఆయన ప్రారంభోత్సవానికి వస్తున్న శిలాఫలకాన్ని పగలగొట్టి మరీ నిరసన తెలిపారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ మాజీ జడ్పీచైర్మన్, ఇటీవల ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతయ్య వర్గం ఏకంగా సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసింది. గాంధీ భవన్ ను కూడా ముట్టడించారు. బాన్స్ వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి రాకను నిరసిస్తూ అక్కడి కాంగ్రెస్ నేతలు భారీ సమావేశం ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహించారు. వలస నేతలను ఎవరూ స్వాగతించడం లేదు.
ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో వలస కాంగ్రెస్ (వీసీ), అసలు కాంగ్రెస్ (ఏసీ) అంటూ పిలుచుకుంటుండడం ఈ సంధర్భంగా ప్రస్తావించాల్సిన అంశం. ఈ చేరికలు ప్రతిపక్ష పార్టీని బలహీనపరిచేందుకు ప్రస్తుతానికి దోహదం చేసినా, రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి మేలు చేయవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.