కార్పొరేటర్లు చుక్కలు చూపిస్తున్నారా ?
సిట్టింగులకు టికెట్లు ఇవ్వద్దని చాలామంది కార్పొరేటర్లు కేసీయార్ కు చెప్పారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు కావాలని ప్రయత్నాలు చేసుకున్నారు.
By: Tupaki Desk | 9 Sep 2023 4:57 AM GMTగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఎంఎల్ఏలతో పాటు ఎంఎల్ఏ అభ్యర్ధులకు కార్పొరేటర్లు చుక్కలు చూపిస్తున్నారు. కారణం ఏమిటంటే చాలా నియోజకవర్గాల్లో సిట్టింగులతో పాటు ఎంఎల్ఏ అభ్యర్ధులకు కార్పొరేటర్లతో ఏమాత్రం పడటంలేదు. వీళ్ళమధ్య గొడవలు చాలాకాలంగా ఉన్నవే. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఓల్డ్ సిటిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంఐఎం ఎంఎల్ఏలున్నారు. మరో నియోజకవర్గం గోషామహల్ లో బీజేపీ ఎంఎల్ఏ ఉన్నారు. అంటే మిగిలిన 16 నియోజకవర్గాల్లోను బీఆర్ఎస్ ఎంఎల్ఏలే ఉన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే గ్రేటర్ లో అత్యధిక స్ధానాలు గెలుచుకోవటం చాలా అవసరం. ఇక్కడ సమస్య ఏమిటంటే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య ఎక్కువ.
దాంతో బీఆర్ఎస్ ఎంఎల్ఏలను ఒకవైపు బీజేపీ కార్పొరేటర్లు వాయించేస్తున్నారో మరోవైపు సొంత కార్పొరేటర్లు దుమ్ము దులుపుతున్నారు. దీంతో సిట్టింగులకు, అభ్యర్ధులకు ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు.
సిట్టింగులకు టికెట్లు ఇవ్వద్దని చాలామంది కార్పొరేటర్లు కేసీయార్ కు చెప్పారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు కావాలని ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే కార్పొరేటర్ల మాటను కాదని కేసీయార్ సిట్టింగులకే ఎక్కువ టికెట్లు ప్రకటించారు.
దాంతో కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్, బీజేపీ తరపున పోటీచేయటానికి టికెట్లకు దరఖాస్తు చేసుకున్నారట. కుత్బుల్లాపూర్ ఎంఎల్ఏ వివేక్ గౌడ్ ను కార్పొరేటర్లందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు కుత్బుల్లాపూర్ టికెట్ కోసం కాంగ్రెస్ లో దరఖాస్తు చేసుకున్నారు. రావులకు టికెట్ వస్తే కార్పొరేటర్లందరు ఈయనకే పనిచేసే అవకాశముంది.
మల్కాజ్ గిరి టికెట్ మైనంపల్లి హనుమంతరావుకే కేటాయించినా ఆయన్ను వ్యతిరేకిస్తున్న కార్పొరేటర్లు విజయశాంతితో పాటు మాజీ కార్పొరేటర్లు పట్టబట్టినట్లు సమాచారం. కుత్బుల్లాపూర్ కే చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైఎస్ ఛైర్మన్ బొంగునూరు ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు కార్పొరేటర్లు కూడా తొందరలోనే కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. మొత్తంమీద గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు కార్పొరేటర్ల నుండి పెద్ద సమస్య తప్పదనే అనిపిస్తోంది.