కేసీఆర్ చైన్ బ్రేక్ చేయనున్నారా? అదే జరిగితే?
ఇలాంటి వేళ.. కొత్త సీన్ ఒకటి తెర మీదకు వచ్చింది.అదే.. తెలంగాణ దశాబ్ది అవతరణ వేడుకలు.
By: Tupaki Desk | 1 Jun 2024 6:30 AM GMTఅందరి అంచనాలకు తగ్గట్లే ఇటీవల కాలంలో పరిణామాలుచోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు బొత్తగా తగ్గిపోతున్నాయి. గతంలో వేర్వేరు పార్టీల అధినేతల మధ్య ఉండే దగ్గరితనం పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితి. రాజకీయ వైరం వ్యక్తిగత స్థాయిలకు వెళ్లిపోయి చాలా కాలమే అయ్యింది. ఇలాంటి వేళలో పెద్దరికంతో వ్యవహరించే పరిస్థితులు తగ్గిపోయాయి. ఇలాంటి వేళ.. కొత్త సీన్ ఒకటి తెర మీదకు వచ్చింది.అదే.. తెలంగాణ దశాబ్ది అవతరణ వేడుకలు.
తీవ్రమైన భావోద్వేగంతో నిండుకున్న ఈ వేడుకల్ని రేవంత్ సర్కారు ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ భారీ మూల్యాన్నిచెల్లించాల్సి వచ్చింది. అయినప్పటికీ తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామన్న అంచనాకు భిన్నంగా పదేళ్ల పాటు.. పవర్ కు దూరంగా ఉండటమేకాదు.. ఒక దశలో పార్టీ ఉనికి సైతం ప్రశ్నార్థకమైన పరిస్థితి. అక్కడి నుంచి పుంజుకొని.. తిరిగి అధికారంలోకి వచ్చిన వైనం ఆసక్తికరమని చెప్పాలి.
మొత్తానికి తెలంగాణ ఏర్పడిన పదో ఏట అధికార పక్షంగా అవతరించినకాంగ్రెస్.. తెలంగాణను ఇచ్చిన సోనియమ్మను తీసుకొచ్చి.. ఆమె ఎదుట భారీ ఎత్తున వేడుకల్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకలకు విపక్ష నేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ను సైతం ప్రోటోకాల్ ప్రకారంఆహ్వానించటం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్ వద్దకు వెళ్లి.. ప్రభుత్వ ఆహ్వానపత్రికను ఆయనకు ఇవ్వటం.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఈ వేడుకలకు కేసీఆర్ వస్తారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కేసీఆర్ మైండ్ సెట్ ప్రకారం చూస్తే.. ఈ వేడుకలకు వచ్చే ఛాన్సులు లేవు. అయితే.. ఆయన గతంలో చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటే మాత్రం.. ఆయన తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్పటం వేరు.. చేతుల చూపించటం వేరన్న విషయంపై క్లారిటీ ఉన్నప్పటికీ.. అనూహ్యరీతిలో నిర్ణయాలు తీసుకోవటం.. అందరిని అవాక్కు అయ్యేలా చేయటం లాంటివి కేసీఆర్ కు సైతం ఇష్టమని చెబుతారు. కానీ.. తాను విపక్ష నేతగా తెలంగాణ దశాబ్ది వేడుకలకు హాజరవుతారా? అన్నది ప్రశ్నే అంటున్నారు. రేవంత్ అధికారాన్ని ఒప్పుకోవటంతో పాటు.. తాను విపక్ష హోదాలో వెళ్లటానికి కేసీఆర్ ఇష్టపడతారా? అన్నది అసలు ప్రశ్న.
ఒకవేళ.. గతంలో తాను పెద్దమనిషి తరహా మాటలకు తగ్గట్లు ఆయన చేతలు ఉంటే మాత్రం.. ఆయన పెద్దసారు ఇమేజ్ ను సొంతం చేసుకుంటారని చెప్పాలి. కేసీఆర్ మైండ్ సెట్ తెలిసిన వారు ఎవరైనా సరే.. రేవంత్ సర్కారు నిర్వహించే దశాబ్ది వేడుకలకు హాజరు కారనే చెబుతారు. అలాంటి అంచనాల్ని వమ్ము చేస్తూ.. కేసీఆర్ కానీ కార్యక్రమానికి హాజరైతే మాత్రం సీఎం రేవంత్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన మీదట వచ్చిన కేసీఆర్ కు ఏ మాత్రం మర్యాద లభించకపోయినా.. ఆయనపై పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవుతుంది. అదే సమయంలో రేవంత్ సర్కారు తీరును దుమ్మెత్తి పోస్తారు. మరి.. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా కేసీఆర్ మార్చుకుంటారా? లేదా? లఅన్నది తేలాలంటే కాస్త వెయిట్ చేయక తప్పదు.