Begin typing your search above and press return to search.

తెలంగాణకు కాబోయే కొత్త పోలీస్ బాస్ ఎవరు? రేసులో ఉన్నదెవరంటే?

ప్రభుత్వం ఏర్పడినంతనే బోలెడన్ని మార్పులు చేర్పులు.. బదిలీలు వరుస పెట్టి సాగుతాయని చెబుతున్నారు

By:  Tupaki Desk   |   7 Dec 2023 3:47 AM GMT
తెలంగాణకు కాబోయే కొత్త పోలీస్ బాస్ ఎవరు? రేసులో ఉన్నదెవరంటే?
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు (గురువారం)మధ్యాహ్నం1.04 గంటల వేళలో ఎల్ బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడినంతనే బోలెడన్ని మార్పులు చేర్పులు.. బదిలీలు వరుస పెట్టి సాగుతాయని చెబుతున్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఆయనకంటూ ఒక టీం ఉండటం.. తమకు తగ్గట్లుగా అధికారుల్ని సెటప్ చేసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాల వెల్లడి వేళ అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు సంచలనంగా మారాయి.

సరిగ్గా నాలుగైదుస్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారన్న అధికారిక ప్రకటనలు రాకుండానే.. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా వ్యవహరిస్తున్న అంజన్ కుమార్ హడావుడిగా రేవంత్ ఇంటికి వెళ్లటం.. ఆయనకు పూల బొకే అందించటం లాంటి పనులపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావటమే కాదు.. వెంటనే సస్పెండ్ చేసింది. ఆయనతో వెళ్లిన మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీస్ పంపి.. వివరణ కోరింది ఈ నేపథ్యంలో పోలీస్ బాస్ పదవిని చేపట్టారు రవి గుప్తా.

కట్ చేస్తే.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర పోలీస్ బాస్ ను కచ్ఛితంగా మారుస్తారన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే డీజీగా వ్యవహరిస్తున్నరవిగుప్తాను కంటిన్యూ చేయటానికి అతి తక్కువ అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ.. మిగిలిన అంశాలకు ప్రాధాన్యతను ఇచ్చిన పక్షంలో రవిగుప్తా తాత్కాలికంగా కొనసాగుతారని చెబుతున్నారు. అలా కాని పక్షంలో మరోమూడు పేర్లు రేసులో ఉన్నట్లు చెబుతున్నారు.

డీజీపీ పదవి కోసం ప్రయత్నిస్తున్న వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారులు జితేందర్.. సీవీ ఆనంద్.. రాజీవ్ రతన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న రేవంత్ రెడ్డి కానీ.. లేదంటే ఈ ముగ్గురిలో ఒకరు కానీ డీజీ అయ్యే వీలుందని చెబుతున్నారు. డీజీపీ మార్పుతో పాటు ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ ను కూడా తక్షణమే మార్చే వీలుందంటున్నారు.దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తి అయ్యిందన్న మాట వినిపిస్తోంది.