Begin typing your search above and press return to search.

రాజకీయ ముహూర్తాలు రెడీ!

తెలంగాణ ఎన్నికల్లో కీలక పర్వానికి తెరలేచింది. శుక్రవారం (నవంబర్ 3) నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 1:30 PM GMT
రాజకీయ ముహూర్తాలు రెడీ!
X

తెలంగాణ ఎన్నికల్లో కీలక పర్వానికి తెరలేచింది. శుక్రవారం (నవంబర్ 3) నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకూ ఆయా పార్టీల తరపున టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు, స్వతంత్రంగా పోటీకి సిద్ధమవుతున్న నేతలు.. ఇక నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నామినేషన్లకు ముందు రాజకీయ నాయకులు మరో విషయంపై ఫోకస్ పెట్టారు. అదే మంచి మూహూర్తం. మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్ వేస్తే విజయం దక్కుతుందనే నమ్మకంతో జ్యోతిష్యులు, సిద్ధాంతులు, పంతుళ్ల దగ్గరకు నేతలు క్యూ కడుతున్నారు.

ఎన్నికల బరిలో దిగుతున్నామంటే ఉంటే సందడి అంతా ఇంతా కాదు. ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో కొంతమంది, మరొక్కసారి గెలవాలనే పట్టుదలతో మరికొంతమంది నాయకులున్నారు. అందుకే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టే ముందు నుంచి నామినేషన్లు, ప్రచారం.. ఇలా అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలు చూసుకుంటున్నారు. తమ జ్యోతిష్యం చూపించుకుంటున్నారు. మంచి ముహూర్తాలు చూసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా మంది తమ ఆరాధ్య దేవతల గుడిలో పూజల తర్వాత ప్రచారం మొదలెట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడిక నామినేషన్లకు మంచి ముహూర్తాలు చూసుకోవడంలో నేతలు బిజీ అయ్యారు. మంచి సమయంలో నామినేషన్ వేస్తే విజయం దక్కుతుందనే నమ్మకమే అందుకు కారణం. అందుకే చాలా మంది నవంబర్ 3, 4, 7, 8, 9, 10 తేదీల్లో నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటమే కారణంగా తెలుస్తోంది. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో అధికారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు విజయంపై కసరత్తులు చేస్తున్నారు. అయినా ఓటర్ల కటాక్షం లేనిది ఏ ముహూర్తం చూసుకుంటే మాత్రం ఏం లాభమనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.