Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ 2023 లైవ్ : కొడంగల్ లో రేవంత్ విజయం... అందోల్‌ లో హస్తం హవా!

By:  Tupaki Desk   |   3 Dec 2023 2:50 AM GMT
తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ 2023 లైవ్ :  కొడంగల్ లో రేవంత్ విజయం... అందోల్‌ లో హస్తం హవా!
X


  • కొడంగల్ లో రేవంత్ విజయం... అందోల్‌ లో హస్తం హవా!

కొడంగల్ లో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. కొడంగల్ నియోజకవర్గంలో 32,900 భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే సమయంలో అందోల్‌ శాసనసభా నియోజకవర్గంలో దామోదర్‌ రాజ నర్సింహా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీఆరెస్స్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్‌ పై రాజనర్సింహం గెలుపొందారు.

  • బీఆరెస్స్ బోణీ... బీజేపీ అభ్యర్థికి షాక్!

తెలంగాణలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి అశ్వారావుపేట- ఆదినారాయణ, ఇల్లెందు- కోరం కనకయ్య, రామగుండం- రాజ్‌ ఠాకూర్‌, బెల్లంపల్లి- గడ్డం వినోద్‌ లు అధికారికంగా గెలుపొందారు. ఇదే సమయంలో... ఎంఐఎం నుంచి చార్మినార్‌- మీర్‌ జుల్ఫికర్‌ అలీ గెలుపొందారు. ఈ క్రమంలో తాజాగా బీఆరెస్స్ కూడా బోణీ కొట్టింది.

ఇందులో భాగంగా... దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆరెస్స్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి విజయం సాదించారు. సమీప బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావుపై గెలుపొందారు. ఇది బీజేపీకి తగిలిన షాక్ లలో ఒకటనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరో పక్క కాంగ్రెస్‌ 69, బీఆరెస్స్ 37, బీజేపీ 8, ఎంఐఎం 4, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • రేవంత్ ఇంటి వద్ద టీడీపీ జెండాలు... కోమటిరెడ్డి కామెంట్స్ వైరల్!

ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ ఈ రోజు ఉదయం నుంచీ ఎగ్జాట్ పోల్స్ విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తుంది. ఈ విజయం కాంగ్రెస్ పై ప్రేమకంటే ఎక్కువగా బీఆరెస్స్ పాలనపై ప్రజల ఆగ్రహం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది.

అవును... తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్స్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతున్న తరుణంలో ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రెండేళ్లుగా పార్టీకోసం విపరీతంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో... రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోపక్క రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా చేరారు. ఇదే సమయంలో రాష్ట్ర డీజీపీతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు రేవంత్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సమయంలో రేవంత్ ఇంటి బయట సీఎం సీఎం అనే నినాదాలు భారీగా వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జెండాలతో పాటు టీడీపీ జెండాలు, లోకేష్ - చంద్రబాబు ఫోటోలతో కూడిన ఫ్లాగ్ లూ కనిపిస్తుండటం ఆసక్తిగా మారింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో టీడీపీ పాత్రను కొట్టిపారేయలేమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇది బీఆరెస్స్ మార్కు రాజకీయానికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డి భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు బయలుదేరారు. అనధికారికంగా కాంగ్రెస్ గెలుపు కన్ ఫాం అయిన నేపథ్యంలో ఆయన గాంధీ భవన్ కు వెళ్తున్నారు. మరోపక్క ఈ గెలుపు రాహుల్ గాంధీ సొంతమని, భారత్ జూడో యాత్ర ఫలితమని ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో... తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి వ్యవహరం అంత సాఫ్ట్ గా తేలేది కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

  • ఉత్తం ఫస్ట్ రియాక్షన్... క్రెడిట్ మొత్తం అతనిదే!

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగిస్తున్న వేళ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఆ పార్టీ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... రాహుల్‌ గాంధీ జోడో యాత్ర రాష్ట్రంలో విజయవంతమైందని తెలిపారు.

రాహుల్ గాంధీ ఇమేజ్ తెలంగాణ ఎన్నికల్లో ఉపయోగపడిందని తెలిపారు. అవినీతి, అహంకారం, నియంత తరహా పాలనతో ప్రజలు విసిగిపోయారని వెల్లడించారు. ఈ తీర్పు కోసం ప్రజలు వేచి చూశారని.. సరైన సమయంలో సరైన తీర్పు వచ్చిందని తెలిపారు.

  • కొత్త సమీకరణం.. గులాబీ కోటలో ఇకపై మేనల్లుడిదే హవానా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన వివరాలన్నీ కూడా అధిక్యతలే కానీ.. అధికారిక గెలుపు ఎవరిది లేదు. ఇంకా.. ఓట్ల లెక్కింపు సాగుతూనే ఉంది. ఉదయం పదకొండున్నర గంటల సమయానికి కాంగ్రెస్ అధిక్యత మెజార్టీ స్థానాల్లో ఉండగా.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఓట్ల వేటలో వెనుకబడి ఉంది. గ్రేటర్ పరిధిలోని 15 స్థానాలు మినహాయిస్తే.. తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ సత్తా చాటిన జిల్లాలు పెద్దగా లేవనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. మొదటి రౌండ్ నుంచి ఇప్పటివరకు వెలువడిన ఓట్లవివరాల్ని చూసినప్పుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా.. గులాబీ నేతలు ఎవరు కూడా దూసుకెళుతున్న పరిస్థితి లేదు. ఆ లెక్కలోకి వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్ మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ రావు ఒక్కరు మాత్రమే దూసుకెళుతున్నారని చెప్పాలి. ఓట్ల లెక్కింపు మొదలైన నాటి నుంచి ఉదయం పదకొండున్నర వరకు కూడా ఆయన బరిలో ఉన్న సిద్దిపేటలో దూసుకెళుతున్నారు.

ఎక్కడా వెనక్కి చూసుకోకుండా.. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఆయన అధిక్యత అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి. హరీశ్ తో పోలిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసిన రెండు స్థానాలతో పాటు.. మంత్రి కేటీఆర్ పోటీ చేసిన సిరిసిల్లతో సహా.. అప్ అండ్ డౌన్లు కనిపిస్తున్నాయి. కానీ.. హరీశ్ మాత్రం మాంచి జోరుతో ముందుకు సాగుతున్నారు. 2018 ఎన్నికల్లో ఆయన రికార్డు మెజార్టీనిసొంతం చేసుకోవటం తెలిసిందే.

2009 ఎన్నికల్లో 64వేల మెజార్టీతో విజయం సాధించగా.. 2010 ఉప ఎన్నికల్లో ఆయన 95వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీని సొంతం చేసుకున్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో 93వేలకు పైగా మెజార్టీ సాధించిన హరీశ్ రావు.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 1,20,650 ఓట్లతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ స్థాయి మెజార్టీ ఇప్పుడు వచ్చే అవకాశం లేకున్నా.. గులాబీ పార్టీలో మిగిలిన వారందరికంటే కూడా మెరుగైన మెజార్టీతో పాటు.. ఆయనే అత్యధిక ఆధిక్యతను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి.

నిజానికి ఉద్యమ సమయం నుంచి మేనమామ కేసీఆర్ తోడు నిలిచి.. ఆయన వెన్నంటి ఉన్న హరీశ్ అధిక్యత గులాబీ పార్టీలో ఒక రేంజ్ లో ఉండేది. ఎప్పుడైతే కేటీఆర్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారో.. అంతకంతకూ ఎదుగుతూ వచ్చారు. చూస్తుండగానే హరీశ్ తో పోటీ పడే స్థాయి నుంచి.. ఆయన్ను తప్పుకోమనే వరకు వెళ్లారు. ఈ సమయంలో పార్టీలో కాసింత అధిపత్య పోరు నడించింది. ఇలాంటి వేళలో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. కొడుకు అధిక్యతకు పచ్చజెండా ఊపేయటమే కాదు.. తన రాజకీయ వారసుడు మేనల్లుడు కాదు కొడుకే అన్నవిషయాన్ని ఘనంగా చెప్పేశారు.

దీంతో.. నాటి టీఆర్ఎస్.. నేటి బీఆర్ఎస్ లో సెకండ్ పొజిషన్ కేటీఆర్ చేతికి వచ్చేసింది. అది మొదలు ఇప్పటివరకు ఆయన అధిక్యతే నడుస్తోంది. పేరుకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. కేటీఆర్ డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తుంటారన్న పేరున్న సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కేటీఆర్ ప్రభావం కంటే హరీశ్ రావు చతురతే పార్టీని ఈ మాత్రం సీట్లు వచ్చేలా చేసిందంటున్నారు. ఇక.. ఎన్నికల ఫలితాల్లోనూ హరీశ్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్నట్లుగా చెప్పాలి. మెజార్టీ పరంగానూ కేటీఆర్ కంటే హరీశ్ రావే ముందుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీ కోటలో హరీశ్ సూపర్ పవర్ గా మారతారన్న మాట వినిపిస్తోంది.

  • 5 రాష్ట్రాల ఫలితాల దెబ్బకు ఈసీ వెబ్ సైట్ క్రాష్

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గాఅభివర్ణించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మొదలైన ఓట్ల లెక్కింపుతో అందరి చూపు ఇప్పుడు ఎన్నికల ఫలితాల మీదే ఉంది. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఉంది. దీంతో.. తెలుగువారంతా ఎన్నికల ఫలితాల కోసం తీవ్రమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితం రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాల్ని మారుస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వీక్షకులు పెద్ద ఎత్తున టీవీ చానళ్లను వీక్షిస్తున్నారు. ఈ రోజు ఆదివారం కావటంతో అందరి చూపు ఎన్నికల ఫలితాల మీదే ఉంది. దీనికి తోడు.. మొబైల్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో పలువురు కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెందిన ప్రధాన వెబ్ సైట్ ను ఫలితాల కోసం చూస్తున్నారు. దీంతో.. ఈ సైట్ కు తాకిడి అనూహ్యంగా పెరిగింది.

పెరిగిన వీక్షకుల కారణంగా ఈసీ వెబ్ సైట్ మీద లోడ్ పెరిగింది. దీంతో.. ఈ వెబ్ సైట్ క్రాష్ అయినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈసీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తుంటే తెరుచుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసీ వెబ్ సైట్ గురించి పలువురు సోషల్ మీడియాలో కంప్లైంట్లు చేస్తున్నారు. ఈసీ వెబ్ సైట్ ఓపెన్ కాని నేపథ్యంలో ఎన్నికల ఫలితాల వివరాల్ని తెలుసుకునే వీల్లేకుండా పోయిన పరిస్థితి. దీంతో.. అధికారిక సమాచారాన్ని అందించే ఈసీ వెబ్ సైట్ క్రాష్ కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. వెబ్ సైట్ ఓపెన్ కాని అంశాన్ని తాము పరిశీలిస్తున్నట్లుగా ఈసీ వెల్లడించింది.

  • జానాకు పుత్రోత్సాహం.. సాగ‌ర్ గెలుపు ఖాయం

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జానారెడ్డి ఆశ‌లు ఫ‌లించాయి. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో తాను త‌ప్పుకొని .. తన కుమారుడుజైవీర్ రెడ్డికి టికెట్ ఇప్పించిన ఆయ‌న త‌న కుమారుడి గెలుపు కోసం.. ఎంతో శ్ర‌మించారు. అంతేకాదు.. ఇంటింటికీ తిరిగారు. అనేక స‌భ‌లు పెట్టారు. పొరుగు పార్టీల‌లోని వారిని కూడా త‌న‌వైపు తిప్పుకొన్నారు. మొత్తానికి జానా చాలా ప్ర‌య‌త్నాలే చేశారు.

ఫ‌లితంగా.. జానాకు పుత్రోత్సాహం ఘ‌డియ వ‌చ్చేసింది. నాగార్జున అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన‌.. కుందూరు జైవీర్‌రెడ్డి ప్ర‌త్య‌ర్థి బీఆర్ ఎస్ నేత నోముల భ‌గ‌త్ పై భారీ ఆధిక్యంతో దూసుకుపోతు న్నారు. ప్ర‌తి రౌండ్‌లోనూ భ‌గ‌త్ వెనుక‌బ‌డ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇక్క‌డ బీజేపీ ఉనికే లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో జైవీర్ రెడ్డి గెలుపు త‌థ్య‌మ‌నే మాట వినిపిస్తోంది.

బ్యాలెట్ ఓట్ల ఫ‌లితాల్లో.. 5 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కించుకున్న జైవీర్‌.. త‌ర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు లో మ‌రింత ముంద‌జ‌లో ఉన్నారు. మొత్తానికి కుందూరు క‌ల‌లు ఫ‌లించే స‌మ‌యం వ‌చ్చేసింద‌నే చెప్పాలి. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానం ఉన్న కుందూరు జానారెడ్డి..గ‌తంలోటీడీపీ నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకుని ఎన్టీఆర్ హయాంలో ర‌వాణా శాఖ మంత్రిగా,త‌ర్వాత‌.. కాంగ్రెస్‌లోకి వ‌చ్చాక హోం శాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు.

  • ప‌త్తాలేకుండా పోయిన జ‌న‌సేన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 8 స్థానాల నుంచి పోటీ చేసిన జ‌న‌సేన పార్టీ ప‌త్తాలేకుండా పోయింది. బీజేపీతో చేతులు క‌లిపిన జ‌న‌సేన అధినేత అతి క‌ష్టం మీద‌.. ఎనిమిది స్థానాలు ద‌క్కించుకున్నారు. అయితే.. తాజాగా వెల్ల‌డ‌వుతున్న ఫ‌లితాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల దూకుడు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోగా.. క‌నీసం వారి మాట కూడా వినిపించ‌డం లేదు.

ఎక్క‌డ గెలిచినా.. గెల‌వ‌క‌పోయినా.. కూక‌ట్‌ప‌ల్లిపై జ‌న‌సేన అధినేత ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక్క‌డ సీమాంధ్రుల ఓట్లు ఎక్కువ‌గా ఉండ‌డం.. సెటిల‌ర్లు.. భారీగా ఉండ‌డంతో ఇక్క‌డ గెలిచి తీరుతామ‌నే రీతిలో జ‌న‌సేన ఆశ‌లు పెట్టుకుంది. రియ‌ల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌కు టికెట్ ఇచ్చారు. అంతేకాదు.. ఏకంగా ప‌వ‌న్ మూడు సార్లు ఇక్క‌డ ప్ర‌చారం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. కూక‌ట్ ప‌ల్లి ప్ర‌జ‌లు జ‌న‌సేన‌ను ప‌ట్టించుకోలేదు. బీఆర్ ఎస్ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కు ఇక్క‌డి ప్ర‌జ‌లు జై కొట్టారు. రాష్ట్రంలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో బీఆర్ ఎస్ అభ్య‌ర్థులు వెనుక‌బ‌డ‌గా.. ఇక్క‌డ మాత్రం బీఆర్ ఎస్ అభ్య‌ర్థి మాద‌వ‌రం కృష్ణారావు ఏకంగా 9 వేల మెజారిటీతో దూసుకుపోతున్నారు. జ‌న‌సేన అభ్య‌ర్థి ప్రేమ్ కుమార్ నాలుగో స్థానంలో కేవ‌లం 1500 ఓట్ల‌తో ఉండ‌డం గ‌మ‌నార్హం.

  • డిపాజిట్ కోల్పోయే దిశ‌గా కామ్రెడ్‌!

క‌మ్యూనిస్టు యోధుడు, మేధావి.. సీపీఎం నేత‌.. త‌మ్మినేని వీర‌భ‌ద్రం.. డిపాజిట్ కోల్పోయే దిశ‌గా చాలా వేగంగా దూసుకుపోతున్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లో 2 ఓట్లు ప‌డ‌గా.. వీఎంల ద్వారా లెక్కిస్తున్న ఓట్ల‌లో మూడో రౌండ్ వ‌చ్చే స‌మ‌యానికి ఆయ‌న 236 ఓట్లు పోల‌య్యాయి. దీంతో ఆయ‌న గెలుపు మాట అటుంచితే.. అస‌లు డిపాజిట్ కూడా ద‌క్కించుకునే ప‌రిస్థితి లేకుండాపోయింది.

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న క‌మ్యూనిస్టులు.. పొత్తు కోసం ప్ర‌య‌త్నించారు. కానీ, కాంగ్రెస్ క‌లిసిరాలేదు. పోనీ.. మిత్ర‌ప‌క్షం సీపీఐ స‌హ‌కారం ఇస్తుంద‌ని ఆశించారు. అది కూడా సాధ్యం కాలేదు. ఈ ద‌శ‌లో ఈ సీటును వ‌దులుకునేందుకు మొద‌ట్లో నాయ‌కులు ప్ర‌య‌త్నించారు. కానీ, సాహ‌సం చేద్దామ‌నే ఉద్దేశంతోను, త‌మ‌కు తిరుగులేద‌నే భావ‌న‌తోనూ.. ఇక్క‌డ కామ్రెడ్ త‌మ్మినేని వీర‌భ‌ద్రం అభ్య‌ర్థిగా రంగంలోకి దిగారు.

నిజానికి ప్రచారం నుంచే ఆయ‌న వెనుక‌బ‌డ్డార‌నే చ‌ర్చ వ‌చ్చింది. ఇరు పక్షాలైన‌.. బీఆర్ ఎస్ నుంచి కందాల ఉపేంద‌ర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి వంటి హేమాహేమీలు.. కోటీశ్వ‌రులు రంగంలోకి దిగ‌డంతో.. క‌నీసం డిపాజిట్ల‌యినా ద‌క్కుతాయ‌నే ఆశ‌లు వ‌చ్చాయి. అయితే.. ఈ ఆశ‌ల‌పై కూడా.. తాజా ఫ‌లితం నీళ్లు కుమ్మ‌రించింది.

ఒక‌ప్పుడు పాలేరు, ఉమ్మ‌డి ఖ‌మ్మం అంటే.. క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌. కానీ, చేజేతులా చేసుకున్న రాజ‌కీయాలు.. ఇప్పుడు నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. వీర‌భ‌ద్రం క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేనంత ప‌రిస్థితిలో ఉండ‌డం గ‌మ‌నార్హం, ఈ రోజు ఉద‌య‌మే పోలింగ్ కేంద్రాల‌కు వెళ్లిన ఆయ‌న‌.. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మ‌య్యాక ఇంటికి వెళ్లిపోయారు.

  • ఆలేరు.. పాలేరు.. ఇంటి ముఖం ప‌ట్టిన బీఆర్ ఎస్ నేత‌లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు.. తుది ద‌శ‌కు చేరుతున్న నేప‌థ్యంలో బీఆర్ ఎస్ నేత‌లు.. కౌంటింగ్ కేంద్రాల‌ను ఖాళీ చేస్తున్నారు. ఆలేరు.. పాలేరు.. స‌హా.. దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు ఇంటికి వెళ్లిపోయారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ అభ్య‌ర్థులు ఏకంగా 10 వేల ఓట్ల మెజారిటీ తేడాతో రెండో స్థానం, 20 వేల ఓట్ల మెజారిటీతో మూడో స్థానానికి ప‌డిపోయారు.

దీంతో ఇక‌, కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద ఉండ‌డం ఇష్టం లేక‌.. చాలా మంది వ‌చ్చిన దారినే వెన‌క్కి వెళ్లిపోతున్న దృశ్యాలు మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చాయి. ఆలేరు కౌంటింగ్ కేంద్రం నుండి బయటికెళ్ళి పోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి క‌న్నీరు పెట్టుకున్నంత ప‌నిచేశారు. ఎన్నిక‌ల పోలింగ్ వేళ హ‌ల్చ‌ల్ చేసిన ఆమె భ‌ర్త‌.. మహేందర్ రెడ్డి కూడా పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

ప్రజల తీర్పును గౌరవించాలని చెప్పిన సునిత.. రెండుసార్లు టిఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు మూడోసారి మార్పు కోరుకుంటున్నారని వెల్లడించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ ఎస్ అభ్య‌ర్థి, సిట్టింగ్ నేత కందాల ఉపేంద‌ర్‌రెడ్డి ఏకంగా 12 వేల ఓట్ల మెజారిటీ వెనుక బ‌డ్డారు. ఇక్క‌డ పొంగులేటి.. దూకుడు కొన‌సాగుతోంది. దీంతో ఉపేంద‌ర్‌రెడ్డి కూడా.. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల నుంచి త‌న బిచాణా స‌ర్దేశారు.

కూక‌ట్ ప‌ల్లిలో జ‌న‌సేన నాయ‌కులు ఇంటి ముఖం ప‌ట్టారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం వేచి చూసిన బీఆర్ ఎస్ స‌భ్యులు, నాయ‌కులు.. ఆయ‌న మూడో స్థానానికి ప‌డిపోవ‌డంతో కిమ్మ‌న‌కుండా.. ఇంటి ముఖం ప‌ట్టారు. ఇక‌, బీఆర్ ఎస్ ఆధిక్యంలో ఉన్న చోట మాత్రం కాంగ్రెస్ పుంజుకుంటుంద‌నే ఆశ‌లో అక్క‌డి నాయ‌కులు ఎదురు చూస్తున్నారు.

  • టార్గెట్ కేసీఆర్‌.. ఈట‌ల కొంప ముంచేసిందా?

ఈట‌ల రాజేంద‌ర్‌. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న కీల‌క నేత‌. మాజీ మంత్రి కూడా. అయితే.. ఈయ‌న చేసిన ప్ర‌యోగం ఇప్పుడు విక‌టించింది. టార్గెట్ కేసీఆర్ అంటూ.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఉన్న‌దాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. ప్ర‌స్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో .. త‌న‌కు కలిసి వ‌చ్చిన హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈట‌ల పోటీ చేశారు. ఇక్క‌డ ఆయ‌న‌కు తిరుగులేదు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు.. త‌ర్వాత‌.. ఎలా చూసుకున్నా.. ఈట‌ల గెలుపు రాసిపెట్టుకోవ‌చ్చ‌న్న‌ట్టుగా ఉంది.

అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు ఈట‌ల ప‌రిస్తితి ఇప్పుడు దారుణంగా మారింది. త‌న‌కు తిరుగులేద‌ని.. త‌న గెలుపు ప‌క్కా అని లెక్క‌లు వేసుకున్న ఈట‌ల హుజూరాబాద్‌లో రెండో స్తానానికి ప‌డిపోయారు. ఇక‌, ఇక్క‌డ నుంచి బీఆర్ ఎస్ త‌ర‌ఫున వ‌రుస‌గా రెండోసారి పోటీకి దిగిన పాడి కౌశిక్‌రెడ్డి విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్నారు. అయితే.. ఈటల ఇలా ఓడిపోతుండ‌డానికి కార‌ణం.. టార్గెట్ కేసీఆర్ అంటు న్నారు ప‌రిశీల‌కులు.

బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌ను ఓడించి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రించిన ఈట‌ల రాజేంద‌ర్‌.. ఆయ‌న పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగారు. బీజేపీ అభ్య‌ర్థిగా అటు హుజూరాబాద్‌, ఇటు గ‌జ్వేల్ నుంచి కూడా పోటీ చేశారు. ఈ క్ర‌మంలో త‌న‌కు కంచుకోట అని ఎక్కువ‌గా అంచ‌నా వేసుకున్న హుజూరాబాద్‌ను ప‌క్క‌న పెట్టేసి.. ఎక్కువ స‌మ‌యం గ‌జ్వేల్‌కే కేటాయించారు. ఇదే హుజూరాబాద్‌లో దెబ్బేసింద‌నే వాద‌న వినిపిస్తోంది.

పోనీ.. గ‌జ్వేల్ అయినా.. ఈట‌ల సాధించింది ఏమైనా ఉందా? అంటే.. అక్క‌డ కూడా క‌నిపించ‌డం లేదు. పైగా.. ఇక్క‌డ మూడో స్థానంలో ఉన్నారు. అటు క‌లిసి వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గంపై కాన్‌సంట్రేట్ చేయ‌క‌పోగా.. ఇటు.. కొత్త నియోజ‌క‌వ‌ర్గంలోనూ చేతులు కాల్చుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. మొత్తానికిటార్గెట్ కేసీఆర్‌.. ఈట‌ల కొంప ముంచింద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అలా కాకుండా.. తాను హుజూరాబాద్‌కే ప‌రిమిత‌మై ఉంటే.. గెలుపు గుర్రం ఎక్కేవార‌ని అంటున్నారు.

  • బీజేపీ కీలక నేతల వెనుకంజ!

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలలో బిజెపికి ప్రజలు షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. బిజెపికి చెందిన కీలక నేతలు ఈటల, బండి సంజయ్, అరవింద్, రఘునందన్ రావులు ఫలితాలలో వెనుకబడడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. గోషామహల్ లో రాజాసింగ్ మినహా మిగతా నేతలంతా వెనుకబడడంతో ఆ పార్టీ నేతలు షాక్ అయ్యారు. మునుగోడులో ఐదో రౌండ్ ముగిసే సమయానికి బిజెపి అభ్యర్థి రఘునందన్ పై కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి 7000 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇక, కరీంనగర్లో బండి సంజయ్ పై బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల ప్రభాకర్ రెడ్డి 1300 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

కోరుట్లలో ధర్మపురి అరవింద్ కు కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కార్వాన్, సిర్పూర్ కాగజ్ నగర్, నిర్మల్, ముధోల్, బోథ్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, మహేశ్వరంలో బిజెపి అభ్యర్థులు స్వల్ప అధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, తమకు కాంగ్రెస్ తోనే పోటీ అని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత ఎన్నికలకు ముందు చెప్పడంతో బిజెపి, బీఆర్ఎస్ కలిసిపోయాయని ప్రజల్లో ఒక రకమైన భావన ఏర్పడిందని, ఆ భావన వల్లే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న అంచనాకు జనం వచ్చేశారని, ప్రభుత్వ వ్యతిరేకత వల్లే బిజెపికి పడాల్సిన ఓట్లు కూడా కాంగ్రెస్ కు పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీని ఇచ్చారని, దాదాపు 65 స్థానాలకు పైగా ఆ పార్టీ గెలుచుకుంటుందని ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల సరళని బట్టి అర్థమవుతుంది. బీఆర్ఎస్ కు 40 నుంచి 45 స్థానాలు వచ్చే అవకాశం ఉందని. బిజెపికి 5, ఎంఐఎం కి 4 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఫలితాల సరళిని బట్టి అర్థమవుతుంది.

  • జిల్లాల వారీగా కాంగ్రెస్ దూకుడు... మెదక్ లో హోరాహోరీ!

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హైదరబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇందులో భాగంగా... ఆదిలాబాద్ లోని 10 నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా... బీఆరెస్ 2 స్థానాల్లోనూ అన్యూహ్యంగా బీజేపీ 4 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి.

ఇక నిజామాబాద్ విషయనికొస్తే... ఆ జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా... బీఆరెస్స్, బీజేపీలు చెరో రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కరీంనగర్ విషయనికొస్తే... ఉన్న 13 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ 9, బీఆరెస్స్ 4 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఇక్కడ బీజేపీ పెర్ఫార్మెన్స్ శూన్యంగా ఉంది.

ఇదే సమయంలో వరంగల్ విషయానికొస్తే... అక్కడ ఉన్న 12 స్థానాల్లోనూ కాంగ్రెస్ ఏకంగా 10 స్థానాల్లో బలంగా ఉండగా.. బీఆరెస్స్ 2 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి నిరూపణ అయ్యినట్లుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా... ఖమ్మలోని పది నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ 8, బీఆరెస్స్ 1, సీపీఐ 1 స్థానంలోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో నల్గొండ జిల్లా విషయానికొస్తే... ఆ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లోనూ రికార్డ్ స్థాయిలో 11 నియోజకవర్గాల్లో హస్తం హవా కొనసాగుతుండగా.. బీఆరెస్స్ ఒకే స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇదే సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ 10, బీఆరెస్స్ 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

ఇక మెదక్ విషయానికొస్తే.. ఆ ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్, బీఆరెస్స్ లు సరిసమానంగా ఆధిక్యంలో ఉన్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ 5, బీఆరెస్స్ 5 స్థానాల్లో బలంగా దూసుకుపోతున్నాయి.


  • కేసీఆర్ పై రేవంత్ ముందంజ!

తెలంగాణ ఎన్నికల ఎగ్జాట్ ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు న్యాయం చేస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలో కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి దూకుడుమీద ఉన్నారు. ఇందులో భాగంగా సుమారు 2405 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ కొనసాగుతున్నారు.


  • రెండో గెలుపూ కాంగ్రెస్ దే... ఖమ్మంలో రికార్డ్ మెజరిటీ!

తెలంగాణ ఎన్నికల్లో తొలి విజయం నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీ... రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇందులో భాగంగా ఇల్లందులో జెండా ఎగురవేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య 38వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


  • తొలి ఫలితం... బోనీ కొట్టిన కాంగ్రెస్!

తెలంగాణలో తొలి ఫలితం వెల్లడైంది. అశ్వరావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు.

  • రికార్డ్ మెజారిటీ దిశగా రేవంత్, భట్టి, ఉత్తం!

తాజాగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తన దూకుడు ప్రదర్శిస్తుంది. ఇందులో భాగంగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో 10వ రౌండ్ పూర్తయ్యేసరికి 15,097 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా... మరో కీలక నేత భట్టి విక్రమార్క 10,499 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మరోపక్క మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి 24వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • కొల్లపూర్ లో బర్రెలక్క తాజా పరిస్థితి ఇది!

ఈ ఎన్నికల్లో అటు ఆన్ లైన్ లోనూ, ఇటు ఆఫ్ లైన్ లోనూ పార్టీలకు అతీతంగా బలంగా వినిపించిన పేరు కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్క. ఈ క్రమంలో బర్రెలక్క పోటీచేసిన కొల్లాపూర్‌ ని యోజకవర్గంలో మూడు రౌండ్లు పూర్తయ్యే సమయానికి ఆమెకు 983 ఓట్లు వచ్చాయి. మరోపక్క కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 14,200 ఓట్లతో ప్రస్తుతం లీడ్‌ లో ఉన్నారు.

  • హుజురాబాద్‌లో ఈటల మూడో ప్లేస్‌... తెలంగాణ ఓటర్ క్లియర్!

తెలంగాణ ప్రజలు మానసికంగా ఫిక్సయ్యి ఈ దఫా ఓటెసినట్లు కనిపిస్తుంది. కంచుకోటలు అనే కాన్సెప్ట్ కి చెరమగీతం పాడినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ ఎవరూ ఊహించని రీతిగా ప్రస్తుతం మూడోస్థానానికి పరిమితమయ్యారు.

ప్రస్తుతం కౌశిక్ రెడ్డి లీడ్ లో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రణవ్‌ ఉన్నారు. ఈ క్రమంలో ఈటెల రాజేందర్ మూడోస్థానంలో ఉన్నారు.

  • రికార్డ్ మెజారిటీ దిశగా రేవంత్ రెడ్డి... 10వేలు ఓట్ల ఆధిక్యంలో ఉన్నది వీరే!

కొడంగల్‌ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా... 9 రౌండ్లు పూర్తయ్యే సరికి 11వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో రేవంత్ కొనసాగుతున్నారు.

మరోపక్క మధిర ఐదో రౌండ్ ముగిసే సమయానికి భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌) 10,499 ఓట్లతో లీడ్‌ తో కొనసాగుతుండగా... రామగుండం 9వ రౌండు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ 29,641 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదే సమయంలో... అశ్వారావుపేట ఏడో రౌండ్ పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ 13,876 ఆధిక్యంలో ఉన్నారు.

  • గ్రేటర్ లో కారు జోరు... నాంపల్లిలో కొత్త టాపిక్!

గ్రేటర్ హైదరాబాద్ లో అసెంబ్లీ ఎన్నీకల్లో బీఆరెస్స్ గెలుపు బాధ్యతను కేటీఆర్ తీసుకున్నరని అంటారు. ఈ సమయంలో ఆయన కష్టానికి ఫలితం దక్కినట్లుగానే కనిపిస్తుంది. ఇందులో భాగంగా... కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, సనత్ నగర్, కుత్భుల్లాపూర్, జూబ్లీహిల్స్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ లో బీఆరెస్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఇదే సమయంలో ఊహించినట్లుగానే ఎంఐఎం 5 స్థానాల్లో ముందంజలో ఉండగా యాకత్ పూరలో బీజేపీ దూకుడుమీదుంది. మరోపక్క నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫీరోజ్ ఖాన్ ఆధిక్యంలో కొనసాగుతోన్నారు.

  • కేసీఆర్, రేవంత్ లకు ఉమ్మడి షాక్ ఇది!

కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌ రెడ్డి బ‌రిలో వుండ‌డంతో ప్రాధాన్యం సంత‌రించుకున్న సంగతి తెలిసిందే. ఇవి రెండూ వారిద్దరి సొంత నియోజకవర్గాలు కాదు! రేవంత్ కొండంగల్ నుంచి ప్రధానంగా బరిలో దిగగా.. గజ్వేల్ నుంచి కేసీఆర్ బరిలోకి దిగారు.

అయితే... సెకండ్ ఆప్షన్ గానో ఏమో కానీ ఇద్దరూ ఇక్కడ నుంచి తలబడ్డారు. ఈ సమయంలో తాజాగా అందుతున్న స‌మాచారం ప్రకారం నాలుగో రౌండ్ పూర్త‌య్యే స‌రికి వీరిద్దరికీ షాకిస్తూ... బీజేపీ అభ్య‌ర్థి వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కాగా... ఉదయం పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో కూడా బీజేపీకి ఆధిక్య‌త వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

  • ఈట‌ల‌కు హుజూరాబాద్‌ కంచుకోట... ఒక భ్రమేనా?

బీజేపీ సీనియ‌ర్ నేత ఈట‌ల రాజేంద‌ర్ అంటే హుజూరాబాద్... హుజూరాబాద్ అంటే ఈటెల రాజేందర్ అనే మాటలు ఆయన అభిమానుల నుంచి వినిపించేవి. అయితే తాజా పరిస్థితి చూస్తే... హుజూరాబాద్ లో ఈటెలకు ఎదురుగాలులు వీస్తున్నాయి. ఇక్కడ బీఆరెస్స్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోపక్క గజ్వేల్ లో కూడా ఈటలకు ఎదురు గాలులు వీస్తున్నాయి.

  • 10: 45 కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థుల్లో ఒకరు వెనుకంజ... నల్గొండలో కారుకు భారీ షాక్!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ నుంచి ఉన్న సీఎం అభ్యర్థుల్లో ఒకరుగా చెప్పే సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఆయనపై బీఆరెస్స్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మరోపక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా 12 సీట్లలోనూ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో దూకుడు ప్రదర్శిస్తుండగా... బీఆరెస్స్ ఒక్క స్థానంలో లీడ్ లో ఉంది.

ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన జోరు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఉన్న 10 సీట్లలోనూ 9 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా... కొత్తగూడెంలో కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ అభ్యర్థి కూనంనేని ముందజలో ఉన్నారు.

  • 10:30 పోస్టల్ బ్యాలెట్ లో బర్రెలక్క దూకుడు.. తాజా పరిస్థితి ఇది!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్, కాంగ్రెస్ ల దూకుడు, హోరాహోరీ కి సంబంధించిన చర్చ అనంతరం సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపించిన పేర్లలో బర్రెలక్క ఒకరు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్కకు తొలి రౌండ్ లో 473 ఓట్లు వచ్చాయి.

ఈ క్రమంలో తొలుత పోస్టల్ బ్యాలెట్ లో స్థానిక కాంగ్రెస్ అభ్యర్థికి షాకిస్తూ... అత్యధిక ఓట్లు సాధించారు. అయితే... ఈవీఎం ఓట్ల లెక్కింపులో మాత్రం ఆమె కాస్త వెనుకబడ్డారు. ఈ సమయంలో రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 1547 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 10:15 హుజూరాబాద్ లో ఈటెలకు షాక్... కౌశిక్ సెంటిమెంట్ వర్కవుట్?

ఊహించని రీతిలో అన్నట్లుగా హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ కీలక నేత ఈటెల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానంలో బీఆరెస్స్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా మూడో రౌండ్ పూర్తయ్యే సరికి కౌశిక్ రెడ్డి 3 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మరోపక్క కామారెడ్డిలో షాక్ తప్పదని భావిస్తున్న తరుణంలో.. గజ్వేల్ లో కేసీఆర్ ముందంజలో ఉన్నారు. ఇందులో భాగంగా.. గజ్వేల్ లో రెండో రౌండ్ పూర్తయ్యే సరికి కేసీఆర్ 1807 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.

కాగా... ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే జైత్రయాత్ర... ఓడిపోతే 4వ తారీఖున తన శవయాత్ర అని పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • 10AM లీడ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటుతున్న కాంగ్రెస్... కామారెడ్డిలో కేసీఆర్ కి షాక్?

ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ అందిన ఫలితాల ప్రకారం 62 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతుండగా.. బీఆరెస్స్ 49 స్థానాల్లో ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఈ సమయంలో బీజేపీ 6 స్థానాల్లోనూ, ఎంఐఎం 4 స్థానాల్లోనూ తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.

మరోపక్క కామారెడ్డిలో కేసీఆర్ కు షాక్ తప్పదనేలా ఫిగర్స్ తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డిలో మూడో రౌండ్ లో రేవంత్ రెడ్డి 2354 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీంతో.. గజ్వేల్ మాత్రమే కేసీఆర్ కు మిగిలుతుంది.. కామారెడ్డిలో షాక్ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

  • 9:30 కామారెడ్డిలో కేసీఆర్ ను దాటుతున్న రేవంత్.. మూడో రౌండ్ అప్ డేట్!

తెలంగాణలో కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అటు కొడంగల్ తో పాటు ఇటు కామారెడ్డిలోనూ రేవంత్ రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా... కొడంగల్ లో మూడో రౌండ్ పూర్తయ్యే సరికి 4389 ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన రేవంత్ రెడ్డి... కామారెడ్డిలో 1981 ఓట్లతో లీడ్ లో ఉన్నారు.

మరోపక్క గోషామహల్ లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ లీడ్ లో ఉన్నారు. ఇదే సమయంలో సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ లో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ వెనుకంజలో ఉండగా… వరంగల్ లో కొండా సురేఖ ముందంజలో ఉన్నారు.

  • 9:15 సిద్దిపేట గడ్డ.. హరీష్ రావ్ అడ్డా.. రికార్డ్ స్థాయిలో దూకుడు!

తెలంగాణ ఓట్ల లెక్కింపులో భాగంగా కాంగ్రెస్ - బీఆరెస్స్ ల మధ్య హోరా హోరీ పోరు సాగుతుంది. ఈ సమయంలో అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి వంటి నేతలు ఇప్పటివరకూ వందల సంఖ్యలో ముందజలో కొనసాగుతుండగా.. సిద్ధిపేటలో హరీష్ రావు మాత్రం వేల ఓట్లతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో హరీష్ రావు 6258 ఓట్ల లీడ్ లో ఉన్నారు.

మరొపక్క చార్మినార్ లో బీజేపీ లీడింగ్ లో ఉంది. ఇందులో భాగంగా చార్మినార్ లో బీజేపీ అభ్యర్థి 2539 ఓట్లతో లీడ్ లో ఉంది!


  • 9 AM కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, గజ్వేల్ లో ఈటల తాజా పరిస్థితి ఇది!

ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఇందులో భాగంగా... సుమారు 58 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉండగా... 33 స్థానాల్లో బీఆరెస్స్ ముందంజలో ఉంది. ఇదే సమయంలో కామారెడ్డిలో మొదటి రౌండ్ లో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

ఇదే సమయంలో ఫస్ట్ రౌండ్ అనంతరం గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ముందంజలో ఉండగా.. రెండో స్థానంలో కొనసాగుతున్న ఈటల రాజేందర్ కేసీఆర్ ను వెంటాడుతున్నారు.

  • 8:50 AM పోస్టల్‌ బ్యాలెట్‌ లో కాంగ్రెస్‌ ముందంజ.. ఖమ్మంలో పరిస్థితి ఇది!

ఓట్ల లెక్కింపులో భాంగంగా ఈ రోజు ఉదయం 8 గంటల తర్వాతా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ముందుగా పోస్టల్‌, సర్వీస్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో చాలా స్థానాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉందని తెలుస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని 9 స్థానాల్లో కాంగ్రెస్‌, ఒక చోట సీపీఎం ముందంజలో ఉన్నాయి. ఇందులో భాగంగా మధిరలో భట్టి విక్రమార్క లీడ్‌ లో ఉన్నారు.


  • 8.15 am : పోస్టల్‌ బ్యాలెట్ తో మొదలు... కాంగ్రెస్ - బీఆరెస్స్ హోరా హోరీ!

తెలంగాణలో ఓట్ల లెక్కింపు మొదలైపోయింది. ఇందులో భాగంగా ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌, సర్వీస్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్‌ - బీఆరెస్స్ ల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా.. రాష్ట్రంలో అధికార కైవసానికి మేజిక్‌ ఫిగర్‌ 60 సీట్లు అనే విషయం తెలిసిందే. మొత్తం 119 సీట్లు!




  • అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసి.. ఓట్ల లెక్కింపు ఈ రోజు (ఆదివారం) ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. ఈ ఎన్నికల ఫలితం కోసం తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేనా.. యావత్ దేశం కూడా ఆసక్తిగా చూస్తున్నది. నిజానికి తెలంగాణ అసెంబ్లీతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు (మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఛత్తీస్ గఢ్.. మిజోరం) ఎన్నికలు జరిగాయి.
  • వీటి పోలింగ్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రం కంటే ఎంతో ముందే పూర్తి అయ్యాయి. వీటి ఫలితాలు కూడా ఈ రోజే వెలువడనున్నాయి. ఇక.. తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులోకి వెళితే.. కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు షురూ కానుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ 60. ఏ పార్టీ అయితే అరవై స్థానాల్ని సొంతం చేసుకుంటుందో ఆ పార్టీ అధికారంలోకి రానుంది.
  • ఇంతకూ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెలువడే అవకాశం ఉందన్న విషయంలోకి వెళితే.. 119 నియోజకవర్గాలకు సంబంధించి 2417రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. అధికారుల అంచనా ప్రకారం మొదటి ఫలితం ఉదయం 10 గంటలకు తేలే వీలుంది. గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తేలాలంటే 26 రౌండ్లకు కానీ తేలదు. అదే సమయంలో భద్రాచలం అసెంబ్లీ ఫలితం 13రౌండ్లకే తేలిపోనుంది. అశ్వరావు పేట 14రౌండ్లు.. చార్మినార్ ఫలితం 15 రౌడ్లు.. సికింద్రాబాద్ 16 రౌండ్లు.. కంటోన్మెంట్ 17 రౌండ్లు.. అంబర్ పేట ఫలితం 18 రౌండ్లకు తేలనుంది. ఓట్ల ఆధారంగా రౌండ్ల సంఖ్య పెరగటం.. తగ్గటం ఉంటుంది.
  • ఏది ఏమైనా పోటాపోటీగా ఫలితాలు వస్తే మాత్రం అధికారం ఎవరి వైపు మొగ్గుతుందన్న విషయంపై స్పష్టత రావాటానికి మధ్యాహ్నం 1.30 గంటల వరకు టైం తీసుకుంటుందని చెబుతున్నారు. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉంటే మాత్రం ఉదయం 11.30 గంటలకు కొంత.. మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తిస్థాయిలో అంచనాకు వచ్చేయొచ్చని చెప్పక తప్పదు.