Begin typing your search above and press return to search.

ఎవరీ మన్నె క్రిశాంక్.. పేరు ప్రస్తావించి మరీ కేటీఆర్ ట్వీట్ బుజ్జగింపు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ గులాబీ బాస్ కేసీఆర్ తాజాగా తన రేసు గుర్రాల జాబితాను విడుదల చేయటం తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Aug 2023 6:08 AM GMT
ఎవరీ మన్నె క్రిశాంక్.. పేరు ప్రస్తావించి మరీ కేటీఆర్ ట్వీట్ బుజ్జగింపు
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ గులాబీ బాస్ కేసీఆర్ తాజాగా తన రేసు గుర్రాల జాబితాను విడుదల చేయటం తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు నాలుగు మినహాయించి 115 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సింగిల్ షాట్ లో ప్రకటించిన వైనం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా ప్రకటించిన జాబితాలో దాదాపు ఎనిమిది మంది అభ్యర్థులు కొత్తవారు ఉన్నారు. ఆయా స్థానాలకు ఆశించిన వారికి భిన్నంగా టికెట్లు రావటంపై గులాబీ నేతలు కొందరు కస్సుమన్నారు. అయితే.. అంచనాలతో పోలిస్తే.. వచ్చిన రియాక్షన్ తక్కువనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. అభ్యర్థుల జాబితా విడుదల వేళ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఒకటి ఆసక్తికరంగా మారింది. సామర్థ్యం.. అర్హత ఉన్నప్పటికీ కిందరికి సీట్లు దక్కకపోవటంపై కేటీఆర్ స్పందించారు. ప్రజా జీవితంలో నిరాశను కూడా ఒక ముందడుగుగా తీసుకొని ముందుకు వెళ్లాలన్న ధైర్యాన్ని చెప్పిన ఆయన.. ట్వీట్ లో మన్నె క్రిశాంక్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పేరు పెద్దగా పాపులర్ కానప్పటికీ.. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆయన సుపరిచితులు. ఆ మాటకు వస్తే సికింద్రాబాద్ ఎంపీ పరిధిలో ఆయన పాపులర్.

ఇంతకీ ఈ క్రిశాంక్ ఎవరు? ఇతని పేరును కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించి బుజ్జగించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతలా ఆయనకు ప్రాధాన్యతను కేటీఆర్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఎవరు? అన్న కుతూహలం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కంటోన్మెంట్ గులాబీ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని క్రిశాంక్ భావించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన.. కొన్నేళ్ల క్రితం గులాబీ పార్టీలో చేరారు. యువనేతగా ఉంటూ.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తూ.. తాను గురి పెట్టిన కంటోన్మెంట్ స్థానంలో చురుకుగా పని చేశారు. వినూత్నంగా వ్యవహరిస్తూ.. అన్ని వర్గాల తలలో నాలుకలా ఆయన కార్యక్రమాలు ఉంటాయి.

నిరుద్యోగులకు వర్కు షాప్ లు.. వివిధ వర్గాలకు సాయం అందేలా ఆయన సేవా కార్యక్రమాలతో పాటు.. నిత్యం ప్రజల్లో ఉండటం అతన్ని నియోజకవర్గంలో పాపులర్ గా మార్చింది. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మరణించటంతో.. ఈసారి ఎన్నికల్లో ఆయనకే సీటు ఖాయమన్న మాట బలంగా ప్రచారమైంది. సాయన్న కుమార్తెకు ఎమ్మెల్సీ కోటా కిందకు తీసుకెళ్లి.. క్రిశాంక్ కు టికెట్ ఇస్తారని భావించారు. దీనికి తోడు.. మంత్రి కేటీఆర్ టీంలో నేతగా అతనికి పేరుంది. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా.. విధేయుడిగా వ్యవహరించే క్రిశాంక్ కు టికెట్ ఖాయమన్న ప్రచారం జరిగినా.. చివర్లో సాయన్న కుమార్తెను బరిలోకి దింపితే సానుభూతి ఖాయమన్న లెక్కలతో అధినేత .. ఆమెకు టికెట్ కేటాయించారు.

అభ్యర్థుల జాబితా విడుదలైన వేళ.. అమెరికాలో ఉన్న కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అర్హత ఉన్న క్రిశాంక్ లాంటి కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవటం దురదృష్టకరమని.. పోటీ అవకాశం ఉన్నా టికెట్లు దక్కని వారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసే భరోసా పార్టీ ఇస్తుందన్న ట్వీట్ చేశారు. తనకు టికెట్ దక్కకపోవటంపై స్వయంగా కేటీఆర్ తన పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేసిన వైనంపై క్రిశాంక్ స్పందించారు. 'అన్నా.. బీఆర్ఎస్ పార్టీ అనే పెద్ద కుటుంబంలో నాకు సభ్యుడిగా అవకాశం ఇచ్చింది మీరే.

ఈ కుటుంబం రాష్ట్రవ్యాప్తంగా నాకు అమితమైన ప్రేమనిచ్చింది. మీరు లేకుంటే నా రాజకీయ జీవితం 2018-19లోనే ముగిసిపోయి ఉండేది. సాధ్యమైనప్పుడల్లా మీరు నా చెయ్యి పట్టుకుని నడిపించారు. నాకు, మా ఆవిడ సుహాసినికి అదే చాలు. ఎప్పటికీ మీతోనే కేటీఆర్ అన్నా' అంటూ ట్వీట్ చేశారు.