రేఖ లేఖ నిజమేనా?
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 23 Aug 2023 7:54 AM GMTతెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. వీటిలో ఒక్క వేములవాడ మినహాయించి మిగిలివన్నీ ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలే కావడం గమనార్హం.
ముఖ్యంగా 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు టీఆర్‌ఎస్ తరఫున నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో గెలుపొందిన అజ్మీరా రేఖానాయక్ కు ఈసారి కేసీఆర్ సీటు నిరాకరించడం హాట్ టాపిక్ గా మారింది. ఆమెను తప్పించి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ కు కేసీఆర్ సీటు కేటాయించారు.
దీంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సీట్లు రానివారిపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. వారితో మంతనాలు జరుపుతోంది. మరోవైపు సీట్లు లభించని నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారిస్తున్నారు.
ఈ క్రమంలో తనకు సీటు దక్కకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరతారని అంటున్నారు. కాంగ్రెస్ లో చేరడానికి ఆమె సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆమె పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఆ దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఎమ్మెల్యేగా తనకు 50 రోజుల సమయం ఉందని.. ఆ తర్వాతే భవిష్యత్ గురించి ఆలోచిస్తానని రేఖా నాయక్ చెబుతున్నారు. మరి పీసీసీకి టికెట్ కావాలని ఆమె నిజంగానే దరఖాస్తు చేశారా? తన పీఏ ద్వారా ఏమైనా దరఖాస్తు చేయించారా? లేదంటే ఎవరైనా కావాలనే రేఖా నాయక్ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేశారని అబద్ధాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటివరకు రేఖా నాయక్ దీనిపై వివరణ ఇవ్వలేదు. కాబట్టి ఆమె వివరణ ఇచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతుంది.
కాగా ఇప్పటికే రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ టికెట్ కోరుతున్నారు. ఈ మేరకు టికెట్ కోసం దరఖాస్తు కూడా సమర్పించారని అంటున్నారు.
కాగా అసిఫాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆత్రం సక్కుకు కూడా కేసీఆర్ సీటు నిరాకరించారు. ఆత్రం గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొంది ఆ తర్వాత బీఆర్‌ఎస్ లో చేరారు. ఆత్రం సక్కుకు వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానం కేటాయిస్తారని.. అందుకే ఆయనకు ఇప్పుడు అసెంబ్లీ టికెట్ కేటాయించలేదని చెబుతున్నారు. అయితే ఆయన కూడా అసెంబ్లీకే పోటీ చేయడానికి మొగ్గుచూపుతున్నారని టాక్ నడుస్తోంది.