బీఆర్ఎస్ : అధికారం డౌటేనా ?
కేసీయార్ అంచనాలు వేసుకుంటునట్లు, మంత్రులు చెబుతున్నట్లుగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది అనుమానమే
By: Tupaki Desk | 4 Sep 2023 7:32 AM GMTకేసీయార్ అంచనాలు వేసుకుంటునట్లు, మంత్రులు చెబుతున్నట్లుగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది అనుమానమే. కేసీయార్ మాటల్లో అయితే బీఆర్ఎస్ కు 105 సీట్లు రాబోతోంది. మంచి మెజారిటితో తామే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని మంత్రులు పదేపదే చెబుతున్నారు. అయితే వీళ్ళు చెప్పేదానికి గ్రౌండ్ లెవల్లో వాస్తవాలకు చాలా తేడాలున్నట్లు 'తెలంగాణా ఇంటెన్షన్స్' తాజా సర్వేలో తేలింది. తెలంగాణాలో ప్రజల నాడి ఎలాగుందనే విషయాన్ని తెలుసుకునేందుకు తెలంగాణా ఇంటెన్షన్స్ ప్రతి వారం సర్వేలు నిర్వహిస్తోంది.
తాజా సర్వే ప్రకారం బీఆర్ఎస్ కు అధికారం డౌటే అని తేలిందట. ఎందుకంటే మెల్లిగా బీఆర్ఎస్ విజయావకాశాలు తగ్గిపోతున్నాయని సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్ పుంజకుంటోందట. పొత్తులు పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతాయని జనాలు అభిప్రాయపడుతున్నారట. పొత్తులు పెట్టుకుని గట్టిగా పోటీచేస్తే కాంగ్రెస్ ఓటుషేర్ 5 శాతం పెరిగే అవకాశముందని సర్వేలో తేలింది.
ఇపుడు కాంగ్రెస్ ఓటు షేర్ 29 శాతం ఉందట. పొత్తుల కారణంగా అది 33 శాతానికి పెరుగుతుందని సర్వేలో బయటపడింది. అంటే జనాభిప్రాయం మెల్లిగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు అర్ధమవుతోంది. దీనికి కారణం ఏమిటంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంఎల్ఏలకే కేసీయార్ టికెట్లివ్వటం. సిట్టింగ్ ఎంఎల్ఏలపైన జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. నేతల అభిప్రాయాలు, జనాల ఆలోచనలను కేసీయార్ పట్టించుకోకుండా మళ్ళీ సిట్టింగులకే టికెట్లిచ్చారు. ఆ వ్యతిరేకత పార్టీ నేతల్లోనే కాకుండా జనాల్లో కూడా ఇపుడు బయటపడుతోంది.
ఇదే సమయంలో బీజేపీ యాక్టివ్ లేకపోవటం, పుంజుకోకపోవటంతో జనాల మొగ్గు కాంగ్రెస్ వైపు కనిపిస్తోంది. రేపు టికెట్ల ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పరిస్ధితులు ఎలాగుంటుందో తెలీదుకానీ ఇప్పటికైతే సీనియర్లంతా ఏకతాటిపైనే ఉన్నారు. దీన్నే జనాలు కోరుకుంటున్నారట. అందుకనే బీఆర్ఎస్ వ్యతిరేకత అంతా కాంగ్రెస్ కు ప్లస్సుగా మారుతోంది. ఇదే సమయంలో ఇంకో అవకాశం కూడా కనబడుతోంది. అదేమిటంటే బీఆర్ఎస్ కు జనాధరణ తగ్గి కాంగ్రెస్ కు పెరిగేకొద్ది హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. హంగ్ అసెంబ్లీ వస్తుందని పోయిన వారం 6.2 శాతం జనాలు అనుకుంటే ఆ అనుమానాలు ఇపుడు 7.2 శాతంకు పెరిగిందట.