ఈ జంపింగ్ లు ఎవరికి మేలు.. ఎవరికి చేటు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు
By: Tupaki Desk | 19 Oct 2023 8:46 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు తెలంగాణలో పెరుగుతున్న గ్రాఫ్, పార్టీకి సానుకూలంగా మారుతున్న పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు ఎన్నికల సమరంలో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీని దెబ్బ కొట్టేందుకు మరో పార్టీ, ఒక పార్టీపై పైచేయి సాధించేందుకు మరో పార్టీ నేతల చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో పొద్దున లేచినప్పటి నుంచి మొదలు కాంగ్రెస్ లో నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన నేతలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన నాయకులు అనే వార్తలే కనిపిస్తున్నాయి.
మరోవైపు రేసులో పుంజుకోవాలనుకుంటున్న బీజేపీ కూడా చేరికలపై ఫోకస్ పెట్టింది. కానీ ఆ పార్టీకి ఊపు వచ్చేలా ప్రధాన నాయకులు చేరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చేరికలు, నాయకుల జంపింగ్ లో ఎవరికి మేలు చేస్తాయి? ఎవరికి చేటు చేస్తాయి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల దగ్గరకు వస్తుండటంతో ముందు వెనుకా ఆలోచించకుడా వచ్చిన నాయకులను వచ్చినట్లు పార్టీలు చేర్చుకుంటున్నాయి. సభలు, సమావేశాల్లో తమ పార్టీ కండువాలు కప్పేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టేందుకు.. తమ పార్టీ బలాన్ని చాటేందుకు ఈ చేరికలు ఉపయోగపడతాయని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.
కానీ ఈ నాయకుల చేరికల వల్ల పార్టీలో సమస్యలు కూడా వస్తున్నాయనే టాక్ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఇప్పుడేమో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు దక్కుతున్నాయి. మరికొంతమందికి టికెట్లు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీని వీడుతున్నారు. వీడే సమయంలో పార్టీపై, నాయకులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు ప్రజల మనసుల్లోకి బలంగా వెళ్తే అప్పుడు అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులు ప్రభుత్వ అవినీతిని, ఎమ్మెల్యేల అక్రమాలను ఎండగడుతున్నారు. ఇన్ని రోజులూ అధికార పార్టీలోనే ఉన్నారు కాబట్టి వీళ్లు చెప్పేది నిజమేనని ఓటర్లు నమ్మే ఆస్కారముంది. మరోవైపు కోవర్టుల భయం కూడా పార్టీలకు ఇబ్బంది మారుతుందనే చెప్పాలి. అందుకే వచ్చినవాళ్లను వచ్చినట్లు చేర్చుకోవడం కంటే పరిస్థితులకు తగ్గట్లుగా తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.