Begin typing your search above and press return to search.

అడ్రస్ లేని పవన్

ఏమి చేస్తున్నారంటే ఏమీ చేయటంలేదనే సమాధానం వినిపిస్తోంది. అవును నిజమే పార్టీ అభ్యర్ధుల గెలుపుకు పవన్ ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదు

By:  Tupaki Desk   |   15 Nov 2023 5:42 AM GMT
అడ్రస్ లేని పవన్
X

గెలుపు టార్గెట్ గా అన్నీ పార్టీలు ప్రచారాన్ని ఉధృతంగా చేసుకుంటున్నాయి. అభ్యర్ధుల గెలుపుకు పార్టీల అధినేతలు, అధ్యక్షులు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపుకు ఒకవైపు కేసీయార్, కాంగ్రెస్ అభ్యర్ధుల విజయానికి రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు కిషన్ రెడ్డి నానా అవస్తలు పడుతున్నారు. ఇంతమంది ఇన్ని అవస్తలు పడుతుంటే మరి జనసేన అభ్యర్ధుల గెలుపుకు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏమిచేస్తున్నారు ?

ఏమి చేస్తున్నారంటే ఏమీ చేయటంలేదనే సమాధానం వినిపిస్తోంది. అవును నిజమే పార్టీ అభ్యర్ధుల గెలుపుకు పవన్ ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదు. అసలు అభ్యర్ధులను పట్టించుకుంటున్నారా అన్నదే అర్ధంకావటంలేదు. బీజేపీతో పొత్తులో జనసేన ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్ధులకు బీ ఫారాలు ఇచ్చారు అందరితో కలిసి గ్రూప్ ఫొటో దిగి అడ్రస్ లేకుండా పోయారు. ప్రచారం మరో 13 రోజుల్లో ముగిసిపోతోంది. తమ అభ్యర్ధుల గెలుపుకు మిగిలిన వాళ్ళు ఎంతగా శ్రమ పడుతున్నారో చూస్తు కూడా పవన్ ప్రచారంలోకి ఎందుకు దిగలేదో తెలీటంలేదు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లితో పాటు తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులు పోటీచేస్తున్నారు. ఎన్నికల్లో పవన్ ప్రచారం చేస్తే తమకు మంచి ఊపొస్తుందని అభ్యర్ధులు అనుకుంటున్నారు. అయితే పవన్ ప్రచారానికి వచ్చే సూచనలేమీ కనబడటంలేదు. దాంతో ఏమిచేయాలో అభ్యర్ధులకు కూడా అర్ధంకావటంలేదు.

ఒకవైపు నియోజకవర్గాల్లో ప్రచారంపై మిగిలిన పార్టీల అభ్యర్ధుల గురించి వార్తలు కనబడుతున్నాయి. వాళ్ళ ప్రచారంపై సోషల్ మీడియాలో బాగా ప్రచారం కూడా జరుగుతోంది. కానీ జనసేన అభ్యర్ధుల గురించి మాత్రం ఎక్కడా ప్రచారం జరగటంలేదు, ఎవరూ పెద్దగా మాట్లాడుకోవటంలేదు. తాజా పరిణామాలు అభ్యర్ధులకు పెద్ద షాకనే చెప్పాలి. అభ్యర్ధుల సంగతి దేవుడెరుగు అసలు పవన్ కు ఏమైందన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇంతోటిదానికి పార్టీ 32 నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నట్లు ఒకపుడు పవన్ చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది.