Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికల్లో ఆ 4 అభ్యర్థులు ప్రత్యేకం!

పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనూహ్యంగా తెర మీదకు వచ్చారు 26 ఏళ్ల యశస్విని రెడ్డి.

By:  Tupaki Desk   |   11 Nov 2023 1:30 PM GMT
తెలంగాణ ఎన్నికల్లో ఆ 4 అభ్యర్థులు ప్రత్యేకం!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. వారం క్రితం కూడా అంత ఊపు లేదన్నట్లు అనిపించినా.. నామినేషన్ల తుది ఘట్టానికి చేరుకున్న తర్వాత నుంచి ఎన్నికల ప్రచారం ఊపందుకేంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఊరికి ముందే డిక్లేర్ చేయగా.. కాంగ్రెస్.. బీజేపీలు రెండూ చివరి నిమిషం వరకు సాగతీత ధోరణిని అనుసరించటం ద్వారా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలాఉంటే.. తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నలుగురు అభ్యర్థులు మిగిలిన అభ్యర్థులకు భిన్నంగా ఉన్నారు. వారి ప్రొఫైల్ సగటు రాజకీయ నాయకుడికి విరుద్ధంగా ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.


ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఉన్న ఈ నలుగురి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. వారంతా ముప్ఫై ఏళ్లు.. ఆలోపు ఉన్న వారు కావటం ఒకటైతే.. ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారే కావటం మరో ఆసక్తికర అంశం. ఈ నలుగురు అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో అత్యంత పిన్న వయసు ప్రజాప్రతినిధులుగా నిలుస్తారని చెప్పాలి. అలా అని ఈ నలుగురు అభ్యర్థులు తీసిపారేసే అభ్యర్థులేం కాదు. ప్రధానపార్టీలకు బలంగా పోటీ ఇస్తున్న ఈ నలుగురు.. వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల విషయానికి వస్తే..

1. పాలకుర్తి

పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనూహ్యంగా తెర మీదకు వచ్చారు 26 ఏళ్ల యశస్విని రెడ్డి. దాదాపు ఐదేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసిన ఆమె పెళ్లి తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేసిన ఆమె.. ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చారు. ఇదిలా ఉంటే.. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన హనుమండ్ల ఝూన్సీరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

అయితే.. భారత పౌరసత్వం కోసం ఆమె చేసుకున్న అప్లికేషన్ ముందుకు కదలకపోవటంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో యశస్విని రెడ్డి పేరు తెర మీదకు రావటమే కాదు.. చివరకు ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచారు. ఇంతకీ ఆమెకు సీటు దక్కటానికి కారణం.. ఝూన్సీరెడ్డి కోడలే యశస్విని రెడ్డి. దీంతో.. అభ్యర్థిగా ఎంపికై.. సాంకేతిక కారణాలతో పోటీ నుంచి వైదొలిగే వేళ.. తన కోడలకు టికెట్ ఇప్పించుకోవటంలో సక్సెస్ అయ్యారు. దీంతో.. ఆమె పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా మారారు.

2. పెద్దపల్లి

పెద్దపల్లి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం ఆమె ప్రొఫైలే. 27 ఏళ్ల ఆమె నియోజకవర్గంలోని కనగర్తి గ్రామానికి చెందిన వారు. ఖరగ్ పూర్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన ఆమె లక్షలాది రూపాయిల జీతాలు ఇచ్చే కంపెనీల ఆఫర్లను వదిలేసి సామాజిక సేవ చేయటం షురూ చేశారు. సొంత మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫ్రీగా ట్యూషన్లు చెప్పటంతో పాటు.. మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తాజాగా ఎన్నికల బరిలో దిగారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తిరుగుతూ.. పార్టీని విస్తరించిన ఆమెకు టికెట్ ఇచ్చి సముచిత గౌరవాన్ని ఇచ్చారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. ఇలాంటివేళ.. ఆమె కానీ అనూహ్యంగా విజయం సాధిస్తే.. అదో రికార్డుగా మారుతుందని చెప్పక తప్పదు.

3. మెదక్

తెలంగాణ ఎన్నికల ఆరంభంలో సంచలనంగా మారింది మల్కాజిగిరి. ఈ నియోజకవర్గానికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మైనంపల్లి హన్మంతరావు.. తాజా ఎన్నికల్లోనూ పార్టీ టికెట్ దక్కినప్పటికీ.. తన కొడుకు రోహిత్ రావుకు టికెట్ దక్కకపోవటంపై కినుకు వహించటం తెలిసిందే. తన కొడుక్కి టికెట్ దక్కకపోవటానికి మంత్రి హరీశ్ రావే కారణమన్న ఆగ్రహంతో ఉన్న ఆయన.. హరీశ్ మీద ఇప్పటివరకు ఎవరూ చేయని తీవ్రమైన ఆరోపణలు.. విమర్శలు చేయటం తెలిసిందే.

అనంతరం పార్టీ మారిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజిగిరిబరిలో ఉన్నారు. ఆయన కుమారుడు 26 ఏళ్ల రోహిత్ రావు.. కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్నారు. మేడ్చల్ మెడిసిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రోహిత్.. రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన ట్రాక్ రికార్డు సొంతం. మెదక్ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన అతను.. గడిచిన రెండున్నరేళ్లుగా భారీగా బ్యాక్ గ్రౌండ్ వర్కు చేసుకోవటం తెలిసిందే. గులాబీ సారు టికెట్ కు నో చెప్పటంతో కాంగ్రెస్ లోకి మారిన అతను.. తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. మరోవైపు..ఈ నియోజకవర్గంలో ఎలా అయినా గెలిచి తీరాలన్నపట్టుదలతో హరీశ్ ఉన్నారు. తన శిష్యురాలైన పద్మాదేవేందర్ గెలుపు కోసంఆయన ప్రత్యేకంగా పని చేస్తున్నారు. మరి.. తుది ఫలితం ఏ రీతిలో ఉంటుందో చూడాలి.

4. నారాయణపేట

తాత మక్తల్ ఎమ్మెల్యేగా.. తండ్రి పీసీసీ సభ్యుడిగా పని చేసిన బ్యాక్ గ్రౌండ్.. వీరిద్దరూ 2005లో మావోలు జరిపిన కాల్పుల్లో మరణించిన విషాద ఉదంతం నేపథ్యంలో తాజా ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణికారెడ్డి మిగిలిన అభ్యర్థులకు భిన్నంగా కనిపిస్తున్నారు. ముప్ఫై ఏళ్ల వయసున్న ఆమె ప్రస్తుతం భాస్కర మెడికల్ కాలేజీలో రేడియాలజిస్టుగా పీజీ చేస్తున్నారు. తాత చిట్టెం నర్సిరెడ్డి.. తండ్రి వెంకటేశ్వరెడ్డి ఇద్దరు మావోలు జరిపిన దాడిలో మరణించారు.

2009లో కొత్తగా ఏర్పాటైన నారాయణపేట నియోజకవర్గ రాజకీయాల్లో ఆమె మేనమామ శివకుమార్ రెడ్డి క్రియాశీలకంగా ఉననారు. రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన స్వల్ప వ్యత్యాసంతో ఓటమిపాలయ్యారు. ఇలాంటి వేళలో.. కాంగ్రెస్ అధినాయకత్వం మహిళా కోటాలో పర్ణికకు ఛాన్సు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఆమె తల్లి కమ్ ఐఏఎస్ అధికారిణి లక్ష్మీ ప్రస్తుతం పౌరసరఫరాల శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పర్ణిక బ్యాక్ గ్రౌండ్ లో మరో విశేషం ఉంది. ఆమె మాజీ మంత్రి డీకే అరుణకు మేనత్త. ప్రస్తుతంఆమె బీజేపీలో ఉండటం.. తాజా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం తెలిసిందే.