Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికలు: 11 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలివే

ఈ సమయంలో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు క్యూకడుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 6:36 AM GMT
తెలంగాణ ఎన్నికలు: 11 గంటల వరకు నమోదైన పోలింగ్  వివరాలివే
X

నవంబర్ 30, 2023 ఉదయం 7 గంటలు అవ్వగానే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో బీఆరెస్స్, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు సాగుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు క్యూకడుతున్నారు. దీంతో ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

అవును... తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల చిన్నచిన్న ఘర్షణ వాతావరణం తలెత్తినా.. పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల నాటికి, 7.78 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

ఇదే ఉత్సాహంతో ఉదయం 11 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20.64శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచి కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు.

ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... "తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాను" అని అన్నారు.

కాగా... ఈ 119 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీఆరెస్స్ నుంచి 118 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీఆరెస్స్ అధినేత కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 117 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీ చేస్తున్నారు.

ఇక మిగిలిన పార్టీలో బీజేపీ 111 స్థానాల్లో 110 అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. ఆ పార్టీ నుంచి ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. బీఎస్పీ 107 స్థానాల్లో 107 మంది అభ్యర్థులు పోటీకి నిలబడ్డారు. ఇక ఎంఐఎం 9, సీపీఎం 19, సీపీఐ 1, జనసేన 8 స్థానాల్లో పోటీకి తమ అభ్యర్థులను నిలబెట్టాయి.