బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ ఖాతాలో ?
దాని ఫలితం ఏమిటి అన్నదే ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలు ఇదమిద్ధంగా తెలియచేశాయని అంటున్నారు
By: Tupaki Desk | 2 Jun 2024 3:27 AM GMTతెలంగాణాలో రాజకీయ శూన్యత ఉందా అంటే లేదు కానీ అది కృత్రిమంగా సృష్టించబడింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత భారీ షాక్ తిన్న బీఆర్ఎస్ తేరుకునేలోగానే పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోయాయి. ఇక కాంగ్రెస్ గెలుపు ఉత్సాహంతో ఉంటే 8 అసెంబ్లీ సీట్లతో పాటు భారీ ఓటు శాతం పెంచుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మీద డే వన్ నుంచి ఫోకస్ పెట్టింది.
దాని ఫలితం ఏమిటి అన్నదే ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలు ఇదమిద్ధంగా తెలియచేశాయని అంటున్నారు. అధికార కాంగ్రెస్ కి ఎటూ సానుకూలత ఉంటుంది. గెలిచి ఆరు నెలలు కాలేదు కాబట్టి ఆ ప్రభావం ఉంది, దాంతో రేవంత్ రెడ్డి సారధ్యంలో పార్టీ గట్టిగానే కష్టపడింది.
అలా కాంగ్రెస్ తన వాటాను తాను తీసుకుంది అని అంటున్నారు. ఇక రెండవ సైడ్ చూస్తే విపక్షలో రెండు పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ. అలా బీఆర్ ఎస్ నెమ్మదిగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటూండగానే బీజేపీ దూకుడు చేసింది. దాంతో కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను బీజేపీ గంపగుత్తగా రాబట్టగలిగింది అని అంటున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తే కనుక తెలంగాణాలో బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరగనుందని తెలుస్తోంది. న్యూస్18 మెగా ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం చూస్తే కనుక ఏకంగా బీజేపీ ఏడు నుంచి పది ఎంపీ సీట్ల దాకా గెలుచుకుంటుందని అంటున్నారు.
ఇదే సర్వే సంస్థ కాంగ్రెస్ కి అయిదు 5-8, బీఆర్ఎస్ 2-5, మజ్లిస్ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. ఇక కేవలం బీజేపీకి సీట్లు మాత్రమే కాదు ఓటింగ్ కూడా భారీగా పెరగనుందని ఎగ్జిట్ సర్వేలు చెబుతున్నాయి.
న్యూస్18 మెగా ఎగ్జిట్ పోల్ ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 21 శాతం, బీజేపీకి 37 శాతం, కాంగ్రెస్ పార్టీకి 34 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్ షేర్ రావొచ్చునని అంచనా వేసింది. దీనిని కనుక విశ్లేషించుకుంటే భారీ ఎత్తున బీఆర్ఎస్ ఓటు షేర్ ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది అని అంటున్నారు.
ఒక్కసారి అయిదేళ్ళ క్రితం వెనక్కి వెళ్తే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 19 శాతం ఓట్ షేర్ మాత్రమే వచ్చింది. ఈసారి సీట్లతో పాటు ఓటింగ్ శాతం కూడా దాదాపు డబుల్ అవుతోంది అన్నది ఎగ్జిట్ పోల్ సర్వే నివేదికలు గా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బాగానే పెర్ఫార్మ్ చేసినా బీఆర్ఎస్ గట్టిగానే పోటీ ఇవ్వడంతో ఇబ్బంది పడింది. ఈసారి బీఆర్ఎస్ చోటు ఇచ్చేసిందా అన్నది ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలు చూస్తే విశ్లేషించుకోవాల్సి వస్తోంది.