Begin typing your search above and press return to search.

రుణమాఫీ వేళ.. ఫుల్ మీల్స్ పెట్టేస్తే సరిపోయేది కదా రేవంత్

ఈ రోజు సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లోని రూ.లక్ష వరకు ఉన్న బ్యాంకు బాకీ మాఫీ అయినట్లుగా ఫోన్లకు మెసేజ్ లు రానున్నాయి

By:  Tupaki Desk   |   18 July 2024 9:30 AM GMT
రుణమాఫీ వేళ.. ఫుల్ మీల్స్ పెట్టేస్తే సరిపోయేది కదా రేవంత్
X

కొంత కష్టంగా ఉంటుంది. కానీ.. ప్రయత్నిస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. రైతుల రుణమాఫీ మీద మాటలు చెప్పే ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణలోని రేవంత్ సర్కారు తాను చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ కొత్త కల్చర్ కు తెర తీశారు. రైతులు తీసుకున్న రుణాల్ని ఒకేసారి రూ.2 లక్షల వరకున్న బ్యాంక్ అప్పును రద్దు చేసే నిర్ణయం ప్రభుత్వం పట్ల సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పక తప్పదు. అయితే.. ఇక్కడో చిన్న మెలిక ఉంది. దీనిపైనా సీఎం ఫోకస్ పెడితే మరింత ప్రజాదరణ ఖాయమంటున్నారు.

ఈ రోజు సాయంత్రం నుంచి రైతుల ఖాతాల్లోని రూ.లక్ష వరకు ఉన్న బ్యాంకు బాకీ మాఫీ అయినట్లుగా ఫోన్లకు మెసేజ్ లు రానున్నాయి. తొలుత రూ.లక్ష అప్పు ఉన్న రైతుల ఖాతాల్ని మాఫీ చేసి.. తర్వాత రూ.2 లక్షల వరకు ఉన్న అప్పును రైటాఫ్ చేయనున్నారు. అయితే.. ఇందుకు 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 13 మధ్యలో తీసుకున్న పంట రుణాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు.

తుది గడువుగా ఉన్న డిసెంబరు 13 కటాఫ్ మీద ఎవరికి ఎలాంటి భేధాభిప్రాయం లేదు. కాకుంటే.. ఈ పథకాన్ని వర్తింప చేసేందుకు పెట్టిన 2018 డిసెంబరు 12 మీదనే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. సాంకేతికంగా ఉండే కొన్ని అంశాల కారణంగా.. 2018 డిసెంబరు ముందు తీసుకున్న రుణాలకు ప్రభుత్వం అమలు చేసే రుణమాఫీ వర్తించే వీల్లేదు. అలాంటి వారి సంఖ్య తక్కువే ఉంటుంది. వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం మీద కొంత భారం పడొచ్చు. కానీ.. వీలైనంత ఎక్కువమందికి మేలు కలిగేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటే బాగుండన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా చేస్తున్న రుణమాఫీకి దాదాపు రూ.34 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. పలువురు రైతులు కోరుతున్న కటాఫ్ డేట్ ను కాస్త ముందుకు జరిపితే.. మరింత మందికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. చేస ఖర్చు ఎటూ చేస్తున్నారు. అలాంటి వేళలో.. మహా అయితే మరో రూ.500 కోట్లు.. లేదంటే రూ.వెయ్యి కోట్ల ఖర్చు మాత్రమే అవుతుంది. ఆ మొత్తాన్ని ఇచ్చేస్తే.. చిన్న సన్నకారు రైతులకు మేలు జరుగుతుందన్న మాట వినిపిస్తోంది. భోజనం పెట్టాలని డిసైడ్ అయ్యాక.. పరిమితులతో కూడిన ప్లేట్ మీల్స్ కాకుండా.. ఫుల్ మీల్స్ పెట్టేస్తే.. రేవంత్ ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పక తప్పదు.