తెలంగాణ గీతానికి 'ఉద్యమ' సెగ!
దీంతో మరో వారంలో ఆవిష్కృతం కావాల్సిన తెలంగాణ ప్రత్యేక గీతంపై వివాదాలు ముసురు కున్నట్టు అయింది.
By: Tupaki Desk | 25 May 2024 12:58 PM GMTతెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంతో శ్రద్ధ తీసుకుని రూపొందిస్తున్న 'జయజయహే తెలంగా ణ' గీతానికి ఇప్పుడు అనూహ్యమైన ఇబ్బంది ఏర్పడింది. ఈ గీతానికి తెలంగాణ ఉద్యమ సెగ తగిలింది. 'ఇలా ఎందుకు చేశారు?' అంటూ.. తెలంగాణ సినీ సంగీతకారుల సంఘం(టీసీఎంఏ) ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు మూలమైన విషయాలను మీరు మరిచిపోతున్నారా? అని ప్రశ్నించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీసీఎంఏ నాయకులు సుదీర్ఘ లేఖ రాశారు. దీంతో మరో వారంలో ఆవిష్కృతం కావాల్సిన తెలంగాణ ప్రత్యేక గీతంపై వివాదాలు ముసురు కున్నట్టు అయింది.
విషయం ఇదీ..
రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక గీతం ఉండాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి.. గత రెండు మాసాల్లో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ప్రముఖ కవి అందెశ్రీతో ఆయన గీతాన్ని రాయించారు. అదేవిధంగా దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ కీరవా ణికి సంగీతం సమకూర్చే బాధ్యతలను అధికారికంగానే అప్పగించారు. మొత్తంగా గత నెల రోజుల నుంచి అనేక మార్పులు.. చేర్పులు.. పరిశోధనల అనంతరం.. 90 సెకన్ల నిడివితో ఈ గీతాన్ని రూపొందించారు. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతోంది. దీనిని జూన్ 2వ తేదీన జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియాగాంధీ చేతుల మీదుగా ఈ గీతాన్ని ఆవిష్కరింప చేయనున్నారు.
వివాదం ఇలా మొదలైంది!
జూన్ 2వ తేదీన గీతాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుని.. ఆహ్వాన పత్రికలు కూడా ముద్రిస్తున్న సమ యంలో అనూహ్యంగా తెలంగాణ గీతంపై.. వివాదం ముసురుకుంది. తెలంగాణ సినీ సంగీతకారుల సంఘం(టీసీఎంఏ) సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతూ లేఖను సంధించింది. గీత రచయిత అందెశ్రీ గురించి కాకుండా.. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గురించి.ఈ సంఘం వివాదం రేకెత్తించింది. ఆయన మన వాడు కాదని.. ఎలా ఆయనతో సంగీతం అందిస్తారని.. గీతం బాధ్యతలను ఆంధ్రా సంగీత దర్శకుడికి ఎలా అప్పగిస్తారన్నది కీలకమైన పాయింట్.
అంతేకాదు.. నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ అణచివేతకు గురైన ఆంధ్రా కు చెందిన సంగీత దర్శకుడిని ఎలా నియమించారని.. ఇది ఇక్కడి ప్రతిభ గల సంగీత దర్శకులను అవమానించడమే నని.. వారికి అవకాశాలు రాకుండా అడ్డుకోవడమేనని సంఘం ప్రతినిధులు లేఖలో నిప్పులు చెరిగారు. ''సకల జనుల సహకారంతో... అమరవీరుల త్యాగంతో రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ గీతాన్ని పక్క రాష్ట్రాలవాళ్లు పాడటం ఏమిటి? అలా చేస్తే తెలంగాణ కళాకా రులను అవమానించడమే. తెలంగాణలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. మన తెలంగాణ వారికి అవకాశమిచ్చి మనవా రికి గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాం'' అని సంఘం ప్రతినిధులు లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.