Begin typing your search above and press return to search.

ఆయన లేని తెలంగాణ ‘తొలి అవిర్భావ ఆవిర్భావ’ దినోత్సవం

ఆరు దశాబ్దాల కల అయిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు అవుతోంది. వచ్చే జూన్ 2 నాటికి దశాబ్దం పూర్తి చేసుకోనుంది.

By:  Tupaki Desk   |   28 May 2024 11:12 AM GMT
ఆయన లేని తెలంగాణ ‘తొలి అవిర్భావ ఆవిర్భావ’ దినోత్సవం
X

ఆరు దశాబ్దాల కల అయిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు అవుతోంది. వచ్చే జూన్ 2 నాటికి దశాబ్దం పూర్తి చేసుకోనుంది. ఇప్పటివరకు పది ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకొంది. ఈ పదేళ్లలో ఎంతో ప్రగతి కూడా సాధించింది. తెలుగు రాష్ట్రాలకే తలమానికమైన హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంలో మరింత ఉన్నతంగా నిలిచింది. ఇలాంటి తెలంగాణలో వచ్చే జూన్ 2 జరగనున్న అవతరణ ఉత్సవాలు ప్రత్యేకత సంతరించుకోనున్నాయి.

ఆయన లేకుండానే..

1950, 60ల్లోనే పురుడు పోసుకుని 1970 నాటికి తెరమరుగైన ప్రత్యేక తెలంగాణ వాదాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత ప్రజా సంఘాలది అయితే.. దానిని అందిపుచ్చుకుని రాజకీయ పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది. ఈ క్రమంలో పదమూడేళ్ల పాటు ఆయన అనేక కష్టాలు, నష్టాలు, అవమానాలు భరించారు. బలమైన లాబీని, నాయకులను ఎదుర్కొని తెలంగాణ సాధించారు. ప్రత్యేక రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 2న బాధ్యతలు కూడా స్వీకరించారు.

మొదటినుంచి మొన్నటివరకు

2014 నుంచి పదేళ్ల పాటు వరుసగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కేసీఆర్ ప్రభుత్వంలో అధికారికంగా జరిగాయి. నిరుడు ఎన్నికలకు ముందు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల పేరిట ఘనంగా నిర్వహించారు. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ఈసారి రే‘వంతు’

అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఇందుకోసం సీఎం రేవంత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఎన్నికల కోడ్ ఉన్నందున దానికి లోబడి కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందున కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని ఆహ్వానించడం, మరోవైపు అధికారిక గీతం జయజయహే తెలంగాణ ఆవిష్కరణ తదితర కీలక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, పదేళ్లలో తొలిసారి అధికారికంగా కేసీఆర్ లేకుండానే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనుండడం గమనార్హం.