Begin typing your search above and press return to search.

మూడోసారి తెలంగాణకు తమిళ వ్యక్తే గవర్నర్

నరసింహన్ తర్వాత తమిళి సైను గవర్నర్ గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   20 March 2024 4:37 AM GMT
మూడోసారి తెలంగాణకు తమిళ వ్యక్తే గవర్నర్
X

తెలంగాణ నూతన గవర్నర్ గా సీపీ రాధాక్రిష్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఝూర్ఖండ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయనకు తెలంగాణ బాధ్యతలు అప్పజెప్పటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ముచ్చటగా మూడోసారీ తమిళనాడుకు చెందిన వ్యక్తినే తెలంగాణ గవర్నర్ గా నియమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నుంచే ఉమ్మడి రాష్ట్రానికి తమిళనాడుకు చెందిన మాజీ సీబీఐ బాస్ ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్ గా వ్యవహరించేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన్ను ఇక్కడే ఉంచేసి.. ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించారు.

నరసింహన్ తర్వాత తమిళి సైను గవర్నర్ గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల మీద బోలెడంత ఆసక్తి ఉన్న ఆమె తాజా సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు వీలుగా గవర్నర్ పదవికి రాజీనామా చేసేసి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. తమిళనాడులోబీజేపీ ఎంపీగా బరిలోకి దిగి తన సత్తా చాటాలని తపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమిళిసై ప్లేస్ లో గవర్నర్ గా నియమితులైన సీపీ రాధాక్రిష్ణన్ సైతం తమిళనాడుకు చెందిన వారే కావటం విశేషం.

తమిళిసై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా.. పుదుచ్చేరి ఇన్ ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా తెలంగాణకు నియమితులైన రాధాక్రిష్ణన్ పుదుచ్చేరి బాధ్యతల్ని చూడనున్నారు. రెండుచోట్ల పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు రాధాక్రిష్ణనే బాధ్యతలు నిర్వర్తిస్తారని చెబుతున్నారు. తెలంగాణకు గవర్నర్ ను నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రాధాక్రిష్ణన్ రాజ్ భవన్ కు చేరుకున్నారు.

బుధవారం ఉదయం 11.15 గంటలకు రాజ్ భవన్ లో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే ప్రమాణస్వీకారం చేయిస్తారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని చెబుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన ఈ రోజు హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఇక.. రాధాక్రిష్ణన్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

1957 మే నాలుగో తేదీన పుట్టిన ఆయన తమిళనాడులోని కోయంబత్తూరు ఎంపీ స్థానానికి రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈ రెండుసార్లు బీజేపీ తరఫున విజయం సాధించారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన ఆయన 2016నుంచి 2019 వరకు ఆలిండియా కాయర్ బోర్డు ఛైర్మన్ గా వ్యవహరించారు. తమిళనాడు సీనియర్ బీజేపీ నేతల్లో ఒకరిగా ఆయనకు పేరుంది.