కదిలించుకొని కరెంటు షాక్ ఇప్పించుకున్న కేటీఆర్
కొందరు మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. మరికొందరు మాట్లాడకపోతే ప్రయోజనం ఉంటుంది
By: Tupaki Desk | 24 Jan 2024 5:45 AM GMTకొందరు మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. మరికొందరు మాట్లాడకపోతే ప్రయోజనం ఉంటుంది. తాజాగా గులాబీ పార్టీ ముఖ్యనేత కేటీఆర్ మాటల్ని చూస్తే మాత్రం.. రెండో అంశం ఆయనకు సరిగ్గా సరిపోతుందన్న మాట ఇటీవల కాలంలో పదే పదే పలువురి నోట వినిపిస్తోంది. కీలకమైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ నుంచి.. అవసరానికి మించి అనవసరంగా మాట్లాడే ధోరణి కేటీఆర్ లో అంతకంతకూ ఎక్కువ అవుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
తాను మాట్లాడే కొద్దీ.. లేని సమస్యల్ని నెత్తిన తెచ్చుకున్నట్లుగా మారుతున్న పరిస్థితి. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరి రెండు నెలలు కాలేదన్న విషయాన్ని మర్చిపోయి.. అవసరానికి మించి ఆయన నోటినుంచి వస్తున్న మాటలతో ప్రజల్లో ఉన్న సానుభూతి కూడా పోతున్న పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు హామీలు ఇవ్వటం.. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీల్ని అమలు చేస్తామని చెప్పటం తెలిసిందే.
రేవంత్ సర్కారు కొలువు తీరిన రెండు వారాలకే.. ఆరు గ్యారెంటీల అమలుపై మాట్లాడటం షురూ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన తీరును సొంత పార్టీకి చెందిన పలువురు తప్ప పట్టిన పరిస్థితి. అయినప్పటికీ ఆయన తన ధోరణిని మార్చుకోవటం లేదు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చి.. పట్టించుకోవటం లేదంటూ కరెంటు బిల్లులు కట్టొద్దంటూ పిలుపునిచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీని వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఒకవైపు చెబుతుంటే.. అందుకు భిన్నంగా యాభై రోజులకే విమర్శలకు దిగటంలో అర్థం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కేటీఆర్ కు దిమ్మ తిరిగేలా రేవంత్ సర్కారు షాకిచ్చింది. ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తామని ప్రకటించటం ద్వారా.. కేటీఆర్ కు మాటలకు బలమైన దెబ్బ కొట్టినట్లుగా చెబుతున్నారు.
హామీల అమలు విషయంలో రేవంత్ సర్కారు తప్పులు చేసే అవకాశాన్ని ఇవ్వకుండా.. రిమైండర్ మాదిరి కేటీఆర్ వ్యవహరించటాన్ని గులాబీ నేతలు పలువురు తప్పు పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ గడువు వరకు వెచి చూడకుండా ఇలా తొందరపాటుతో వ్యాఖ్యలు చేయటం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని.. ఆ విషయం తాజాగా నిరూపితమైందని పేర్కొంటున్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయాలన్న కేటీఆర్ డిమాండ్ ను ప్రస్తావిస్తూ.. నిరుద్యోగ భ్రతి మొదలుకొని డబుల్ బెడ్రూం ఇళ్ల వరకు ఇచ్చిన హామీల్ని గత ప్రభుత్వం విస్మరించిందంటూ విరుచుకుపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు చెంపలు వేసుకోవటం మానేసి.. ఇప్పటికి బుల్ డోజ్ చేసేలా మాట్లాడే కేటీఆర్ మాటలు గులాబీ పార్టీకి గుది బండగా మారుతున్నట్లుగా చెబుతున్నారు.తాజా ఎపిసోడ్ చూసిన వారంతా.. కేటీఆర్ కు రేవంత్ సర్కారు సరైన రీతిలో కరెంటు షాకిచ్చిందన్న వ్యాఖ్యాలు వినిపించటం గమనార్హం.