Begin typing your search above and press return to search.

"గ్యారెంటీ" అప్పుల్లో టాప్ 2లో తెలంగాణ... ఫాలో అవుతున్న ఏపీ!

2021-22లో ఆయా రాష్ట్రాలు చేసిన గ్యారెంటీ అప్పులకు సంబంధించిన వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది

By:  Tupaki Desk   |   12 Dec 2023 6:53 AM GMT
గ్యారెంటీ అప్పుల్లో టాప్ 2లో తెలంగాణ... ఫాలో అవుతున్న ఏపీ!
X

2021-22లో ఆయా రాష్ట్రాలు చేసిన గ్యారెంటీ అప్పులకు సంబంధించిన వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ డాక్యుమెంట్ 2023-24 ప్రకారం (2022 వరకు) దేశంలోనే యూపీ అత్యధిక రుణాలు కలిగి ఉందని తెలిపింది. అనంతరం తెలుగు రాష్ట్రం తెలంగాణ ఉండగా.. ఆ తర్వాత స్థానంలో ఏపీ ఉంది!

అవును... "గ్యారెంటీ" అప్పుల విషయంలో ఉత్తరప్రదేశ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా తెలంగాణ రెండో ప్లేస్ లో, ఏపీ మూడో ప్లేస్ లో ఉన్నాయి. ఇందులో భాగంగా... గత ఏడాది మర్చినాటికి రూ. 1.71 లక్షల కోట్ల రుణాలతో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా.. రూ. 1.35 లక్షల కోట్లతో తెలంగాణ రెండో ప్లేస్ లో నిలిచింది. ఇదే క్రమంలో 1.17 లక్షల కోట్లతో ఏపీ మూడో స్థానంలో నిలిచింది.

ఈ విషయంలో... దేశం మొత్తం 4.07 లక్షల కోట్ల గ్యారెంటీ రుణాలు ఉండగా.. ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలు మాత్రమే ఇందులో ప్రధాన వాటాను కలిగి ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన 2014లో కేవలం రూ. 62,822 కోట్లుగా ఉన్న తెలంగాణ గ్యారెంటీ రుణాలు.. 2021లో లక్ష కోట్ల మార్కుకు చేరుకోవడం గమనార్హం.

గతంలో కాగ్ నివేధిక చెప్పిన రాష్ట్రాల అప్పుల లెక్కల విషయాలపై స్పందించిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2019లో టీడీపీ దిగిపోయే నాటికి రూ. 66,600 కోట్లు గ్యారంటీ లేకుండా అప్పులు చేసిందని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత బీఆరెస్స్ ప్రభుత్వంపై విరుచుకుపడిన మంత్రి భట్టి విక్రమార్క, బాకీ ఉన్న హామీలపై వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో తాజాగా గ్యారెంటీ అప్పులపై ఆర్బీఐ వివరాలు వెల్లడించింది.

ఇదే సమయలో 2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని.. పన్నుయేతర ఆదాయాలను పొందడంలో సహాయపడటానికి ఆస్తి మానిటైజేషన్‌ ను పరిశీలించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ నివేదిక తాజాగా తెలిపింది. ఇందులో భాగంగా... నిరుపయోగంగా ఉన్న భూముల ఆస్తులపై సమగ్ర సమీక్ష చేపట్టి, ఆదాయాన్ని సమకూర్చే పారిశ్రామిక ఎస్టేట్‌ లుగా మార్చడం లేదా పూర్తిగా విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమీకరించాలని సిఫార్సు చేసింది.