తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు... సిటీలో కొత్త సీపీలెవరంటే..?
తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి
By: Tupaki Desk | 12 Dec 2023 10:36 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా... హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ (సీపీ)గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు.
అవును... తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం మంగళవారం హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ లకు కొత్త పోలీస్ కమిషనర్ లను నియమించింది. ఇదే సమయంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో హెడ్ తో పాటు మూడు కమిషనరేట్ లకు కొత్త కమీషనర్ లను నియమించింది. ఇందులో భాగంగా... హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. రాచకొండ సీపీగా జి సుధీర్ బాబు నియమితులయ్యారు.
ఇదే క్రమంలో... సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా అవినాష్ మొహంతి నియమితులవ్వగా.. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గా సందీప్ శాండిల్య నియమితులయ్యారు. దీంతో ప్రస్తుతం రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ లుగా ఉన్న దేవేంద్రసింగ్ చౌహాన్, ఎం స్టీఫెన్ రవీంద్రలు డీజీపీకి రిపోర్టు చేయాల్సిందిగా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
కాగా... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం సీవీ ఆనంద్ పై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యా నియమితులయ్యారు. సీవీ ఆనంద్ పై బదిలీ వేటు వేసిన సమయంలో హైదరాబాద్ సీపీ రేసులో ప్రధానంగా సందీప్ శాండిల్య, సంజయ్ కుమార్ జైన్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్లు వినిపించాయి.
ఆ సమయంలో ఈ ముగ్గురిలో శ్రీనివాస్ రెడ్డినే హైదరాబాద్ సీపీగా నియమిస్తారని అప్పట్లో ఊహాగాణాలు వెలువడ్డాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డినే సీపీగా ప్రభుత్వం నియమించింది. మరోవైపు కౌంటింగ్ రోజు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో సస్పెండ్ అయిన తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ ను ఎత్తివేసింది.