కేసీఆర్ వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుంది.. తేల్చిన మంత్రి
ఒకటి తర్వాత ఒకటి చొప్పున రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తున్నాయి
By: Tupaki Desk | 15 Dec 2023 5:40 AM GMTఒకటి తర్వాత ఒకటి చొప్పున రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల కాలంలో అధికారపక్షాలు వ్యవహరిస్తున్న ధోరణికి భిన్నంగా.. రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడే ధోరణితో కాకుండా.. కలుపుకుపోయేలా వ్యవహరిస్తున్న వైనం కొత్తగా ఉంది. గడిచిన పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలకు భిన్నమైన వాతావరణం నెలకొంటోంది.
అందరి అంచనాలకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. తన తీరుతో ఆయన విమర్శించే అవకాశాన్ని ఇవ్వటం లేదు. ఫాంహౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుజారి పడిన ఉదంతంలో యశోదా ఆసుపత్రిలో చేరగా.. ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లటం ద్వారా కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఎవరికి ఏమైనా సరే.. పదేళ్లుగా ముఖ్యమంత్రి(సరిగ్గా చెప్పాలంటే తొమ్మిదిన్నరేళ్లు) పదవిలో ఉండి కూడా పరామర్శలకు దూరంగా ఉండేవారు కేసీఆర్.
అలాంటి ఆయన.. అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉంటే.. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ స్వయంగా వెళ్లటం.. కేసీఆర్ ను పరామర్శించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కేసీఆర్ ట్రీట్ మెంట్ కు సంబంధించి రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కేసీఆర్ కు అయిన వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. అంతేకాదు.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించినట్లు చెప్పారు. కేసీఆర్ ఆసుపత్రి బిల్లులన్ని కూడా ప్రభుత్వమే ఇస్తుందన్న మంత్రి దామోదర రాజనర్సింహా మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి.. దీనికి కేసీఆర్ అండ్ కో ఎలా రియాక్టు అవుతారన్నది చూడాలి.