Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... కేసీఆర్, హరీశ్ లకు కొత్త డ్యూటీలు వేసిన రేవంత్!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లైన తర్వాత ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Dec 2023 2:30 AM GMT
హాట్ టాపిక్... కేసీఆర్, హరీశ్ లకు కొత్త డ్యూటీలు వేసిన రేవంత్!
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లైన తర్వాత ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే. ఇంతకాలం అధికారంలో ఉన్న బీఅరెస్స్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చుంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో మునుపెన్నడూ లేని స్థాయిలో చర్చలు రసవత్తరంగా సాగుతున్నాయి. మూడు విమర్శలు, ఆరు నిర్ణయాలు అన్నట్లుగా జరుగుతుంది. ఈ సమయంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇంతకాలం వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. ఇప్పుడు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నాయనే కామెంట్లను సొంతం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రాజెక్టులు, విద్యుత్, ధరణి పోర్టల్ వంటి కీలక విషయాలు అసెంబ్లీలో హాట్ టాపిక్ లుగా మారుతున్నాయి. ఈ సమయంలో అసెంబ్లీలో విద్యుత్‌ రంగ పరిస్థితిపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం రేవంత్, ఎమ్మెల్యే అక్భరుద్దీన్ మధ్య మాటల యుద్ధం నడిచింది.

ఈ సందర్భంగా మైకందుకున్న ఒవైసీ... కాంగ్రెస్ పార్టీ ముస్లింల గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన సీఎం రేవంత్... మైనార్టీల సంక్షేమం గురించి తమకు మరోకరు చెప్పాల్సిన అవసరం లేదని సూచిస్తూ... ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించి చేయాలని స్ట్రాంగ్ గా స్పందించారు. ఇదే సమయంలో... గత బీఆరెస్స్ ప్రభుత్వంలో ఎంఐఎం పార్టీ భాగస్వామ్యం కాదా అని ప్రశ్నించారు.

విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట, గజ్వేల్ టాప్!:

అనంతరం విద్యుత్ బిల్లుల ఎగవేత అంశంపై సీఎం స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... విద్యుత్ బిల్లుల ఎగవేత విషయంలో సిద్దిపేటది మొదటి స్థానంలోనూ గజ్వేల్‌ రెండో స్థానంలోనూ కొనసాగుతుండగా.. హైదరాబాద్ సౌత్‌ ది మూడో స్థానమని అన్నారు. ఈ క్రమంలో... సిద్దిపేటలో 61.37 శాతం, గజ్వేల్‌ లో 50.29 శాతం, హైదరాబాద్ సౌత్‌ లో 43 శాతం విద్యుత్ బకాయిలు ఉన్నాయని రేవంత్ చెప్పారు.

బకాయిల బాధ్యత ఆ ఎమ్మెల్యేలదే!:

ఇలా ప్రధానంగా సిద్దిపేట, గజ్వేల్‌, హైదరాబాద్ సౌత్‌ లలో భారీస్థాయిలో విద్యుత్ బిల్లుల బకాయిలు ఉన్నాయని తెలిపిన రేవంత్... ఆ బకాయిలు చెల్లించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే అని అన్నారు. సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నుంచి ఎన్నికైన వారే గత తొమ్మిదేళ్లలో తెలంగాణను పాలించారని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు. అందువల్ల ఆ బాధ్యతను ఆయా ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు.