6 గ్యారంటీల అమలు ప్రభుత్వానికి సాధ్యమయ్యేనా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చింది. దీంతో వాటి అమలుకు శ్రీకారం చుట్టింది
By: Tupaki Desk | 26 Dec 2023 6:59 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చింది. దీంతో వాటి అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి తీసుకొచ్చింది. అలాగే రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందుబాటులోకి తెచ్చింది. ఇంకా నాలుగు హామీలు నెరవేర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాటి అమలు అగ్నిపరీక్షగా మారింది.
ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఆర్థిక వ్యవస్థ తయారయింది. సుమారు 7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఈనేపథ్యంలో ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడం సవాలుగా మారింది. ఆరు గ్యారంటీల అమలు ఇప్పుడు కాంగ్రెస్ కు కష్టంగా కనిపిస్తోంది. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకోరు. నెరవేర్చాలంటే నిధుల కొరత. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కత్తి మీద సాముగా తయారయింది. గత ప్రభుత్వం చేసిన అప్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షగా మారింది. వచ్చే నెల నుంచి అందించే పింఛన్ల విషయంలో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. పింఛన్లు కూడా పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు పెంచితే ఆర్థిక భారం మరింత మోపెడయ్యే అవకాశం ఉంది.
ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే రూ.1.29 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి 38,234 అప్పులు తెచ్చుకునే అవకాశముండగా అక్టోబర్ నాటికి రూ.33,378 కోట్ల మేర అప్పులు చేయడంతో ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. ఆరు గ్యారంటీల అమలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయింది.
ఆదాయ మార్గాలు లేకపోవడంతో నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలియడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మనుగడ కష్టమే. దీంతో ప్రతిపక్షాలు కూడా గోల చేయడం ఖాయం. దీంతో కాంగ్రెస్ పార్టీకి చిక్కుముడే ఎదురవుతోంది. ఆరు గ్యారంటీల అమలు పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలు కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి.