Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ చలానా డిస్కౌంట్ మేళాకు భారీ రెస్పాన్స్.. ఈ సమస్యను తీర్చాలి!

కారణం ఏదైనా.. హైదరాబాద్ మహానగరంలో వాహనం నడిపే వారందరికి ట్రాఫిక్ చలానాల చేదు అనుభవం గురించి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Dec 2023 9:30 AM GMT
ట్రాఫిక్ చలానా డిస్కౌంట్ మేళాకు భారీ రెస్పాన్స్.. ఈ సమస్యను తీర్చాలి!
X

కారణం ఏదైనా.. హైదరాబాద్ మహానగరంలో వాహనం నడిపే వారందరికి ట్రాఫిక్ చలానాల చేదు అనుభవం గురించి తెలిసిందే. ఎంతో అప్రమత్తంగా ఉంటే తప్పించి.. చలానా పోటును తప్పించుకునే పరిస్థితి ఉండదు. అయితే.. ఇటీవల పెండింగ్ ట్రాఫిక్ చలానాల్ని క్లియర్ చేసుకునేందుకు వీలుగా తెలంగాణ వ్యాప్తంగా క్లియరెన్స్ మేళాను ప్రకటించటం తెలిసిందే. భారీ డిస్కౌంట్లతో తమ వాహనాలకు ఉన్న ట్రాఫిక్ చలానాల్ని క్లియర్ చేసుకునే సదుపాయాన్ని పౌరులు వినియోగించుకుంటున్నారు.

పెండింగ్ చలానాలపై డిస్కౌంట్ సదుయానికి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ మేళాను ప్రకటించిన రెండు రోజులకే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలానాలు చెల్లింపులు జరిగాయని చెబుతున్నారు. దీంతో.. రాష్ట్ర ఖజానాకు రూ.8.44 కోట్ల ఆదాయం లభించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3.54 లక్షల చలానాలకు రూ.2.62 కోట్లు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1.82 లక్షల చలానాలకు రూ.1.8 కోట్లు.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 93 వేల చలానాలకు రూ.76.79 లక్షల ఆదాయం వచ్చినట్లుగా పేర్కొన్నారు.

అయితే.. భారీగా వస్తున్న స్పందన కారణంగా చెల్లింపులు జరిపే సమయంలో ఈచలానా వెబ్ సైట్ తరచూ హ్యాంగ్ అవుతోంది. ఒకవేళ.. వెబ్ సైట్ మరింత ఎఫెక్టివ్ గా పని చేసి ఉంటే.. చలానాలు మరిన్ని క్లియర్ అయ్యేవని చెబుతున్నారు. మంగళవారం విడుదలైన జీవో ప్రకారం టూవీలర్లు.. త్రీ వీలర్ల మీద పెండింగ్ చలానాలకు 80 శాతం.. ఫోర్ వీలర్స్.. ఇతర హెవీ వెహికిల్స్ మీద పెండింగ్ లో ఉన్న చలానాలకు 60 శాతం.. ఆర్టీసీ బస్సులు.. ఇతర ప్రభుత్వ వాహనాల మీద ఉన్న పెండింగ్ చలానాలకు 90 శాతం డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

రెండు రోజుల వ్యవధిలో క్లియర్ అయిన చలానాల్లో అత్యధికంగాహైదరాబాద్ మహానగరానిదే కావటం గమనార్హం. మహానగరంలో పోలిస్తే.. జిల్లాల్లో పెండింగ్ చలానా క్లియరెన్సు మేళాకు అంత ఆదరణ లేంటున్నారు. గతంలో నిర్వహించిన ఈ మేళా పూర్తి అయ్యే నాటికి అప్పటి ప్రభుత్వానికి రూ.300 కోట్ల ఆదాయం రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మీ వాహనం మీద ఎన్ని చలానాలు పెండింగ్ ఉన్నాయి? చెల్లించాల్సిన మొత్తం ఎంత? డిస్కౌంట్ అనంతరం ఎంత? లాంటి వివరాలు తెలుసుకోవాలంటే.. సింఫుల్ గా https://echallan.tspolice.gov.in/publicview/ ఈ లింకు క్లిక్ చేస్తే ఆ వివరాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం.. చెక్ చేసుకోండి.