Begin typing your search above and press return to search.

స్వేద పత్రం.. 420 హామీలు.. హనీమూన్ టైం కూడా ఇవ్వరా?

ఎప్పుడైనా సరే.. కొత్త ప్రభుత్వం ఏర్పడిప్పుడు మీడియా, ప్రతిపక్ష పార్టీలు దానికి కుదురుకోవడానికి ఆరు నెలలు సమయం ఇస్తాయి

By:  Tupaki Desk   |   5 Jan 2024 5:30 PM GMT
స్వేద పత్రం.. 420 హామీలు.. హనీమూన్ టైం కూడా ఇవ్వరా?
X

ఎప్పుడైనా సరే.. కొత్త ప్రభుత్వం ఏర్పడిప్పుడు మీడియా, ప్రతిపక్ష పార్టీలు దానికి కుదురుకోవడానికి ఆరు నెలలు సమయం ఇస్తాయి. వారు ఇచ్చిన హామీలను జాగ్రత్తగా పరిశీలిస్తూ సర్కారు విధానాలను గమనిస్తూ ఆ తర్వాతనే విమర్శలకు దిగుతాయి. ఈ ఆరు నెలల కాలాన్ని కొత్త ప్రభుత్వాలకు హనీమూన్ పిరియడ్ గా పేర్కొంటుంటారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు కాదు కదా..? కనీసం విమర్శలు కూడా చేయవు. అయితే, తెలంగాణలో మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

సరిగ్గా నెల కూడా కాకుండానే..

రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఈ నెల 7వ తేదీకి నెల అవుతుంది. అయితే, ఆరు నెలల హనీమూన్ పిరియడ్ కాదు కదా..? నెల కూడా కాకమునుపే ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యాచరణ మొదలుపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారులోని విధానాల కారణంగా వాటిల్లిన నష్టాన్ని వివరిస్తూ శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తుండగా.. బీఆర్ఎస్ దానికి సమాధానంగా స్వేదపత్రాలు అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. స్వయంగా మాజీ మంత్రి కేటీఆర్ దీనికి సారథ్యం వహించారు. ఇది అధికార విపక్ష నేతల మధ్య మాటల తూటాలకు దారితీసింది.

పెద్దగా ఒరిగిందేం లేదు..?

రేవంత్ సర్కార్‌ ను ఇరుకున పెట్టే ప్రయత్నంలో ప్రగతి నివేదిక, స్వేద పత్రం విడుదల చేసింది బీఆర్ఎస్. వీటితో పెద్దగా ఫాయిదా రాలేదు. ఇంతలోనే బుధవారం 420 పేరుతో బుక్ లెట్ బయటకు తెచ్చింది. దీనిపైనా పెద్దగా సానుకూలత రాలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సర్కారుపై కౌంటర్ల కోసం కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఎందుకనో లక్ష్యాన్ని చేరడం లేదు. ఈలోగా కాంగ్రెస్ 420 వ్యాఖ్యలపై చట్టపరంగా వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో ప్రభుత్వాన్ని విమర్శించబోయి వారికే ఆయుధం అందిస్తున్నారన్న విమర్శను కేటీఆర్ ఎదుర్కొనాల్సి వస్తోంది.

నిలదొక్కుకోనివ్వండి..

ప్రభుత్వం ఏర్పడి నెల కూడా కాలేదు. వాస్తవానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు భారీగానే ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా అమలు చేస్తేనే ప్రభుత్వానికి మైలేజీ వస్తుంది. ఇందుకు సమయం ఇవ్వడం ఉత్తమం. కానీ, నిలదొక్కుకునే సమయం కూడా ఇవ్వకుండా బీఆర్ఎస్ బ్యాటింగ్ మొదలుపెట్టేసరికి అసలుకే మోసం వస్తోంది. ఇది సోషల్ మీడియా కాలం. ఏమాత్రం విధానాల్లో తేడా కనిపించినా.. నెటిజన్లు చెడుగుడు ఆడేస్తుంటారు. ఇప్పుడు ఇదే అదనుగా పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తున్నారు. రెండుసార్లు వరుసగా అధికారంలోకి ఉండి.. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల్లోకి నెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాల సంగతేమిటని నిలదీస్తున్నారు.

లోక్ సభ ఎన్నికలున్నాయి కదా..?

అసెంబ్లీలో ఓడినా.. లోక్ సభ ఎన్నికలు ఉన్నందున బీఆర్ఎస్ కాస్త సంయమనంతో వెళ్తే బాగుంటుందనే సూచన వ్యక్తమవుతోంది. అందులోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని.. బీఆర్ఎస్ కు కష్టకాలమే అనే అభిప్రాయం వస్తోంది. కాబట్టి.. కారు పార్టీని ఆచితూచి నడపాల్సిన బాధ్యత మరీ ముఖ్యంగా కేటీఆర్ పైనే ఉంది. ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన కేటీఆర్.. ముందే గత ప్రభుత్వ వైఫల్యాలను తెరమీదకు తెచ్చేలా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అంతేగాక.. పార్టీ అధినేత కేసీఆర్ శస్త్రచికిత్స కారణంగా ప్రస్తుతం బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కేటీఆర్ సంయమనంతో ముందుకెళ్తే లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఆశించవచ్చని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.