ఫిబ్రవరిలో పెద్దపనే పెట్టుకున్న రేవంత్... ఆ రెండూ కన్ ఫాం!
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆరు గ్యారెంటీలు కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 28 Jan 2024 9:13 AM GMTఅసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆరు గ్యారెంటీలు కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు ఆరు గ్యారెంటీలనూ అమలుచేస్తామని చెప్పారు! ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో ఫిబ్రవరిలో రెండు కీలకమైన హామీలను నెరవేర్చాలని భావిస్తుంది. ఈ సమయంలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే ఈ కార్యక్రమం పూర్తిచేయాలని రేవంత్ ప్లాన్ చేశారని అంటున్నారు.
అవును... అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలనూ అమలుచేస్తామని ప్రకటించినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలైపోయింది. ఇదే సమయంలో మరో రెండు హామీలను ఫిబ్రవరి మొదటి వారంలోనే అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యిందని తెలుస్తుంది. ఈ మేరకు ఈ హామీల అమలుపై సీఎంవో నుంచి హింట్ వచ్చిందని చెబుతున్నారు.
ఇందులో భాగంగానే ఈ రెండు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల్లో అర్హుల ఎంపిక కోసం అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఫిబ్రవరి మొదటివారంలో 200 యూనిట్లు ఉపయోగించే వినియోగదారులకు ఉచిత విద్యుత్ సౌకర్యం, ఇక.. రు.500కే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను ప్రారంభించాలని రేవంత్ డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. దీంతో... అటు సివిల్ సప్లై అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారని సమాచారం.
ఈ మేరకు ఇప్పటికే రెండు విభాలకు చెందిన ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై చర్చించారని తెలుస్తుంది. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులుండగా... పై రెండు ఉచిత పథకాల అమలుకు ఈ 90 లక్షల రేషన్ కార్డులనే ప్రమాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే సమయంలో వైట్ రేషన్ కార్డులు ఉన్న వారంతా పేదలేనా.. లేదా.. అనే విషయంపై కూడా కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది.
కాగా... అధికారంలోకి వచ్చిన అనంతరం చెప్పినట్లుగానే ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది. అంటే రెండు హామీలను ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో అమలుచేసేలా మరో రెండు హామీల అమలుకు కసర్తతులు చేస్తోంది.