విమోచనం-విలీనం-సమైక్యత.. ఇవేవీకాదు.. తెలంగాణ స్వాతంత్య్ర దినం!?
భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానాన్ని కలిపేది లేదని స్వతంత్రంగా ఉండటానికి నిజాం మొగ్గుచూపాడు.
By: Tupaki Desk | 17 Sep 2023 5:36 AM GMTప్రతి ఏటా సెప్టెంబరు 17వ తేదీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. అయితే.. దీనిని దేశంలోని ఇతర రాష్ట్రా ల వారు.. ఇతర ప్రాంతాల ప్రజలు ఒక సాధారణ రోజుగానే పరిగణిస్తారు. వారిపనులు వారు చేసుకుంటా రు. కానీ, తెలంగాణ విషయానికి వచ్చే సరికి మాత్రం సెప్టెంబరు 17వ తేదీ అనగానే రాజకీయ రణగొణ ధ్వనులు తీవ్రస్థాయిలో వినిపిస్తుంటాయి. ఈ రోజును తెలంగాణ విమోచన దినమని ఒక పార్టీ, కాదు.. విలీన దినమని ఇంకోపార్టీ.. ఇవన్నీకాదు.. సమైక్యతా దినమని మరో పార్టీ ఇలా.. వేటికవే.. ప్రకటించి ఎవరి దారిలో వారు పండగ చేసుకుంటారు.
అయితే, వాస్తవానికి తెలంగాణ హిస్టరీని పరిశీలిస్తే.. విమోచనం-విలీనం-సమైక్యత అనేకన్నా.. సెప్టెంబరు 17వ తేదీని తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవమని అంటేనే బెటర్ అంటున్నారు పరిశీలకులు. దీనికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు.
ఏడు దశాబ్దాల కిందట అప్పట్లో హైదరాబాద్ ఒక దేశం. నిజాం పాలనలో ఉండేది. ఇలాగే 562పైగా సంస్థానాలు బ్రిటీష్ పాలనలో ఉండేవి. 1947, ఆగస్టు 15 స్వాతంత్య్రం అనంతరం ఇవన్నీ భారత్‌లో కలిసిపోయాయి. హైదరాబాద్ సంస్థానంలో మాత్రం భిన్నమైన పరిస్థితి కొనసాగింది. స్వాతంత్య్రం వస్తే ఇక్కడి వారు జెండా ఎగురవేయలేని ఆంక్షలు ఉన్నాయి. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానాన్ని కలిపేది లేదని స్వతంత్రంగా ఉండటానికి నిజాం మొగ్గుచూపాడు.
బ్రిటీష్ వాళ్లు స్వాతంత్య్రం ప్రకటించే సమయానికి ఆంగ్లేయుల పాలనలో ఉన్న ప్రాంతాలు కొన్ని కాగా.. మిగతావి సంస్థానాలుగా ఉండేవి. మత ప్రాతిపదికన రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ విడిపోవడంతో వెళుతూ వెళుతూ సంస్థానాలకు బ్రిటీష్ పాలకులు మూడు ప్రతిపాదనలు సూచించారు. మొదటిది భారత్‌లో విలీనం, రెండోది పాకిస్థాన్‌లో కలవడం, మూడోది స్వతంత్రంగా ఉండటం.
హైదరాబాద్‌తోపాటు దేశంలో 562 సంస్థానాలు ఉన్నాయి. వీటిలో కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్, ట్రావెన్‌కోర్ పెద్దవి. హైదరాబాద్ స్వతంత్రంగా ఉండేందుకు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొగ్గుచూపడంతో ఆ మేరకు భారత ప్రభుత్వంతో 1947 నవంబరు 24న స్టాండ్‌స్టిల్ ఒప్పందం చేసుకుంది.
అయితే, దేశంలోని అన్ని ప్రాంతాలు స్వపరిపాలనలో జీవిస్తుంటే.. నిజాం పాలనలో అడుగడుగునా ఆంక్షల మధ్య జీవించేవారు. భారత కరెన్సీపై నిజాం నిషేధం విధించారు. దీంతో ఇక్కడ చెల్లుబాటు అయ్యేది కాదు. రజాకార్ల ఆగడాలు శ్రుతిమించాయి. దీంతో నిజాం రాజరిక పాలన నుంచి విముక్తి కావాలని, భారత్‌లో విలీనం చేయాలనే ఆకాంక్ష మరింత పెరిగింది. 1947 సెప్టెంబరు నుంచే కమ్యూనిస్టుల నేతృత్వంలో సాయుధ రైతాంగ పోరాటం తీవ్రమైంది.
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా భారత్‌లో విలీనం చేయాలని పోరాటం మొదలెట్టింది. ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ, నారాయణరావు పవార్, జంగయ్య, రఘువీర్ తదితరులు మహారాష్ట్ర వెళ్లి బాంబులను విసిరేందుకు శిక్షణ తీసుకున్నారు. హైదరాబాద్ వచ్చాక అదను చూసి నిజాం కారులో వెళ్తుండగా బాంబులు విసరగా, ఆయన తప్పించుకున్నాడు. బాంబుదాడి చేసినవారిని జైల్లో వేశారు. కలం వీరులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు.
నిరంకుశ పాలనపై వేర్వేరు రూపాల్లో పోరాటం తీవ్రమైంది. దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం..ఇతరత్రా ఉద్యమాలతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రజల ఆకాంక్షల మేరకు కొద్దిరోజుల అనంతరం భారత్‌లో నిజాం రాజ్యం విలీనమైంది.
పటేల్ చేసింది ఇదీ..నిజాం రాజు లొంగకపోవడంతో భారత్ హోంశాఖమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ 1948 సెప్టెంబరు 12న పోలీసు చర్య నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 13న ఆపరేషన్ పోలో మొదలైంది. సైన్యానికి జనం మద్దతు పెరిగింది. అన్నివైపుల నుంచి సైన్యం హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. నాలుగురోజులు గడిచేసరికి నిజాం ఆత్మరక్షణలో పడిపోయాడు. సెప్టెంబరు 17న భారత ప్రభుత్వంతో పోరాటాన్ని విరమిస్తున్నట్లు తన సేనలకు నిజాం ఉత్తర్వులు ఇచ్చినట్లు తొలి వర్తమానం భారత ప్రభుత్వానికి అందింది.
నిజాం సైన్యం సేనాని జనరల్ ఎల్ ఎడ్రూస్ భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు సైనిక చర్యకు నేతృత్వం వహించిన మేజర్ జనరల్ చౌదరీకి పత్రాన్ని అందించారు. భారత ప్రభుత్వ ప్రతినిధి జనరల్ కె.ఎం.మున్షీ సమక్షంలో ఇది జరిగింది. అనంతరం నిజాం ప్రధాన మంత్రి లాయిక్ అలీ రాజీనామా చేశాడు. రజాకార్ల నాయకుడు ఖాసీం రిజ్వీ పలాయనం చిత్తగించాడు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి త్రివర్ణ పతాకాల్ని ఎగురవేశారు. సో... దీనిని బట్టి తెలంగాణకు సెప్టెంబరు 17న స్వాతంత్య్ర దినోత్సవమని అంటారు చరిత్రకారులు.