ఆయనకే కొత్త ఐటీ మంత్రిగా ఛాన్స్? తాజా రికార్డు ఏమంటే?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై పెద్ద సందేహాల్లేవు. గతానికి భిన్నంగా మారిన కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందన్న విషయాన్ని చేతల్లో చూపించారు.
By: Tupaki Desk | 4 Dec 2023 4:35 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై పెద్ద సందేహాల్లేవు. గతానికి భిన్నంగా మారిన కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందన్న విషయాన్ని చేతల్లో చూపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీట్లు ఇచ్చారన్న గంటల వ్యవధిలోనే.. తర్వాతి రోజునే ప్రమాణ స్వీకారంతో పాటు.. ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న విషయాన్ని ఫీలర్ల రూపంలో వదిలేసి.. అనవసరమైన కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టేశారు. ముఖ్యమంత్రుల ఆశావాహుల ఆశల గుర్రాలకు కళ్లాలు వేసేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొత్త ప్రభుత్వంలో తెలంగాణ ఐటీ మంత్రిగా అవకాశం ఎవరికి ఉంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మిగిలిన మంత్రి పదవులకు లేని ఛరిష్మా ఐటీ శాఖకు ఉంది. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఐటీ శాఖను కొత్త పుంతలు తొక్కించిన విషయంలో కేటీఆర్ కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో ఐటీ దూకుడుకు కేటీఆర్ కూడా ఒక కారణంగా చెప్పాలి. దీనికితోడు.. ఆయన ముఖ్యమంత్రి కొడుకు కావటంతో.. ఏ నిర్ణయాన్ని అయినా ఇట్టే తీసుకునే వీలుండేది.
అంతేకాదు.. వివిధ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ.. సింగిల్ విండో విధానంలో శాఖను నడిపించటం తెలిసిందే. మరి.. కేటీఆర్ మాదిరి ఐటీ శాఖను నిర్వహించటం రేవంత్ ప్రభుత్వంలో కష్టమేనన్న మాట వినిపిస్తోంది. అయితే.. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుందన్నట్లుగా.. కేటీఆర్ మాదిరి కాకున్నా.. అంతే సామర్థ్యం ఉన్న నేత కాంగ్రెస్ లో ఉన్నారని చెబుతారు. ఇంకా చెప్పాలంటే.. ఎలాంటి మరక లేని సుదీర్ఘ రాజకీయ జీవితంతో పాటు చదువుకున్న వాడు కావటం.. సౌమ్యుడు.. అందరిని కలుపుకుపోయే తత్త్వం.. వివాదాలకు దూరంగా ఉండటం.. నేటికి పాత తరం రాజకీయాల్ని ఫాలో అయ్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ మంత్రిగా అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఐటీ శాఖ నుంచే అత్యధిక ఆదాయం వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాంచి దూకుడు మీద ఉన్న ఈ శాఖను మరో మెట్టుపైకి తీసుకెళ్లాలంటే ఆయనే సరైన నేతగా చెబుతున్నారు. మరి.. రేవంత్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే.. తాజా ఎన్నికల్లో ఆయనో రికార్డును క్రియేట్ చేశారు. ఆయన గెలిచిన మంథని నియోజకవర్గానికో ప్రత్యేకత ఉంది.
దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఇదే నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో శ్రీధర్ బాబు ఆ రికార్డును అధిగమించారు. మంథని నుంచి 1957, 1962, 1967, 1972 వరుస ఎన్నికల్లో నాలుగుసార్లు పీవీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాకుంటే.. శ్రీధర్ బాబు మాత్రం మధ్యలో బ్రేకులు పడినా.. తాజా ఎన్నికల్లో ఐదోసారి విజయం సాధించారు.
ఆయన మంథని నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009, 2018లలో విజయం సాధించారు. తాజా (2023) ఎన్నికల్లో ఐదోసారి ఎన్నికల్లో విజయం సాధించటం ద్వారా పీవీ రికార్డును బద్ధలు కొట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబు ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. మరి.. శ్రీధర్ బాబును తెలంగాణ ఐటీ మంత్రిగా చూస్తామా? లేమా? అన్నది త్వరలోనే తెలిసిపోనుంది.