అక్కడ స్పష్టత ఉంది... తెలంగాణలోనే గజిబిజి!
మిజోరాంలో ప్రస్తుత అధికార పార్టీ, లోకల్ పార్టీ ఎంఎన్‌పీ(మిజో నేషనల్ పార్టీ) అధినేత జోరాం థంగా తిరిగి అధికారంలోకి వస్తారనే క్లారిటీ వచ్చేసింది.
By: Tupaki Desk | 29 Nov 2023 4:44 AM GMTదేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. మరో రాష్ట్రం తెలంగాణలోనే ఈ నెల 30 పోలింగ్ జరగనుంది. అయితే.. ఆ నాలుగు రాష్ట్రాలకు.. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఒక స్పష్టత ఉంది. ఎవరు అధికారంలోకి వస్తారు? అనేది దాదాపు క్లారిటీ ఉంది. కానీ, తెలంగాణలో మాత్రమే గజిబిజిగా ఉంది. మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఎన్నికలు ముగిశాయి. డిసెంబరు 3న ఎన్నికల ఫలితం రానుంది.
అయితే.. ఆయా రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంలో కొంత వరకు క్లారిటీ వచ్చింది. మిజోరాంలో ప్రస్తుత అధికార పార్టీ, లోకల్ పార్టీ ఎంఎన్‌పీ(మిజో నేషనల్ పార్టీ) అధినేత జోరాం థంగా తిరిగి అధికారంలోకి వస్తారనే క్లారిటీ వచ్చేసింది. దీంతో అక్కడ గడబిడ లేకుండా పోయింది. ఇక, మధ్యప్రదేశ్లోనూ ఒక క్లారిటీ ఉంది. ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి ప్రతిపక్షంగా మారుతుందనే లెక్కలు వచ్చాయి. అదేసమయంలో రాజస్థాన్‌లో అధికారపార్టీ కాంగ్రెస్ కు ఈ సారి ఛాన్స్ లేదనే లెక్కలు వచ్చాయి.
మరో రాష్ట్రం ఛత్తీస్‌గఢ్లో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ ఒక క్లారిటీ అయితే.. వచ్చింది. కానీ, ఎటొచ్చీ.. తెలంగాణలో మాత్రం 40 రోజులుగా ప్రచారం జరుగుతున్నా.. అనేక సర్వేలు వచ్చినా.. ఎక్కడా ప్రజానాడిని పట్టుకోలేక పోయారు. ఎవరికీ అనుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ.. ప్రజలు కనిపించలేదు. దీంతో ఎన్నికల వేడి మరింత రాజుకుంది.
ఆది నుంచి చివరి వరకు కూడా అనేక మంది నాయకులు ప్రచారం సాగించినా.. ఎవరూ కూడా నిబ్బరంగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి కారణం.. తెలంగాణ సమాజం నాడిని పట్టుకోలేక పోవడమే. గురువారం జరగనున్న పోలింగ్‌లో ప్రజలుఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.