Begin typing your search above and press return to search.

ఎవర్ గ్రీన్ సాంగ్ ను ఎందుకు గెలికినట్లు ?

జయజయహే తెలంగాణ పాట అనేది తెలంగాణ ప్రజలందరికి పరిచయం అయిన పాట. ఇప్పుడు అనవసరంగా ఆ ఎవర్ గ్రీన్ సాంగ్ లో వేలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ?

By:  Tupaki Desk   |   1 Jun 2024 7:26 AM GMT
ఎవర్ గ్రీన్ సాంగ్ ను ఎందుకు గెలికినట్లు ?
X

'జయజయహే తెలంగాణ జననీ జయకేతనం .. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం' తెలంగాణ ప్రజలకు ఈ పాట ఈ మధ్య కాలంలో పరిచయం అయింది కాదు. ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన ఈ పాట మొట్టమొదటిసారిగా 2004లో తెలంగాణ రచయితల వేదిక వెలువరించిన సాహిత్య సంచిక 'సోయి' (సంపుటి-1, సంచిక-2)లో అచ్చయింది. ఆ పాటలో భౌగోళిక, చారిత్రక చిహ్నాల ప్రస్తావన, తెలంగాణ సాహితీమూర్తుల అస్తిత్వ అంశాల ప్రస్తావన లేవనే ఒక వాదన వినిపించింది. అప్పట్లో ఉద్యమకారుల్లో దీనిపై చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలో పాటలో కవి ఆమోదంతో, కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. ఇలా మార్చిన పాటను బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) 2004 ఎన్నికల సమయంలో క్యాసెట్‌గా మలిచి, విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చి, ప్రజల్లోకి తీసుకుపోయింది. తర్వాత మరిన్ని అంశాలను చేరుస్తూ అందెశ్రీ ఈ పాటను 12 చరణాలకు పెంచారు. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఈ పాటను అధికారిక గీతంగా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ అది జరగలేదు.

తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే తెలంగాణ అంటే టీఎస్ బదులు టీజీ అని ప్రకటించింది. రాష్ట్ర చిహ్నం మారుస్తామని చెబుతూ అందెశ్రీ రాసిన 'జయజయహే తెలంగాణ' గీతాన్ని అధికారిక గీతంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అందెశ్రీని కలిసి ఈ గీతం రూపకల్పన మీద ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణితో భేటీ అయ్యారు.

ఈ గీతానికి కీరవాణి సంగీత దర్శకుడు అని వార్తలు వచ్చిన వెంటనే దుమారం మొదలయింది. కీరవాణి గొప్ప సంగీత దర్శకుడు అనడంలో సందేహం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆయనతో రూపకల్పన చేయించడం ఎందుకు ? ఇక్కడ దర్శకులు లేరా ? అన్ని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కీరవాణి ఎంపిక గురించి తనకు సంబంధం లేదని, అది పాట రచయిత అందెశ్రీకి సంబంధించిన వ్యవహారం అని రేవంత్ రెడ్డి స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అందెశ్రీ వ్యక్తిగత పాట అయితే ఏ సంగీత దర్శకుడిని పెట్టుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. అది రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్న నేపథ్యంలోనే కీరవాణి స్వరాలు సమకూర్చడాన్ని తప్పుపడుతున్నాం. అది తెలంగాణ ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అన్న వాదన వచ్చింది. ఇక రాష్ట్ర చిహ్నం నుండి చార్మినార్, వరంగల్ కళాతోరణం తొలగించడం మీద తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. అయితే చార్మినార్ ఒక్కటే తొలగిస్తే విమర్శలు వస్తాయని, కాకతీయ కళాతోరణాన్ని తొలగించారన్న వాదన వినిపిస్తుంది.

అయితే రాష్ట్ర చిహ్నం మార్చాలంటే కేంద్రం అనుమతి కావాలి. కాబట్టి అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు అని రాష్ట్ర చిహ్నం అంశాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం రాష్ట్ర గీతం విడుదలకు పరిమితం అయింది. జయజయహే తెలంగాణ పాట అనేది తెలంగాణ ప్రజలందరికి పరిచయం అయిన పాట. ఇప్పుడు అనవసరంగా ఆ ఎవర్ గ్రీన్ సాంగ్ లో వేలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. భేషజాలకు పోయి ప్రభుత్వం అభాసుపాలు అవుతుందని అంటున్నారు.