జగన్‌ను ఫాలో అవుతున్న తెలంగాణ నేతలు!
ఇక, కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను చూస్తే.. వలంటీర్ వ్యవస్థను తీసుకువస్తారని స్పష్టంగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 18 Nov 2023 9:54 AM GMTకొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యంగా ఉన్నా.. నిజమే! నమ్మశక్యం కాలేక పోయినా.. వాస్తవమే! ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో రెండు కీలక పార్టీలు ఇచ్చిన హామీల్లో కొన్ని.. ఏపీలో పాలన సాగిస్తున్న వైసీపీ అధినేత జగన్ తీసుకువచ్చినవే కావడం.. అక్కడ విమర్శలు ఎదుర్కొంటుండడం .. వాటినే తెలంగాణలో అమలు చేసేందుకు పార్టీలు ముందుకు రావడం చర్చనీయాంశం అయ్యాయి.
బీఆర్ ఎస్ ఎన్నికల మినీ మేనిఫెస్టోను తీసుకుంటే.. సామాజిక పింఛనును రూ.5000 చేస్తామని సీఎం కేసీ ఆర్ ప్రకటించారు. అయితే.. ఇక్కడ షరతు ఏంటంటే.. ఒకే సారి కాకుండా.. విడతల వారీగా.. ఏడాది రూ.500 చొప్పున పెంచుతూ.. 5 వేలు చేస్తామన్నారు. ఇది.. ఇప్పటికే ఏపీలో జగన్ అమలు చేస్తున్నారు. ఆయన మూడు వేలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఎన్నికలకు నాలుగు మాసాల గడవు వున్నా.. ఇప్పటికీ రూ.2750 మాత్రమే ఇస్తున్నారు. దీనిపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.
ఇక, కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను చూస్తే.. వలంటీర్ వ్యవస్థను తీసుకువస్తారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు.. ప్రజలకు నేరుగా పథకాలు ఇంటికే అందేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది. ఇది కూడా ఏపీలో అమలు జరుగుతున్నదే కావడం గమనార్హం. అయితే.. వలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి.
ఇక, జిల్లాల విభజన పేరుతో కాంగ్రెస్ మరో హామీ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. అయినా కూడా.. మరోసారి జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణను పరిశీలించి నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పీవీ నర్సింహారావు పేరును, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్ పేరును పెట్టనున్నట్లు మేనిఫెస్టోలో వెల్లడించింది. మరి ఈ జగన్ ఫాలోయింగ్ రాజకీయాలు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.