Begin typing your search above and press return to search.

17 స్థానాలు .. 1855 టేబుళ్లు

రాష్ట్రంలో మొత్తం 34 చోట్ల లెక్కింపు జరుగుతుంది. 4వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 5:05 AM GMT
17 స్థానాలు .. 1855 టేబుళ్లు
X

తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్‌ జరిగింది. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1,855 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లలో, అత్యల్పంగా మూడుచోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానున్నది.

రాష్ట్రంలో మొత్తం 34 చోట్ల లెక్కింపు జరుగుతుంది. 4వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సుమారు 2.18 లక్షల వరకు పోస్టల్‌ బ్యాలెట్లు ఓట్లు ఉన్నాయి. వీటి లెక్కింపు కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాల్‌ చొప్పున కేటాయించారు. చేవెళ్ల, మల్కాజిగిరి లోక్ సభ స్థానాలలో రెండేసి హాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌పై 500 పోస్టల్‌ బ్యాలెట్లు మించకుండా ఉండేలా ప్రణాళికను సిద్ధంచేశారు.

చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పుర స్థానాల్లో 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. సిర్పూర్, ఆసిఫాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్, ముథోల్, మానకొండూరు, ఆందోలు, జహీరాబాద్, గజ్వేల్, కార్వాన్, నకిరేకల్, శేరిలింగంపల్లి, ఆలేరు సెగ్మెంట్లలో 23 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటల్లో 13 రౌండ్లు మాత్రమే ఉంటాయి. ప్రతి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయిన తరవాత మూడు దశల్లో పరిశీలన ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఓట్ల లెక్కింపు పరిశీలకుడి ఆమోదం తరవాత ఆ రౌండ్‌లో ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది ప్రకటిస్తారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక ఆ నియోజకవర్గంలోని వీవీప్యాట్ల నుంచి ర్యాండమ్‌గా ఐదింటిని ఎంపిక చేసి అందులోని ఓట్లను లెక్కించి ఆ పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన టేబుళ్లలోని ఓట్ల లెక్కలతో సరిచూస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని గుర్తించిన మీదటే ఓట్ల లెక్కింపును అనుసరించి పరిశీలకుడు ఫలితాన్ని ప్రకటిస్తారు.