మాజీ మంత్రి మీద కేసు ?
అధికారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు మారేటప్పటికి మాజీ మంత్రుల్లో గుబులు పెరిగిపోతోంది
By: Tupaki Desk | 18 Jan 2024 3:30 PM GMTఅధికారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు మారేటప్పటికి మాజీ మంత్రుల్లో గుబులు పెరిగిపోతోంది. పదేళ్ళ కేసీయార్ పాలనలో అవినీతి, అరాచకాలు ఆకాశమంతగా పెరిగిపోయిందనే ఆరోపణలకు కొదవలేదు. కేసీయార్, ఆయన కుటుంబసభ్యులతో పాటు చాలామంది మంత్రులపైన కూడా అనేక అవినీతి ఆరోపణలున్నాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలోను ఇష్టారాజ్యంగా చెలాయించారని కాంగ్రెస్ నేతలు చాలాసార్లు ఆరోపించారు. అలాంటిది ఇపుడు ప్రభుత్వం మారేటప్పటికి అప్పట్లో బాగోతాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఇపుడు విషయం ఏమిటంటే పశుసంవర్ధక శాఖలో అవినీతిపై ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. గొర్రెల కొనుగోలు, పంపిణీ పేరుతో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బాగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఆరోపణలపై శాఖ పరమైన విచారణ చేయించిన ప్రభుత్వం ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లపై కేసులు నమోదుచేసి సస్పెండ్ చేసింది. అలాగే అప్పటి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్ కుమార్ ప్రమేయంపై విచారణ మొదలుపెట్టింది.
శాఖలో జరిగిన అవినీతిపై ప్రాథమిక సాక్ష్యాలు దొరికిన కారణంగా కేసును ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం మారిపోగానే పశుసంవర్ధకశాఖ భవన్లోని కీలక ఫైళ్ళు మాయమైపోయాయి. అలాగే మంత్రి పేషీలోని మరికొన్ని కీలకమైన ఫైళ్ళు తగలబడిపోయాయి. అంటే జరిగిన అవినీతికి, పైళ్ళు మాయమవ్వటం, తగలబడటానికి ఏదో బలమైన సంబంధముందని పోలీసులు, ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవహారాలు చూస్తుంటే అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం అవినీతి వ్యవహారమంతా తలసాని మెడకు చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. శాఖలోని కొందరు ఉన్నతాధికారులే లబ్ధిదారుల పేరుతో ఖాతాలు ఓపెన్ చేసి డబ్బులు నొక్కేసినట్లు ఆరోపణలున్నాయి.
ఒక్క తలసానినే కాదు మరో మాజీ మంత్రి మల్లారెడ్డి మీద ఇప్పటికే భూ కబ్జా కేసు నమోదైంది. గిరిజనులకు చెందిన 43 ఎకరాలను మల్లారెడ్డి కబ్జా చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దాంతో ఫిర్యాదును విచారించిన పోలీసులు మల్లారెడ్డితో పాటు మరో ఏడుగురి మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కో మాజీ మంత్రి మీద వినిపిస్తున్న ఆరోపణలు, శాఖాపరమైన విచారణలో బయటపడుతున్న వ్యవహారాలపై కేసులు నమోదు చేసే యోచనలో ప్రభుత్వముంది. కాబట్టి ఎంతమంది మాజీ మంత్రుల మీద కేసులు పడతాయో చూడాలి.