కేటీఆర్ రాకపై క్లారిటీ.. మొదటి ప్రోగ్రాం మాకంటే మాకే!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన రోటీన్ కు భిన్నంగా సాగింది.
By: Tupaki Desk | 1 Sep 2023 6:26 AM GMTతెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన రోటీన్ కు భిన్నంగా సాగింది. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరిపిన విదేశీ పర్యటనలను చూస్తే.. ఏదీ కూడా ఇంత సుదీర్ఘంగా సాగలేదు. అధికారిక పర్యటన కానప్పటికీ.. అనధికారికంగా ఇంతేసి కాలం ఎప్పుడూ ఉన్నది లేదు. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థుల జాబితాను విడుదల చేసే సమయానికి మంత్రి కేటీఆర్ విదేశాల్లో ఉండటం.. టికెట్లు రాని వారిని ఊరడిస్తూ ట్వీట్ చేయటం తెలిసిందే.
అప్పటి నుంచి ఇప్పటివరకు విదేశాల్లోనే ఉన్న ఆయన.. ఎప్పుడు తిరిగి వస్తారన్న దానిపై స్పష్టత లేకుండాపోయింది. శనివారం ఉదయానికి ఆయన హైదరాబాద్ నగరానికి చేరుకుంటారన్న పక్కా సమాచారం పార్టీ నేతలకు అందింది. దీంతో.. ఆయన రాక కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్న నేతలు కొందరు అయితే.. మరికొందరు ఆయన వచ్చీ రాగానే.. అధికారిక కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాల్లో బిజీ చేసేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
సెప్టెంబరు 2న డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్థిదారుల చేతికి తాళాలు అందించనున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. తమ వద్ద నిర్వహించే కార్యక్రమానికి రావాలంటూ కేటీఆర్ మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కొందరు ఎమ్మెల్యేలకు వారు నిర్వహించే ప్రోగ్రాంకు వస్తానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో.. వారు విపరీతమైన ఆనందానికి గురవుతున్నారు.
మరోవైపు.. టికెట్లు లభించని నేతలు మంత్రి కేటీఆర్ ను కలుసుకొని తమ గోడును వెల్లబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గులాబీ బాస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమై.. ఆందోళనల్ని కొందరు నిర్వహిస్తుంటే.. మరికొందరు తెర వెనుక ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపైన తమకున్న సమాచారాన్ని అందజేస్తూ.. మార్పు దిశగా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తక్కువలో తక్కువ.. పదిహేను నుంచి పాతిక మంది అభ్యర్థులు మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అందులో తమ పేరు ఉండేలా చేసుకోవటం కోసం మంత్రి కేటీఆర్ కటాక్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్ననేతలు పెద్ద ఎత్తున ఉన్నారు. తాజాగా కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న ప్రయాణ వివరాలపై క్లారిటీ వచ్చేయటంతో.. .ఆయన్ను త్వరగా కలిసి తమ వాదనను వినిపించే ఆత్రుతలో ఉన్నట్లుగా చెబుతున్నారు. వచ్చీ రాగానే.. వరుస కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ యమా బిజీగా ఉంటారని మాత్రం చెప్పక తప్పదు.