ఢిల్లీకి.. ప్రగతిభవన్ కు తేడా ఏముంది కేటీఆర్ భయ్యా?
రోజుల్లోకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడులయ్యే సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ.. తమ ప్రత్యర్థి పార్టీలపై ఫైరింగ్ ను అంతకంతకూ పెంచుతున్నారు రాజకీయ నేతలు.
By: Tupaki Desk | 1 Oct 2023 3:13 PM GMTరోజుల్లోకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడులయ్యే సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ.. తమ ప్రత్యర్థి పార్టీలపై ఫైరింగ్ ను అంతకంతకూ పెంచుతున్నారు రాజకీయ నేతలు. తెలంగాణ అధికార పార్టీ జాతీయ కార్యదర్శి కమ్ మంత్రి కేటీఆర్ అయితే.. ఒక చేత్తో కాంగ్రెస్ ను.. రెండో చేత్తో బీజేపీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మొండి చెయ్యి పార్టీని.. చెవిలో పువ్వు పెట్టే పార్టీని నమ్మొద్దంటూ ఆయన ప్రజల్ని కోరుతున్నారు. 150 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ గ్యారెంటీ ఎప్పుడో తీరిపోయిందని.. కాంగ్రెస్ గెలిస్తే ఐదేళ్లకు ఐదుగురు సీఎంలు అవుతారన్న ఆయన.. ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో కూడా ఢిల్లీ నుంచి కవర్ వస్తుందంటూ ఎప్పుడూ చెప్పే పాత పాటనే మళ్లీ పాడటం మొదలు పెట్టారు.
మంత్రి కేటీఆర్ మాటలే నిజమని అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరన్నది సీల్డ్ కవర్ లో ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తుంది. నిజమే.. మరి హైదరాబాద్ లో ఉన్న పార్టీలో.. ఎవరికి టికెట్లు ఇస్తారన్నది ప్రగతి భవన్ లో ఉండే కేసీఆర్ కు తప్పించి ఇంకెవరికైనా తెలుస్తుందా? ఆయన కూడా సీల్డ్ కవర్ మాదిరే సీక్రెట్ గా తీసుకొచ్చి... వివరాలు వెల్లడిస్తారు కదా? టికెట్ల ఎంపికకు సంబంధించి ఏమైనా కమిటీ కూర్చొని ఫైనల్ చేయటం లాంటివి ఏమీ ఉండవు కదా?
కాంగ్రెస్ అయితే ఢిల్లీ.. బీఆర్ఎస్ అయితే ప్రగతిభవన్ తప్పించి.. పెద్ద తేడా ఏముంది? ఇంకా చెప్పాలంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళలో..ముఖ్యమంత్రి తేడాగా చేస్తుంటే.. ఆ విషయాన్ని ఢిల్లీకి వెళ్లి చెప్పుకోవటానికి నలుగురైదుగురు ఉంటారు. అదే.. గులాబీ పార్టీలో అయితే ఎవరుంటారు? ఒకవేళ చెప్పుకోవాలని డిసైడ్ అయితే..ప్రగతి భవన్ కు వెళితే గేటు లోపలకు వెళ్లే అవకాశం కూడా ఉండదు కదా? మంత్రులకు.. సొంత పార్టీ నేతలకే ప్రగతి భవన్ ఎంట్రీ లేని వేళ.. మంత్రి కేటీఆర్ లాంటోళ్లు కాలం చెల్లిన ఢిల్లీ మాటను చెప్పటంలో అర్థం లేదనే చెప్పాలి.
ఏళ్లకు ఏళ్లు పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని ఏదో కారణం చెప్పి భర్తీ చేయకపోవటం చూస్తున్నదే. జెండాలు మోసిన కార్యకర్తలకు పార్టీ పెద్ద పీట వేసి పోస్టులు కట్టబెట్టింది లేదు. పెద్ద సారుకు మూడ్ వచ్చినా.. ఆయనకు ఆయన ఏదైనా ఫీల్ అయితే తప్పించి.. పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ లభించని పరిస్థితి. ఇలాంటప్పుడు ఢిల్లీకి.. ప్రగతిభవన్ కు పెద్ద తేడా ఏముందని కేటీఆర్ మాట్లాడుతున్నారు? అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతోంది. మరి.. ఈ వాదన గురించి మంత్రి కేటీఆర్ కు తెలిసే అవకాశం ఉందంటారా?