హాట్ టాపిక్: సీఎం రేవంత్ కంటే మంత్రులే పవర్ పుల్?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన లోటస్ పాండ్ భవనం ఎపిసోడ్ గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2024 11:30 AM GMTమూడు రోజుల క్రితం చోటు చేసుకున్న రెండు పరిణామాలు తెలంగాణలో కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. రేవంత్ పరిస్థితిని చూసి అయ్యో అనుకునే పరిస్థితి. ప్రభుత్వం ఏదైనా సరే.. ముఖ్యమంత్రి పవర్ ఫుల్ గా ఉండటం.. మంత్రులకు లిమిటెడ్ పవర్ మాత్రమే ఉండటం.. కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితి కూడా లేకపోవటం చూస్తున్నదే. అందుకు భిన్నంగా రేవంత్ సర్కారులో మాత్రం మంత్రులు ముఖ్యమంత్రి కంటే పవర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఇలాంటి మితిమీరిన పవర్ కు చెక్ చెప్పాల్సిన అవసరం రేవంత్ మీద ఉందంటున్నారు. లేదంటే.. పాలనలో రేవంత్ ఎదుర్కొంటున్న చికాకులకు మంత్రుల తీరు కొత్త పంచాయితీలకు తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన లోటస్ పాండ్ భవనం ఎపిసోడ్ గురించి తెలిసిందే. ఈ భవనానికి అదనంగా నిర్మించిన రెండు అనుమతి లేని గదుల్ని శనివారం మధ్యాహ్నం కూల్చివేసిన వైనం పెను సంచలనంగా మారింది. గురువు చంద్రబాబుకు శిష్యుడు రేవంత్ రుణం తీర్చుకున్నట్లుగా సంబంధం లేని ప్రచారాలు చాలానే సాగాయి. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ పడే వరకు ముఖ్యమంత్రి రేవంత్ కు కూడా ఈ సమాచారం తెలీదన్న విషయాన్ని తెలుసుకున్న మీడియా ప్రముఖులు సైతం కించిత్ షాక్ కు గురైన పరిస్థితి.
ముఖ్యమంత్రి నోటీసులో లేదంటే సరే. చివరకు జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ విభాగంలోని టాప్ ఆర్డర్ కు సైతం ఎలాంటి సమాచారం లేదన్న మాట హాట్ టాపిక్ గా మారింది. టీవీల్లో ప్రజలకు ఎప్పుడైతే తెలిసిందో.. అప్పుడే సీఎంతో సహా మిగిలిన ముఖ్యలందరికి తెలిసిందన్న మాటతో విస్మయానికి గురయ్యే పరిస్థితి. అలా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే ప్రభుత్వానికి మరింత డ్యామేజ్ జరిగే పరిస్థితి.
కట్ చేస్తే.. ఆదివారం మధ్యాహ్నం మాజీ సీఎం జగన్ లోటస్ నివాసం ముందున్న గదుల్ని కూల్చేసిన ఐఏఎస్ అధికారి అయిన జోనల్ కమిషనర్ మీద బదిలీ వేటు వేయటం మరో సంచలనంగా మారింది. కూల్చటమే పెద్ద తప్పు అయితే.. ఆ పని చేసిన అధికారికి బదిలీతో షాకివ్వటం రేవంత సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ రెండు ఎపిసోడ్ లలో ఇద్దరు మంత్రుల ప్రమేయం ఉండటం.. వారి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ తేలిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే అర్థమయ్యేదేమంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచితనం.. కలుపుగోలుతనమే ఆయనకు శాపంగా మారిందంటున్నారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ అనవసర భేషజాలకు పోకుండా.. పరిధి దాటి వ్యవహరిస్తున్న నేతలకు ముకుతాడు వేసే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవటం కూడా ఇలాంటి పరిస్థితులకు కారణమైందంటున్నారు. ఒక మంత్రి తన సొంత పెత్తనంతో లోటస్ పాండ్ దగ్గరి గదుల కూల్చివేతలో కీరోల్ ప్లే చేస్తే.. ఆ డ్యామేజ్ కు కారణమైన ఐఏఎస్ అధికారిపై చర్యలు తప్పనిసరిగా ఉండాలంటూ మరో మంత్రి తీసుకొచ్చిన ఒత్తిడికి రేవంత్ సర్కారు తలొగ్గక తప్పలేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదంతా చూసిన వారికి.. తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి కంటే మంత్రులే పవర్ ఫుల్ గా ఉన్నారన్న కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది.
అయితే.. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. సీఎం రేవంత్ తనకున్న పవర్ ను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించటమే కారణమని చెబుతున్నారు. ఆయన తీరును అర్థం చేసుకునే విషయంలో కొందరు మంత్రులు చేస్తున్న తప్పులు రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయని చెబుతున్నారు. తమను తాము శక్తివంతులుగా ఫీల్ అవుతున్న కొందరు మంత్రుల కారణంగా ప్రభుత్వం కొలువు తీరలేదన్న వాస్తవాన్ని వారు గుర్తించటంతో పాటు.. ముఖ్యమంత్రిగా రేవంత్ తమకు ఇస్తున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నామన్న విషయాన్ని అర్థం చేసుకోవాలంటున్నారు. కేసీఆర్ పదేళ్ల ప్రభుత్వంలో మంత్రులకు ఉన్న విలువ.. ఇప్పుడు తమకున్న విలువ ఎంతన్న విషయాన్ని గుర్తించి.. జాగ్రత్తగా మసులుకోవాలన్న మాట వినిపిస్తోంది. ఈ విషయంలో తాము చేసే తప్పులు తమకే ముప్పుగా మారతాయన్నది త్వరగా గుర్తించాలన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ విషయాన్ని సదరు మంత్రులు ఎప్పటికి గుర్తిస్తారో?