తెలంగాణలో చిత్రం: టీడీపీ వేడుకల్లో కాంగ్రెస్ మంత్రులు
ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఆ పార్టీ కూటమి కట్టి ఎన్నికల్లో పోటీ చేసింది
By: Tupaki Desk | 5 Jun 2024 5:35 PM GMTఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఆ పార్టీ కూటమి కట్టి ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే.. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 135 చోట్ల ఆ పార్టీ ఒంటరిగానే విజయం దక్కించుకుని మేజిక్ ఫిగర్‌ను దాటేసి మరీ అధికారంలోకి వచ్చే అవకాశం దక్కించుకుంది. దీంతో కనీ వినీ ఎరుగని విజయం ఆ పార్టీకి సొంతమైంది. ఈ సంబరాలను .. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు.. కేవలం ఏపీలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా చేసుకున్నారు. ఇలానే తెలంగాణలోనూ టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
అయితే.. వాస్తవానికి టీడీపీ నేతలు చేసుకునే ఇలాంటి పంక్షన్లకు ఆ పార్టీ నేతలు హాజరు కావడం మామూలే. అయితే.. తెలంగాణలో మాత్రం చిత్రమైన విషయం వెలుగు చూసింది. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట వంటి ఖమ్మం జిల్లాలో జరిగిన సంబరాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారులో మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలను హుషారు పరిచారు. అంతేకాదు..ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మిఠాయిలు కూడా పంచుకున్నారు. పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన వీరిని నేతలు ఘనంగా స్వాగతించారు.
రెండు కారణాలు!
ఇలా.. కాంగ్రెస్‌కు చెందిన నాయకులు టీడీపీ గెలుపు విషయంలో సంబరాలు చేసుకోవడం.. ఆ పార్టీ నేతలతో కలిసి సంబరాల్లో పాల్గొనడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగులు టీడీపీతోనే పడ్డాయి. గతంలో ఆయన మంత్రిగా కూడా.. ఎన్టీఆర్ హయాంలో పనిచేశారు. ఖమ్మంలో బలమైన కార్యకర్తల నిర్మాణంలోనూ ఆయన పాత్ర ఉంది. ఇక, రెండోది.. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు.. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా పనిచేశారు. దీంతో తుమ్మల తన కృతజ్ఞత చాటుకున్నారు.
ఇక, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే.. ఆయన వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చింది వైసీపీలోనే. 2014లో ఆయన వైసీపీ నుంచి ఖమ్మంగా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. తర్వాత.. కొన్నాళ్లకు ఆయన పార్టీ మారారు. బీఆర్ ఎస్‌లోకి వెళ్తారు. గత ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్‌లోచేరి అసెంబ్లీ టికెట్ తెచ్చుకుని పాలేరు నియోజకవర్గంలో పోటీ చేశారు. విజయం కూడా దక్కించుకున్నారు. ఇక్కడ ఈయనకు కూడా.. టీడీపీ శ్రేణులు కలిసి వచ్చాయి. దీంతో ఈయన కూడా కృతజ్ఞత చాటుకున్నారని తెలుస్తోంది.