తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నిక.. త్వరలోనే ఎందుకు?
నిబంధనల ప్రకారం చూస్తే.. తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి 2024 జూన్ 8 లోపు ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 30 Dec 2023 4:44 AM GMTతెలంగాణ రాష్ట్రంలో త్వరలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు తెర లేవనుంది. ఎమ్మెల్సీ గా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయటం.. విజయం సాధించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన.. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో.. ఆయన రాజీనామా చేసిన స్థానం ఖాళీ కావటంతో.. దీనికి సంబంధించిన ఎన్నికల త్వరలో జరగనుంది.
నిబంధనల ప్రకారం చూస్తే.. తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి 2024 జూన్ 8 లోపు ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియను ఎన్నికల సంఘం షురూ చేసింది. దీంతో.. వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. కొత్త ఓటర్ల జాబితాను రూపొందించేందుకు వీలుగా నోటిఫికేషన్ ను జారీ చేశారు.
డిసెంబరు 30న ఓటర్ల జాబితా నోటీసు విడుదల కానుంది. ఫిబ్రవరి 18 వరకు కొత్త ఓటర్లు తమ ఓట్లను నమోదు చేసుకునే వీలు కల్పిస్తున్నారు. ఫిబ్రవరి 21న ముసాయిదా ఓటర్ల జాబితాను రెఢీ చేసి.. దాన్ని అదే నెల 24న పబ్లిష్ చేస్తారు. దీనిపై ఉన్న అభంతరాలను మార్చి 14 వరకు స్వీకరిస్తారు. మార్చి 29న వాటిని పరిష్కరించి తుది జాబితాను ఏప్రిల్ 4న విడుదల చేస్తారు. దీంతో.. ఎమ్మెల్సీ ఎన్నిక హడావుడి నాలుగు జిల్లాల్లోజరగనుంది. ఈ నాలుగు జిల్లాల్లో మూడు జిల్లాల్లో అధికార కాంగ్రెస్ కు బలంగా ఉండటంతో సిట్టింగ్ స్థానం గులాబీ పార్టీ వశం కావటం అంత తేలికైన విషయం కాదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.