Begin typing your search above and press return to search.

తెలంగాణలో మొదలు... నేటి నుంచి మోడల్ కోడ్?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసి.. ఓపెనింగ్స్ మీద ఓపెనింగ్స్ చేసేస్తుంది తెలంగాణ ప్రభుత్వం!

By:  Tupaki Desk   |   9 Oct 2023 5:14 AM GMT
తెలంగాణలో మొదలు... నేటి నుంచి  మోడల్  కోడ్?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసి.. ఓపెనింగ్స్ మీద ఓపెనింగ్స్ చేసేస్తుంది తెలంగాణ ప్రభుత్వం! మరోపక్క కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థులపై కసరత్తులు చేస్తున్నాయి. అవికూడా ఆల్ మోస్ట్ చివరి దశకు వచ్చాయని చెబుతున్నారు. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం ప్రకటించబోతోంది.

అవును... సోమవారం (అక్టోబర్ 9) మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణతో సహా ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించబోతోంది. ఈ ఏడాది రాజస్థాన్, ఛత్తీస్‌ గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... కేంద్ర ఎన్నికల సంఘం పని మొదలుపెట్టేసింది. డిసెంబర్‌ తొలి వారంలోపు ఎన్నికలు జరగొచ్చని ఈసీ వర్గాలు గతంలో పేర్కొన్నాయి కూడా!

అయితే... ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో మోడల్‌ కోడ్‌ వెంటనే అమల్లోకి వస్తుందని అంటున్నారు. దీంతో.. ఇక ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్రం కానీ ఎలాంటి అభివృద్ధి పనులను ప్రకటించడం కానీ, ప్రారంభించడం కానీ, ఏ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం గానీ చేయలేరు! అయితే ఇలా కార్యక్రమాల ఓపెనింగ్స్ విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని, చక చకా ముగించేసింది.

ఇందులో భాగంగా... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడానికి గత వారం రోజులుగా కేంద్ర ఎన్నికల కమిషనర్, ఇతర సభ్యులు తెలంగాణలో పర్యటించినప్పుడు, అన్ని పార్టీల నేతలను కలుసుకు సమయంలోనే ప్రభుత్వం చక చకా పనులు చేసేసిందని అంటున్నారు. ఇందులో భాగంగా... తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ... ప్రారంభోత్సవాలు చేసేశారని అంటున్నారు.

అయితే... ప్రాజెక్టులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మరోపక్క విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క సీఎం అల్పాహార కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు శాతం మధ్యంతర ఉపశమనంతో పాటు కొత్త వేతన సవరణ కమిషన్‌ ను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం బీఆరెస్స్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ప్రారంభించింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం తరహాలో ఉద్యోగులు, పెన్షనర్లకు.. వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత, అధిక నాణ్యత వైద్యాన్ని అందిస్తోంది.

మరోపక్క మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో భాగంగా... గత వారం రోజుల నుంచి బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవబోతోన్న నేపథ్యంలో... మిగిలిన కార్యక్రమాలు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడినట్లే అని అంటున్నారు.

కాగా... మిజోరాం అసెంబ్లీ పదవీకాలం డిసెంబర్‌ తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఛత్తీస్‌ గఢ్ అసెంబ్లీ పదవీకాలం జనవరిలో ముగియనుంది. ఇదే క్రమంలో... మధ్యప్రదేశ్ అసెంబ్లీ, రాజస్థాన్ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం కూడా జనవరిలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా ఎన్నికల సంఘం ఈ ఐదు రాష్ట్రాల్లో నిరంతరం పర్యటిస్తోంది.

ఇందులో భాగంగానే ఈ మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ క్రమంలోనే ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ ను ప్రకటించే అవకాశముంది.