Begin typing your search above and press return to search.

మోడీ కేబినెట్ లో తెలంగాణ బెర్తు ఎవరికి?

హైదరాబాద్ మహానగరంలోని నాలుగు నియోజకవర్గాలు (హైదారాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల) ఉండగా.. మూడింటిలో బీజేపీ విజయం సాధించింది.

By:  Tupaki Desk   |   9 Jun 2024 6:37 AM GMT
మోడీ కేబినెట్ లో తెలంగాణ బెర్తు ఎవరికి?
X

ఈ రోజు రాత్రి 7.15 గంటల వేళలో దేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి పెద్ద ఎత్తున విదేశీ అతిధులతో పాటు.. దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖుల్ని.. సాదాసీదా ప్రజలను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీ కేబినెట్ లో తెలంగాణ కోటా కింద చోటు దక్కించుకునేది ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఎందుకంటే.. ఈసారి రికార్డు స్థాయిలో తెలంగాణలో 8 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఎంపీ స్థానాల్ని బీజేపీ దక్కించుకోవటంతో పాటు.. దక్షిణాదిన ఆ పార్టీకి వచ్చిన సీట్లతోనే ఈ రోజున కేంద్రంలో కొలువు తీరుతున్న పరిస్థితి. మారిన సమీకరణాల నేపథ్యంలో సౌత్ కు ఈసారి మంత్రివర్గంలో పెద్ద పీట వేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

దీంతో.. తెలంగాణ నుంచి ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల నుంచి.. బీజేపీ ప్రముఖుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మోడీ కేబినెట్ లో బెర్తు దక్కించుకునేది హైదరాబాద్ పరిసరాల నుంచి గెలుపొందిన ముగ్గురిలో ఒకరికి చోటు ఖాయమని చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని నాలుగు నియోజకవర్గాలు (హైదారాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల) ఉండగా.. మూడింటిలో బీజేపీ విజయం సాధించింది.

ఈ ముగ్గురు సీనియర్ నేతలు కావటం.. అందరూ మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు అర్హత ఉండటంతో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి గత ప్రభుత్వంలోనూ కేబినెట్ మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఈసారి మల్కాజిగిరి నుంచి గెలిచిన ఈటల రాజేందర్.. చేవెళ్ల నుంచి విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిల్లో ఈసారి ఒకరికి బెర్తు ఖాయమంటున్నారు. అదే జరిగితే.. కిషన్ రెడ్డికి ఈసారి అవకాశం దక్కకపోవచ్చని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. కిషన్ రెడ్డిని జాతీయ పార్టీలోకి తీసుకెళ్లి.. రాష్ట్ర పగ్గాల్ని వేరే వారికి అప్పజెబుతారని.. కేంద్రంలోనూ ఒకరిని మంత్రిని చేస్తారంటున్నారు. అయితే.. ఈ అవకాశం ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా దీనికి సంబంధించిన సస్పెన్స్ ఈ రాత్రికి తీరిపోనుంది.