ముదిరాజ్ మొగ్గు ఎటువైపో ?
దీనికి కేసీయార్ సమాధానం చెప్పగలరా ? ముదిరాజ్ లకు ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా కేటాయించవద్దని కేసీయార్కు ఈటెలే చెప్పారా ?
By: Tupaki Desk | 6 Nov 2023 5:07 AM GMTమొన్ననే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేరిక సందర్భంగా కేసీయార్ ఎన్ని మాటలు మాట్లాడారో అందరు విన్నదే. కేసీయార్ మాటల్లో మాత్రం అద్భుతమనిపిస్తారు. తర్వాత ఆచరణలో చూస్తే డొల్లతప్ప ఇంకేమీ ఉండదు. కాసాని బీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ పై ఎన్ని ఆరోపణలు చేశారో అందరు విన్నదే. బీఆర్ఎస్ లో ఉన్నపుడు ఈటల మరో ముదిరాజ్ నేతను ఎదగనీయకుండా తొక్కేసినట్లు సొల్లు చెప్పారు.
ఇంతకాలానికి కాసాని రూపంలో ముదిరాజ్ లో పెద్ద మనిషి చేరినట్లు కేసీయార్ చాలా గొప్పగా చెప్పారు. అయితే ఇదే విషయమై ముదిరాజ్ లు మండిపోతున్నారు. కారణాలు ఏమిటంటే ముదిరాజ్ సామాజికవర్గానికి కేసీయార్ ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. పార్టీలో ఈటల రాజేందర్ ఉన్నపుడు మరో ముదిరాజ్ నేతను పైకి ఎదగనీయకుండా తొక్కేసింది నిజమే అని అనుకుందాం. మరి పార్టీని ఈటల వదిలేసి రెండేళ్ళయ్యింది. మరీ రెండేళ్ళల్లో కేసీయార్ పదిమంది ముదిరాజ్ నేతలను ఎందుకని పికప్ చేయలేకపోయారు.
సరే పికప్ చేయలేకపోయారు బాగానే ఉంది రాబోయే ఎన్నికల్లో ముదిరాజ్ సామాజికవర్గానికి ఒక్క టికెట్ కూడా ఎందుకు కేటాయించలేదు ? దీనికి కేసీయార్ సమాధానం చెప్పగలరా ? ముదిరాజ్ లకు ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా కేటాయించవద్దని కేసీయార్కు ఈటెలే చెప్పారా ? కేసీయార్ ముదిరాజ్ లకు టికెట్లు కేటాయించాలని అనుకున్నా ఈటలే అడ్డుపడ్డారా ? ఈ ప్రశ్నలకు కేసీయార్ సమాధానం చెప్పగలరా ?
తన తప్పులను ఇతరులపైకి నెట్టేయటం కేసీయార్ కు మొదటినుండి అలవాటే. ఇదే విషయాన్ని ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శివముదిరాజ్ ఆరోపించారు. 60 లక్షల మంది ముదిరాజ్ ఉన్న సామాజికవర్గానికి కేసీయార్ ఒక్క టికెట్ కూడా ఎందుకివ్వలేదో చెప్పాలన్నారు. మొదటినుండి ముదిరాజ్ సామాజికవర్గం అంటేనే కేసీయార్ కు చిన్నచూపని మండిపడ్డారు. మొదటినుండి కేసీయార్ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలే చేస్తున్నట్లు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ముదిరాజ్ లు తగిన బుద్ధిచెప్పటం ఖాయమని హెచ్చరించారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.